Revolutionary Road (2008)

Category:

April Wheeler: “You’re the most valuable and wonderful thing in the world…You’re a man”.
1955 ప్రాంతంలో ఉన్నాం మనం. ఆరోజు ఫ్రాంక్ వీలర్ పుట్టినరోజు. క్రితం రాత్రే నాటకం నుంచి వస్తూండగా, ఫ్రాంక్, ఏప్రిల్ ఇద్దరికీ తీవ్రంగా వాదోపవాదాలు జరిగి, తీవ్రస్థాయిలో ఒకరినొకరు తీవ్రంగా నిందించుకోవడమూ, దూషించుకోవడమూ, ఒకరిమీద ఒకరికున్న ద్వేషాన్ని ప్రదర్శించుకోవడం కూడా అయిపోయింది. తీవ్రమైన అసహనం ఇద్దరినీ ఆవహించిన క్షణంలో కారు బానెట్ మీద నాలుగు దెబ్బలు వేసి చేతిని నలగ్గొట్టుకుని కకావికలమైపోయిన మనసుతో ఫ్రాంక్ బాధా కోపమూ రెండూ కలగలిసి కిందా మీదా అవుతూండగా, వెలుగుతున్న సిగరెట్టుని కాలికింద నలిపేసి ఏప్రిల్ ఇంటికి పోదాం పదమంటుంది. ఫ్రాంక్ అనుసరిస్తాడు. ఇంటిదగ్గర పిల్లలిద్దరూ ఎదురు చూస్తున్నారు. ఎనిమిదేళ్ళ అమ్మాయి, ఆరేళ్ళ అబ్బాయి. చాలా ఏళ్ళుగా రంగస్థల నటిగా నిలదొక్కుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఫలితాలివ్వడం లేదు. ప్రేక్షకులందరూ ఏప్రిల్ ను సరైన నటిగా గుర్తించరు. తన న్యూనతలో తను సతమతమౌతూ ఉండగా, తన అస్థిత్వ సమస్యలతో ఫ్రాంక్ ఆసరికే నిస్పృహలో కూరుకుపోయి ఉంటాడు. సగటు మిడిల్ ఏజ్ క్రైసిస్ ముంగిట దాదాపు నిలబడి ఉంటాడు ఫ్రాంక్. ఇల్లూ, పిల్లలూ, భార్యా, ఎదుగుదల పెద్దగా లేని ఉద్యోగమూ,జీవితంలో ఏ వెలుగురేఖా ఇప్పటిదాకా పొడసూపని సరళరేఖ ల్లాంటి నిరాశామయమైన జీవితాలిద్దరివీ.తనకంటూ ఏ ఉత్ప్రేరకమూ లేని,తమదంటూ ఏదీ చేయలేని సరాసరి మధ్యతరగతి యువ తల్లిదండ్రులు.వయసూ మీరలేదు,అయినా తమ స్వంతం కోసం ఏ సొంత నిర్ణయమూ తీసుకోలేని లాక్డ్ ఇన్ జీవితాలు.
ఫ్రాంక్,ఏప్రిల్ ఇద్దరూ కొన్నేళ్ళ క్రితం ఒక పార్టీలో కలుసుకున్నారు. ఏదో చేయబోయి ఎక్కడో తేలిన ఫ్రాంక్. ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ మరుసటి వారం నుంచి ఒక కాఫీ షాపులో కేషియర్ ఉద్యోగం దొరికిందంటాడు ఏప్రిల్ తో. కొంత ఎక్కువ డిగ్నిఫైడ్ జాబ్, ప్రస్తుతం చేస్తున్న షిప్ యార్డులో ఉద్యోగం కంటే అంటూ ఎంతో ఉత్సాహంగా మాట్లాడుతూంటాడు. అందగాడు. నవ యువకుడు. ఠీవీ, సొగసూ రెండూ పుష్కలంగా కనబడుతూన్న మేచిస్మో మేన్, ఫ్రాంక్ వీలర్.
పొద్దున్న ఫ్రాంక్ మామూలుగా పనికెళ్ళిపోయాడు. ఆఫీసులో తయారు చేసిన సేల్స్ బ్రోషర్ సరిగా లేదని మాటలు పడతాడు. నిస్పృహ. ఏకాగ్రత లేదు. ఎప్పుడో ఆరిపోయిన ఒక వెలుగు తనలో అవశేషంగా కనబడుతూ ఉంటుంది. తెలివైనవాడే, కానీ జీవితంలో ఆశా, పాజిటివ్ ధృక్పధమూ కనబడదు. లాక్కొని వస్తున్న ఉద్యోగం. చాన్నాళ్ళుగా నలిపేస్తున్న రొటీన్ జీవితంతో దాదాపు మొద్దుబారి (numbness) ఉంటాడు ఫ్రాంక్. లిఫ్టులో కనబడ్డ టైపిస్ట్ అమ్మాయిని ఆపూటే ఏం బుద్ది పుట్టిందో ఏమో, ఆ రోజు లొంగదీసుకుంటాడు. నిజానికి దాంపత్యానికి ద్రోహం చేశాడు. ఆ అపరాధభావన తనలో ప్రవేశించి అతన్ని తినేయడం మొదలౌతుంది కూడా.
ఇక్కడ అదే సమయంలో పొద్దుంటి నుంచీ ఇంటి పనుల్లో సతమతమౌతూ ఎక్కడో శూన్యంలోకి ఆలోచిస్తున్న ఏప్రిల్, విరామం దొరికిన సమయంలో గతంలోకి జారుకుంటుంది. పార్టీలో కలుసుకున్న రోజులు, నాటకాల్లో నటిగా పేరు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తూ, ఫ్రాంక్ తో పరిచయం, ప్రెగ్నెన్సీ (ముందుగా ప్రెగ్నెన్సీ రావడం, పెళ్ళి చేసుకోవాలని నిశ్చయించుకోవడం జరిగుంటుంది),పెళ్ళి, కనెక్టికట్ సిటీలో సెటిల్ కావడానికి నిశ్చయించుకోవడం, ఫ్రాంక్ తండ్రి ఒకప్పుడు పని చేసిన కంపెనీలోనే సేల్స్ మన్ గా ఉద్యోగంలో కుదురుకోవడం అంతా కళ్ళముందు తిరుగుతుంది. ఒకప్పుడు జీవించడం అంటే ప్రతి చిన్న విషయాన్ని గ్రహిస్తూ ఎరుకలో ఉండడం లాంటి గొప్ప గొప్ప మాటలని పలికి, జీవితాన్ని పిల్లలూ పెళ్ళి కారణం మీద చాలా వరకూ కుదించుకునేసి లాక్కొస్తున్న ఫ్రాంక్ మీద జాలీ,ప్రేమా ఒక్క సారిగా పొంగుకొస్తుంది ఏప్రిల్ కు. ఫ్రాంక్ ఫోటోలని చూస్తూ, పారిస్ గురించి అతను ఒకప్పుడు చెప్పిన మాటలని గుర్తుకు తెచ్చుకుంటుంది. పారిస్ లో బతకడం అంటేనే జీవించడం అంటూ అతనికి పారిస్ చాలా ఇష్టమైన ప్రదేశం అని, అక్కడే స్థిరపడాలని ఉందనీ అంటాడొకప్పుడు. అతని భావాలకు, ఆలోచనలకు బాగా ప్రభావితురాలై జీవితం పంచుకునేందుకు కూడా మానసికంగా సిద్దపడిపోయుంటుందా క్షణంలో.
అదే పూట ఈ ఇంటిని తమకు చూపిన రియల్ ఎస్టేట్ ఏజంట్ తలుపు తడుతుంది. ఈ ఊళ్ళో కాపురం పెట్టాలనుకున్నాక,ఇల్లు వెతుకున్నప్పుడు ఈ ఇల్లు వాళ్ళకి ఎందుకు అన్నివిధాలుగా అనుకూలమైనదో గొప్పగా చెప్తూ ఈ జంటని అమితంగా ఇష్టపడ్డానని చెప్పి, ఇల్లు కొనిపించాక, వీరితో అత్యంత సఖ్యంగా, కుటుంబ స్నేహితులుగా మారిపోయిన హెలెన్ కుటుంబం. పెద్దావిడ. ఒక్కగానొక్క కొడుకు. అతనొక మానసిక వ్యాధికి వైద్యం చేయించుకుంటూ ఉంటాడు. జాన్ అతని పేరు. వారింట్లో హెలెన్ భర్తతో కలిపి ముగ్గురే. అతన్ని కాస్త సామాజిక జీవితంలోకి తీసుకొస్తే కొంత బాగుపడతాడని ఆశిస్తూ అందుకు ఏప్రిల్ సహాయం కోరుతుంది. ఒప్పుకుని పంపేస్తుంది ఆవిడని.
ఫ్రాంక్ ఆ రోజు ఆలస్యంగా ఇంటికొస్తాడు. బయట నుంచుని చీకట్లో ఇంటివైపు బెంగగా చూస్తాడు. తలుపు తట్టిన ఫ్రాంక్ ను ఆశ్చర్యానికి గురిచేస్తూ పుట్టినరోజు పండగని పిల్లలతో కలిసి ఘనంగా జరుపుతుంది ఏప్రిల్. ఆ రాత్రి ఇద్దరూ వైన్ సేవిస్తూ ఉండగా ఒక ఆలోచన చెప్తుంది. ఆరు నెలలకు సరిపడా డబ్బులున్నాయి, ఇల్లూ, కారూ అమ్మేస్తే వచ్చే డబ్బులతో పారిస్ వెళ్ళిపోదామని. అక్కడ తనో క్లర్క్ ఉద్యోగం వెతుక్కుంటే, ఫ్రాంక్ తనకు నచ్చిన, అభిరుచి ఉన్న పని చెయ్యడం మొదలు పెట్టొచ్చు అంటే, ఫ్రాంక్ ఆ ఆలోచన ఆచరణ సాధ్యం కానిది అంటూ తేల్చేస్తాడు. కానీ ఏప్రిల్ పట్టు వదలకుండా ఫ్రాంక్ తనకు నచ్చిన జీవితాన్ని నచ్చిన పని చేస్తూ అనుభవించడం అనేది సాధ్యమయ్యే అవకాశం ఉన్నప్పుడు ఆ దారి తొక్కడమే మంచిదని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. నూతనోత్సాహం రాగా, ఎంతో ఉత్తేజంతో ఒప్పుకుంటాడు. ఇక మిగిలింది ఇమ్మిగ్రేషన్ పని మొదలు పెట్టడమే.
మరుసటి రోజున పొద్దున, ఫ్రాంక్ ఒక కొత్త ఉత్సాహం తన్నుకొస్తూ ఉంటే ఆఫీసులోకి ప్రవేశిస్తాడు. క్రితం రోజు మాటలు పడ్డ వ్యవహారాన్ని చక్కగా పరిష్కరిస్తాడు. సెల్లింగ్ పంచ్ లైన్ ‘ Speaking of Production Control ‘ అని నిర్ణయించేసి ప్రింటింగుకి పంపేస్తాడు. 1950ల్లో లెక్కల వ్యవహారం నిర్వహించగలిగే తొలి తరం కంప్యూటర్లాంటివన్నమాట వీరు అమ్మే ప్రోడక్ట్. సహోద్యోగులకి లంచ్ టైములో విషయం చెప్తూ, ప్రతీ మనిషి తనకు నచ్చిన పనిని వెతుక్కునేందుకు కృషి చేయాలంటూ ఉపన్యాసాలు ఇస్తాడు. నచ్చిన ప్రదేశంలో, నచ్చిన ఉద్యోగం వెతుక్కునే వెసులుబాటు, కొత్త దేశం అదీ అమెరికన్లలో ఎక్కువ శాతం వెకేషన్ కి, హాలిడే కి ఎంచుకునే దేశం, ఇక కొలీగ్స్ నానా హైరానా పడుతూ అసూయను బాహాటంగానే ప్రదర్శిస్తూన్నా నిజానికి సంతోషాన్నే ప్రకటిస్తారు ఫ్రాంక్ అదృష్టానికీ, నిర్ణయానికీను. సెంట్రల్ స్టేషన్ లో అత్యంత సంతోషంగా కనబడుతూ ఇంటికెళ్ళే రైలెక్కుతాడు.
అంతే ఆనందంగా ఇంటికొస్తాడు. బయట లాన్ లో పిల్లలు ఆడుకుంటూండగా వరండాలో కూర్చుని ఎదురు చూస్తున్న ఏప్రిల్ కళ్ళల్లో మెరుపు. ఆరోజు మధ్యాహ్నమే ట్రావెలర్స్ చెక్కులూ, స్టీమరు టికెట్లూ తీసుకుని ఇంటికొస్తుంది ఏప్రిల్. కారాపి ఇంటివైపు అడుగులు వేస్తున్న ఫ్రాంక్, అటువైపు నుంచి ఏప్రిల్ ఇద్దరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒకరికొకరు సంతోష ప్రకటన చేసుకుంటారు. శనివారం సాయంత్రం తాలూకు ఆనందం. జీవితంలో రాబోయే ఆనందం తాలూకు భావన మనసునిండా నింపుకున్న కుటుంబం. డిన్నర్ తరువాత గ్లోబ్ లో పారీస్ ఎక్కడుందో పిల్లలకు చూపుతూ ఉక్కిరిబిక్కిరౌతున్న కుటుంబం. ఆ కుటుంబం సంతోషంలో మనమూ భాగం కావడాన్ని ఆపలేం కూడా.
మరుసటి రోజు సాయంత్రం పొరుగునే బాగా స్నేహితులైన మిల్లీ, షెర్ప్ ఇంటికి వెళ్ళి విషయం చెప్తారు. యాభైలనాటి సామాజిక నేపథ్యం అర్థమౌతూనే ఉంటుంది మనకి. భర్త సంపాదించడం, భార్య ఇంటిని చక్కదిద్దుకోవడం, పిల్ల పెంపకమూ శిక్షణా చూసుకోవడం. రెండో ప్రపంచ యుద్ధం నాటికే అమెరికాలో స్త్రీలు ఉద్యోగాల్లో పోటీ పడడం మొదలైనా పూర్తిగా వారు ఇండిపెండెంట్ కాకపోవడం గమనించొచ్చు. వీరి నిర్ణయానికి ముందు విస్తు పోతారు ఆ భార్యా భర్తలు. ఎప్పుడూ సెల్ఫ్ పిటీ తో, ఏప్రిల్ మీద ఈర్ష్యతో బాధ పడే మిల్లీ, ఒక లాంటి మైమరుపుని అదే ఏప్రిల్ మీద కలిగిన షెర్ప్. నలుగురు పిల్లలున్న తండ్రి అయినా సేం ఓల్డ్ ఫ్లర్టింగ్, కాకపోతే డిగ్నిఫైడ్ గా, బయట పడకుండా. ఏప్రిల్ సపోర్ట్ చేస్తూండగా ఇంటిని చూసుకుంటూ తనకు నచ్చిన పనిని వెతుక్కోవడమో, చదువుకోవడమో చేస్తామని చెప్తూ. వయసూ- జీవితమూ మమ్మల్ని దాటిపోయేలోగానే మాకు నచ్చినట్లు జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటున్నామని చెప్పొస్తారిద్దరూ. అదొక ఫిలసాఫికల్ మెటాఫార్, కానీ వారికర్థమైనట్లు కనబడదు కానీ అసూయ మాత్రం బయటపడిపోతుంది. ఆ ఇద్దరూ బాహాటంగానే అసూయ ప్రకటిస్తారు. మిల్లీ షెర్ప్ ఇద్దరిలో ఉన్న వైరుధ్యాలు, ఒకరంటే ఒకరికున్న మొక్కుబడి ప్రేమలు, ఎక్కడ పట్టు జరిపోతాడని అస్తమానూ భయపడే గృహిణి లా కనబడే మిల్లీ, వీరు వెళ్ళిపోతున్న కారణానికి అసూయా, ఉపశమనం పొందుతూ ఉందా అర్థం కాదు. అప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారం చూస్తే సగటు అమెరికన్ గృహిణి చాలా వరకూ డిపెండెంట్. ఇన్సెక్యూర్డ్ అండ్ జెలస్. మగాడు దురుసుగా ఉండడం, కఠినంగా వ్యవహరించడం,ఆధిపత్యం అందినచోటల్లా ప్రదర్శించడం.
ఇంటికొచ్చిన ఏప్రిల్, ఫ్రాంక్ ఇద్దరూ ఆ పొరుగింటివారి అవస్థల్ని గమనించి పగలబడి నవ్వుకుంటారు. ఆ రోజు వారి జీవితం లో ఎన్నో ఏళ్ళుగా ఎప్పుడూ లేని ఆనందాన్ని అనుభవంలోకి తీసుకొచ్చిన రోజు, అన్ని రకాలుగా. ఆదివారం తాలూకు భావన శనివారం సాయంత్రం నుండే మొదలైనట్లు…
పొద్దున్న ఆఫీసులో కంపెనీ ప్రెసిడెంటు పిలిపిస్తాడు ఫ్రాంక్ ని. ఇతను వారం ముందు ఇచ్చిన ‘ స్పీకింగ్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్ ‘ అనే కాప్షన్ కి బాగా ఇంప్రెస్ అయిపోతాడు. అంతవరకూ ఒకలా ఉన్న ఫ్రాంక్ ఆఫీసులో ఒక మాదిరి హీరో అవుతాడు. ఇక్కడ ఇంట్లో ఆ సాయంత్రం చేతిలో క్విక్ లెర్నింగ్ ఫ్రెంచ్ పుస్తకాన్నొకటి చేతపట్టుకుని అదే సంగతి భార్యతో చెప్తూ నవ్వుకుంటూ ఉంటారు. బయట కారాగిన శబ్ధానికి చూస్తే హెలెన్ తన భర్త, కొడుకుతో హాజరు. పరిచయాలయ్యాక టేబిల్ దగ్గర సంభాషణ మొదలౌతుంది. తల్లికీ, కొడుక్కీ కొంత వాగ్యుద్దం మొదలయ్యాక ఫ్రాంక్, జాన్ ( హెలెన్ కొడుకు ) తో మాటలు కలుపుతాడు. బిజినెస్ మెషీన్లు అమ్మే ఉద్యోగం లో ఉన్నా కాకపోతే అదొక స్టుపిడ్ జాబ్ అని ఫ్రాంక్ అంటే, మరి దాన్నెందుకు చేస్తున్నావని జాన్ అడుగుతే సమాధానం చెప్పేంతలో జాన్ తండ్రి కలుగజేస్కుని ఇలాంటి ప్రశ్నలు వేయకూడదని వారిస్తే సమాధానం తనే చెప్తాడు. ఇలాంటి అందమైన ఇల్లు, సంసారం కావాలంటే ఏదొక ఉద్యోగం ఉండాలి, ఇష్టమో, అయిష్టంగానో అని. ఫ్రాంక్ వప్పుకుంటాడు. అందుకే ఉద్యోగం వదిలేసి ఫ్రాన్స్ వెళ్ళిపోతున్నామని చెప్తాడు. వెంటనే తన తల్లిని అపహాస్యం చేస్తూ ‘ ద నైస్ యంగ్ వీలర్ ఫేమిలీ ఈజ్ టేకింగ్ ఆఫ్ ‘ అంటూ. హెలెన్ కు ఈ సంగతి తెలీదప్పటివరకూ. ఫ్రాంక్ వీలర్ కుటుంబం అంటే చాలా సార్లు ఇష్టమని అనేక సార్లు బాహాటంగా చెప్తూ ఉంటుంది. ఫ్రాంక్ వీలర్ కుటుంబం అంటే అందరికీ ఒక జెలసీ లాంటి భావన. మనకి సరిగా అర్థం కాదు.
గాలి పీల్చుకుందాం రమ్మంటూ వాతావరణాన్ని తేలిక చేద్దామని జాన్ ని బయటకు తీసుకెళ్తారు ఫ్రాంక్ దంపతులు. ఆ చిట్టడివిలో ముగ్గురూ నడుస్తూండగా సంభాషణ సాగుతుంది. జాన్ గతంలో ఒక పీ హెచ్ డీ మేథమెటీషియన్ కానీ ఇప్పుడు కాదంటాడు. ముప్పై ఏడు సార్లు ఎలెక్ట్రిక్ షాక్ ఇచ్చిన దెబ్బకు ఉన్మాదం బయటకు పోవలసింది, మెదడులో లెక్కలంతా వెళ్ళిపోయాయని జోకులేస్తాడు. విచారం ప్రకటించి, మంచి మాటలు చెప్పిన ఏప్రిల్ ని అభిమానిస్తూ ఫ్రాంక్ కు చెప్తాడు, ఐ లైక్ యువర్ గర్ల్ అంటూ. మరి మీలాంటి జంట ఇలాంటి జీవితం నుంచి ఫ్రాన్స్ కు ఎందుకు పారిపోతున్నారని అడుగుతాడు. జీవిత గమ్యాన్ని కొత్తగా నిర్వచించుకోవడానికంటుంది ఏప్రిల్. ఫ్రాంక్ అప్పుడంటాడు ఒక అద్భుతమైన మాట- ‘ May be we are running. We are running from the hopeless emptiness of the whole life here, right? ‘ అంటూ ఏప్రిల్ వైపు చూస్తాడు. Hopeless Emptiness అంటూ నిలబడ్డచోటనే ఆగిపోతాడు జాన్ వీళ్ళిద్దరినీ చూస్తూ. Now, you said it, plenty of people are on to the emptiness, but it takes real guts to see the hopelessness. Wow !‘అక్కడితో ఆ సంభాషణ ముగుస్తుంది.
ఆ రాత్రి వీళ్ళిద్దరూ మాట్లాడుతూండగా నేపధ్య సంగీతం మన మనసులోతుల్లో ఒక లాంటి దిగులునీ, ఒక ప్రకంపననీ తీసుకొస్తూ ఉంటుంది. జాన్ ఒక్కడే మనమేం ఆలోచిస్తున్నామో, మాట్లాడుతున్నామో సరిగ్గా అర్థం చేసుకున్నాడని ఏప్రిల్ అంటుంది. నిజమే, కదా? అంటాడు ఫ్రాంక్. మే బి, మనం జాన్ అంత క్రేజీ మనుషులమే ఏమో అంటాడు. మళ్ళీ ఒక ఆణిముత్యం జారిపడుతుంది,ఈ సారి ఏప్రిల్ నుంచి.
‘If being crazy means living life as if it matters, then I don’t care if we are completely insane. Do you?’
‘No’
‘I love you so much.’
(కథకు చిన్న విరామం. ఆశారహిత శూన్యం-Hopeless Emptiness అనేది ఇక్కడ ఈ సినిమాలో, అంటే మూల కథగా వచ్చిన నవల్లో ఎలా కాయిన్ చేశారనేది చాలా సంభ్రమంగా తోచింది. శూన్యం ఏమిటో మనకు తెలుసు. శూన్యాన్ని గ్రహించిన వారినీ తెలుసు. కానీ, ఎలాంటి ఆశావాదమూ అలవడే వీలు లేక, కంటిముందు కనబడక, అనుభవంలోకీ రాక, ఒక శూన్యం ఆవరించి ఉండడం. ఆ మానసిక శక్తిహీనుడు జాన్ , సినిమాలో ఎలా పట్టుకున్నాడో, ఈ మాట నన్నలా పట్టుకుంది. ఆలోచించే కొద్దీ ఏ ఆశంటూ మిగలని శూన్యత తాలూకు స్పృహ ( Not Numb ), ఆ రికగ్నిషన్ అనేది మామూలు శిక్ష కాదు. అనుభవేకమైతే కానీ అర్థమూ కాదు. బ్లెస్డ్ ఆర్ ద సోల్స్ హూ కెన్ నెవెర్ గెట్ ఇంటు ‘ఎరుక ‘. Emptiness గురించి Conscious గా ఉండడం గొప్ప కాదు, శిక్ష. అది ముందు ముందు కథలోకెళ్తే తెలుస్తుంది).
ఆకస్మికంగా ఆ రోజు పొద్దున ఆఫీసులో కంపెనీ యజమాని వచ్చి కూర్చున్నాడు. ఫ్రాంక్ చేసిన సేల్స్ బ్రోషర్ ఆయనకు నచ్చడం కాదు, కొత్తగా ఏర్పాటు చేయబోయే కంప్యూటర్స్ (మొదటి తరం కంప్యూటర్ రోజులవి ) అమ్మకాల విభాగానికి ఫ్రాంక్ ని హెడ్ చేసెయ్యడానికి కూడా నిశ్చయించుకున్నాడని ఆరోజు లంచ్ కి బయటికి తీసుకొచ్చి మరీ చెప్తాడు. తటపటాయిస్తూ, ఫ్రాన్స్ వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నామని ఇతను చెప్తే కంపెనీ ఓనరు విస్తుపోయి ఎందుకు ఆ నిర్ణయం సరికాదో చెప్తూ అదే కంపెనీలో ఇరవై ఏళ్ళు పని చేసిన ( ఓనరుకు ఫ్రాంక్ తండ్రెవరో గుర్తు లేదనే అంటాడు ) ఫ్రాంక్ తండ్రికి ఇతని కొత్త స్థానం మంచి పేరు కూడా తెచ్చిపెడుతుందంటూ, కొత్త స్థానం తీసుకోవడం వలన ఇక వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఇంకెప్పుడూ రాదని కూడా ఆశ పెడతాడు. ప్రాక్టికల్ గా చూస్తే అట్లాంటి సంభాషణ, అదీ కంపెనీ యజమానితో అనేది మామూలు విషయం కాదు ఫ్రాంక్ లాంటి సెకండ్ లేయర్ ఉద్యోగికి. ఆ రోజు సాయంత్రం ఇతను కంపెనీలో ఒక బిగ్ షాట్ అవబోతున్నాడని తెలుస్తుంది. కొన్ని రోజుల ముందు ఇతను గడిపిన టైపిస్టు కూడా ఇతన్ని గొప్ప ఆరాధనతో చూడడం, ఆ రాత్రి డిన్నరు కి ఆహ్వానించడం జరుతుంది. ఫ్రాంక్ ఇప్పుడు బేక్ టు స్క్వేర్ వన్ మానసికంగా, ఫ్రాన్స్ విషయంలో. చెప్పకపోయినా పునరాలోచనలో పడినట్లైతే మనకు అనిపిస్తుంది.
మరుసటిరోజు పొద్దున్న ఏదో పని చేసుకుంటూ ఏప్రిల్ పిల్లల్ని తీవ్రంగా కోప్పడుతూ ఉంటే చూసిన ఫ్రాంక్ విషయం ఏదో ఉందనిపించి అదే అడుగుతాడు. విషయం నీక్కూడా అనుమానం రాకపోవడం ఏమిటి, నేను ప్రెగ్నెంట్ అంటుంది. తీవ్రంగా ఆలోచనలో పడిపోయిన్ ఫ్రాంక్, ఆందోళనలో ఉన్న ఏప్రిల్ ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ విషయాన్ని ఎలా కలిసి ఎదుర్కోవాలో ఆలోచించడం మొదలుపెడతారు. అప్పటికే పన్నెండు వారాలయ్యింది కానీ ధృవపడిందిప్పుడే.
షెర్ప్, మిల్లీ కుటుంబంతో బీచ్ కు వెళతారు. అక్కడ షెర్ప్ తో బయటపెడతాడు ఫ్రాంక్ తనకొచ్చిన కొత్త ఆఫర్ గురించి. ఏదో ఎప్పుడో చేసిన ఒక mediocre వర్క్ ని చూసి ఇంప్రెస్ అయిపోయి తనను స్పెషలిస్ట్ సేల్స్ టీములో చేర్చుకోవడానికి నిర్ణయించారంటూ, జీతం కూడా బాగా పెంచే తీసుకుంటున్నారు మరి అలాంటప్పుడు అది మంచి అవకాశమే కానీ ఈ సమయంలో ఆ ఛాన్సు రావడం విషాదం కాదా అంటూంటే అది వింటూ ఉన్న ఏప్రిల్ షాక్ కు గురైపోయి ఫ్రాంక్ ను దూరంగా తీసుకువెళ్ళి నిలదీస్తుంది, ఏమిటి సంగతి అంటూ. నువ్వు ఆ కొత్త ఉద్యోగపు ఆఫర్ ను ఒప్పుకోలేదని అనుకుంటున్నా అంటే, ఇంకా వద్దని చెప్పలేదంటాడు. దాన్నొక ఆప్షన్ కింద పెట్టాను, అంతే అని సమాధానమిస్తాడు. వాళ్ళు ఇవ్వజూపుతున్న జీతం కనుక చూస్తే, మనం బతుకుతున్న పద్దతి మొత్తం మారిపోయే అవకాశం ఉంది. ఇంకో మంచి ప్రదేశంలో ఇల్లు, ప్రయాణాలు, మెరుగైన జీవితాన్ని అనుభవించే వీలు, ఫ్రాన్సులో దొరుకుతుందనుకుంటున్న గొప్ప జీవితం ఇక్కడే దొరికేలా కనిపిస్తున్నప్పుడు దాని సంగతి ఆలోచించడం మంచిదే అనుకుంటున్నా అంటాడు. సో, నువ్వు నిర్ణయించుకున్నావన్నమాట అంటే, లేదు లేదు, దాన్నొక ఆప్షన్ కిందే ఉంచానంటాడు. సరే, నువ్వు చెప్పిందే నిజమనుకుందాం కాసేపు, మరి నువ్వు ఇదొక వ్యర్థమైన ఉద్యోగం అని ఒకప్పుడు చెప్పి, నిజంగా నువ్వు జీవితంలో చేయాలనుకుంటున్న పని చేయడంలేదు కదా. ఎక్కువ జీతమూ, హోదా వచ్చినా కానీ, అదొక హాస్యాస్పదమైన ఉద్యోగమే కదా నీ దృష్టిలో అని అడుగుతుంది. ఫ్రాంక్ కు విసుగొచ్చి, ఆ విషయాన్ని నాకు వదిలిపెట్టు, నువ్విక ఆలోచించింది చాలంటూ తన అభిప్రాయాన్ని అక్కడే తుంచేస్తాడు. ఎవరికోసం పోరాడుతోందో, ఎవరికోసం తను తనకన్నా ఎక్కువగా ఆలోచిస్తోందో ఆ మనిషే తనను నిర్ణయం తీసుకునే ప్రక్రియలో తృణీకరించడం సహించలేకపోతుంది ఏప్రిల్.
ఇంటికొచ్చాక మళ్ళీ పోట్లాడడం మొదలు పెడుతుంది. నీకు వెళ్ళడం ఇష్టం లేదు కదా అంటూ నువ్వు ప్రయత్నమే చేయలేదింతకు ముందు. ప్రయత్నమే చేయకపోతే ఫెయిల్ అయ్యే అవకాశం ఎక్కడ ఉంది అంటే, ఏమంటున్నావు, నేను ప్రయత్నించకపోవడం ఏమిటి అంటూ ఫ్రాంక్ కూ కోపం వచ్చేస్తూంటుంది. మిమ్మల్ని సపోర్ట్ చేసూ ఈ ఇంటిని లాక్కొస్తున్నా, రోజంతా ఆ ఇష్టంలేని ఉద్యోగం చేస్తూ కష్టపడుతూ ఉన్నాకూడా ఇలా అంటావేమిటంటే, నువ్వలా చేయాల్సిన అవసరం లేదు అంటుంది ఏప్రిల్. చూడు, నాకా ఉద్యోగం ఇష్టం లేదు కానీ నా భాధ్యతల నుంచి తప్పించుకునిపోయే వాణ్ణి కాదు కాబట్టే ఆ ఉద్యోగం చేస్తూ కష్టపడుతున్నా అంటాడు. ఈ ఇంటికి నేను వెన్నెముకలా నిలబడుతున్నా అంటే, నీకు కావాల్సిన జీవితాన్ని తెచ్చుకోవడానిక్కూడా వెన్నెముకే అవసరం అని మాటలు విసిరేస్తుంది ఏప్రిల్. కానీ, మనకు ఏప్రిల్ చెప్పేదాంట్లోనే లాజిక్ కనిపిస్తూ ఉంటుంది.
సహనం నశించిన ఫ్రాంక్ బాత్రూంలోకి దూరి తలుపేసుకుంటాడు. అక్కడ చూస్తాడు, సెల్ఫ్ అబార్షన్ టూల్ ఒకదాన్ని. ఒళ్ళు తెలీని కోపంలో బయటికొచ్చి ఏం చేయాలనుకుంటున్నావు దీంతో అంటే, నువ్వేం చెయ్యగలవని అనుకుంటున్నావంటూ, నన్ను ఆపగలననుకుంటున్నావా అంటే, అవును ఆపుతానని అతను, చేతనైతే నన్నాపు అంటూ ఏప్రిల్. నువ్వే కనుక ఈపని చేస్తే, ఒట్టేసి చెప్తున్నా… ఏంటి, నన్ను వదిలేస్తావా? అంటూ ఏప్రిల్. దీనిమీద నువ్వు చాలా నాటకీయంగా మాట్లాడుతున్నావంటూ, ఇది పన్నెండు వారాలే కనుక నేను చేయబోయే పనిలో ప్రమాదం లేదంటుంది. దానిమీద నా అభిప్రాయానికి విలువ లేదా ని ఫ్రాంక్ కేకలు పెడుతూంటే, నీకు లేకపోతే ఎలా, ఇదంతా చేస్తున్నది నీ కోసమే అని గ్రహించవెందుకు అంటూ ఏప్రిల్ ఏడుపు మొదలు పెడుతుంది. పోనీ, మనం పారిస్ లో బిడ్డను కందామనుకునుకుంటున్నావా అని ఏప్రిల్ అడుగుతూ, నన్ను మాత్రం ఇక్కడ ఉంచొద్దు, వెళ్ళిపోదాం అని బతిమాలుతుంది. మనం పారిస్ లో బిడ్డను కనలేం అంటే, పర్లేదు నేను సర్దుకోగలను ఉన్నవాటితోనే అంటుంది. ఇలానే ఉండాలని ఎవరు చెప్పారంటుంది. నీకు గుర్తుందో లేదో, మనం ఈ ఇంటికి రావడానికి కారణం అప్పుడు నేను ప్రెగ్నెంట్ అయ్యా కాబట్టి. తరువాత మొదటిది తప్పు (?) కాదని నిరూపించడానికి మనం రెండో బిడ్డను కూడా కన్నాం. ఎంత దాకా ఇలాగే ఉండిపోవాలనుకుంటున్నాం అంటూ నిజం చెప్పు, నీకు ఇంకో బిడ్డ కావాలనుందా అని అడుగుతుంది. వాస్తవం ఏమిటో చెప్పు. ఒక్క విషయం గుర్తు పెట్టుకో, వాస్తవాన్ని ఎవరూ మర్చిపోరు కాబట్టే దాన్ని మరిపించడానికి వారికి వారు అబద్దం చెప్పుకుంటూ జీవితం లాక్కొని రావడానికి తమకు చేతనైనంతలో తాము కిందా మీదా పడుతూంటారు. చెప్పు, నీకింకో బిడ్డ కావాలనుందా?
ఫ్రాంక్ అంటాడు, నాకు తెలిసిందంతా నేను అనుభవంలోకి తెచ్చుకోగలిగి, తాకి చూడగలిగేదే. సరిగ్గా ఆలోచిస్తే ప్రతీ ఒక్కరి అనుభవమూ అదే అంటాడు. మరి ఇద్దరు పిల్లల్ని కన్నా కదా అంటే, పిల్లల్ని కనడాన్ని ఒక శిక్షలాగా చూస్తున్నావెందుకు అంటూ ఫ్రాంక్. నాకు నా పిల్లలంటే ప్రాణం అంటూ ఏప్రిల్.ఆ విషయంలో నీకు క్లారిటీ ఉందా అని ఫ్రాంక్. దానర్థం ఏమిటి? నువ్విప్పుడే చెప్పావు, మన మొదటి బిడ్డ ఒక పొరబాటు అంటూ. దాన్నీ, దాని తమ్ముణ్ణీ పోగొట్టుకోవాలని నువ్వనుకోలేదని నన్నెలా నమ్మమంటావంటూ ఫ్రాంక్ చర్చని ఇంకా లోతుల్లోకి తీసుకెళ్ళిపోతాడు. తీవ్రంగా అశక్తత ముంచుకొచ్చి సమాధానం చెప్పలేకపోతుంది ఏప్రిల్. ఒక సాధారణ గృహిణి, తల్లి ఇలాంటి పని కలలో కూడా చేయడాన్ని ఊహించుకోదు. నీ ఊహలు నీ చేత ఇలాంటి పనుల్ని చేసేలా ప్రేరేపిస్తున్నాయి, నువ్వు రా వాస్తవంలోకి అంటూ ఏప్రిల్ ను దిక్కుతోచని స్థితిలోకి నెట్టేస్తాడు ఫ్రాంక్. తను మూలన కూర్చుని ఏడుస్తూండగా ఈ మొత్తం వ్యవహారంలో నీలో రేషనాలిటీ లోపించింది. ప్రాక్టికల్గా ఆలోచించు అంటాడు అనునయంగా. సో, ఈ మొత్తం వ్యవహారంలో ఇక మాట్లాడడానికి ఏమీ లేదు, ఫ్రాన్స్ ఐడియా మొత్తం ఒక చిన్న పిల్లల చేష్ట కదా అని ప్రశ్నిస్తుంది. కాసేపు మౌనం దాల్చి అప్పుడు అది అలాంటి ఆలోచనే అయ్యుండొచ్చు అని మనసులో మాట బయట పెడతాడు. ఆశలన్నీ కల్లలై నిస్సత్తువలో కూరుకుపోతున్న ఏప్రిల్ ను అనునయిస్తూ ఇక్కడ కూడా మనం సంతోషం గా బతగ్గలం, నేను నిన్నిక్కడ సంతోషంగా ఉంచగలననే అనుకుంటున్నా అంటాడు. మనం మామూలు జీవితంలోకి సంతోషంగా మళ్ళీ వెళ్ళగలం, పోయిందనుకున్న సంతోషాలని వెనక్కి తెచ్చుకోగలం అంటూ ఊరడిస్తాడు. ప్రమాణం చేస్తాడు. నేనూ నమ్ముతా నిన్ను అంటూ ఏప్రిల్ అప్పటికి ఆ చర్చని ఆపేస్తుంది. తను సమాధానపడినట్లు మనకనిపించదు.
ఆఫీసులో కొత్త ఉద్యోగానికి అంగీకారం ఇచ్చేస్తాడు. ఆఫీసు లంచ్ బ్రేకులో సెక్రటరీ మీదా, కాంట్రాసెప్టివ్ పిల్ పనిచేయకపోవడం మీదా జోకులు, ఇదంతా అన్ రియలిస్టిక్ అని ఒకరికొకరు సర్దిచెప్పుకోవడం జరుగుతుంది. ఆరోజు సాయంత్రం షెర్ప్-మిల్లీ జంటతో పార్టీకి బయటికెళ్తారు. యూరోప్ ఎక్కడికీ వెళ్ళదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు అని షెర్ప్ బీరు గ్లాసుల మధ్యన అంటే, మన స్నేహితులు మళ్ళీ కలిశారు విడిపోకుండా అంటూ మిల్లీ ఆనందాన్ని అసూయను దాచుకుంటూ ప్రకటిస్తుంది. చెరో నాలుగు గ్లాసులయ్యాక డాన్సు చేద్దామంటే ఏప్రిల్ రాదు. మిల్లీ ముందుకొస్తుంది. డాన్సు చేస్తూ మోతాదెక్కువైన ఫలితంగా డీహైడ్రేట్ అయిపోయి మిల్లీ ని ఇంటిదగ్గర దింపాల్సొస్తుంది. ఒకరి కారు పార్కింగులో చిక్కుకుపోవడం మూలాన ఫ్రాంక్, మిల్లీ ని ఇంటిదగ్గర దింపిరమ్మని చెప్తుంది ఏప్రిల్.మిల్లీని తీసుకుని ఫ్రాంక్ ఇంటికెళ్ళిపోతాడు. ఇక్కడ షెర్ప్ టేబిల్ దగ్గర ఏప్రిల్ ని ఇంప్రెస్ చేసే ప్రయత్నం మొదలుపెడతాడు. ఆ సంగతీ ఈ సంగతీ చెప్తూ యూరప్ గురించి పెద్దగా బాధపడనక్కరలేదని మెల్లగా అనునయిస్తూ ఉంటాడు. నువ్వు బయటికెళ్ళిపోవాలనుకున్నావు కదా అంటే, కాదు ఇంకా ఎక్కువగా బంధం బలపడాలనే ప్రయత్నిస్తూ వచ్చానంటుంది ఏప్రిల్. (Wanted-In rather Wanted-Out) మేం మళ్ళీ నిజంగా జీవించాలనుకున్నాం. ఏళ్ళకొద్దీ మేమిద్దరం గొప్ప జంట అని అనుకుంటూ ఆ రహస్యాన్ని పంచుకుంటూ బతికేశాం. ఎలాగో తెలీదు కానీ, ఒక ఆశ నన్నిన్నాళ్ళూ నడిపించింది. ఎంత జాలిపడాల్సిన విషయం అది, పరిపూర్ణమైన మూర్ఖత్వం కాదా అది, అదెలా, మొత్తం ఆశనీ ఎప్పుడూ చేయని ఒక ప్రమాణం పునాదిగా జీవితం మొదలుపెట్టడం? అని చెప్తూ పూర్తిగా తన ఆశాభంగాన్ని బయటపెట్టేసుకుంటుంది ఏప్రిల్, షెర్ప్ తో. పద డాన్స్ చేద్దామంటూ, డాన్సులో, అతన్ని ప్రొవోక్ చేస్తూ కారులో అతన్ని తనతో శృంగారం చేయనిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంధర్భానికే ఇన్నేళ్ళూ ఎదురు చూస్తున్న అతనూ వెనుకంజ వేయడు. అలా ఏప్రిల్, ఫ్రాంక్ మీద తన కోపాన్ని చల్లార్చుకుందనుకోవాలనేమో తెలీదు. ఇంటికి వెళ్ళిపోతారు.
కొన్నిరోజులు గడుస్తాయి. ఫ్రాంక్, ఏప్రిల్ ఇద్దరిమధ్యా ఏ శారీరక సంబంధమూ లేదని అర్థమౌతుంది. నిర్లిప్తత ఆవరించుకుని ఉంటుంది ఆ ఇంట్లో. ఒకనాటి పొద్దున సరాసరి ఏప్రిల్ దగ్గరికొచ్చి పశ్చాత్తాపం ప్రకటించడం మొదలు పెడతాడు ఫ్రాంక్. తాము కొన్నాళ్ళుగా ఉండాల్సిన విధంగా లేమని, ఒకరినొకరు సహాయం చేసుకోవాలి ఈ నిర్లిప్తతనీ, మౌనాన్నీ పోగొట్టేందుకంటూ, ఒక విషయం చెప్పాలి నీకంటూ ఆఫీసులో సెక్రటరీ సంగతి చెప్తాడు. కొన్నాళ్ళుగా న్యూరోటిక్ గా, ఇర్రేషనల్ గా ఏదో ప్రూవ్ చెయ్యలనుకుని చేసిన పని అది, అయితే ఆ సంగతి అయిపోయింది. ఇక లేదు. పూర్తిగా నమ్మకం వచ్చాకనే నీకు చెప్పడానికి ధైర్యం చేసి చెప్తున్నా అంటాడు.
ఎందుకు?
అప్పట్లో, ఈ గొడవలు, సమస్యలు, అబార్షన్ గురించి వాదోపవాదాలు అదీ ఇదీ..
నేనడుగుతున్నది అది కాదు, నాకెందుకు చెప్తున్నావీ సంగతి?
ఏమిటి దానర్థం?
దాని తాత్పర్యం ఏమిటి? నేను అసూయ పడాలనా? లేదా నీతో మళ్ళీ నేను ప్రేమలో పడాలనా? లేదా నీతో మళ్ళీ బెడ్రూములోకి రావాలనా? ఏం సమాధానం ఎదురు చూస్తున్నావు నానుంచి?
నువ్వేమనుకుంటున్నావో చెప్పకూడదా, ఏప్రిల్?
నేనేమీ అనుకోవడం లేదు.
సో, నేనేం చేస్తున్నానో నీకే సంబంధం లేదన్నమాట.
అవును. నాకు సంబంధం లేదు. ఫక్ హు యు లైక్.
నీ గురించి నేను ఆలోచించడం లేదనుకుంటున్నావా?
అనుకునే దాన్ని, నేను నిన్నింకా ప్రేమిస్తూ ఉన్నట్లైతే. ఆ విషయాన్ని ఈ మధ్యనే గమనించాను.
లేదు, నువ్వు మాట్లాడేదంతా అబద్దం. నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు.
నువ్వింకా అది నిజమనే నమ్ముతున్నావా… ( ఇంతలో తలుపు చప్పుడౌతుంది, చూస్తే హెలెన్, తన కుటుంబంతో, కొడుకు జాన్ ని తీసుకుని మరీ )
వీరంతా ప్రయాణ ఏర్పాట్లలో ఉంటే మధ్యలో ఇబ్బంది బెడుతున్నామంటూ మొహమాటపడుతూంటే, ప్రణాలికలు మారిపోయాయి, ఏప్రిల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటాడు ఫ్రాంక్. హెలెన్ శుభాకాంక్షలు చెప్తుంది. ఏప్రిల్ కళ్ళల్లో ఏ భావమూ లేక ఇంకా ఆ మొహంలో ఇబ్బందీ, అసౌకర్యం కనబడుతూ ఉంటుంది. తల్లిని ఆగమని చెప్తూ, జాన్ మాత్రం ఇరిటేట్ అయిపోయి ఆ కారణం మీద వెళ్ళకపోవడం ఏమిటని ఫ్రాంక్ నిర్ణయాన్ని సూటిగా ప్రశ్నిస్తాడు. కొద్దిగా ఇబ్బంది బడినా, ఫ్రాంక్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. స్తోమత ఉండడం కూడా పరిగణించాలి కదా, పారీస్ కు వెళ్ళి ఉద్యోగం లేక ఇబ్బందులు పడడం ఎందుకని అంటూ ఆగిపోయామని చెప్తాడు. ఓకే, డబ్బుకి సంబంధించిన విషయమైతే అది చాలా ముఖ్యమైన కారణమే అని కానీ డబ్బనేది నిజానికి అసలు కారణం ఎప్పుడూ కాదు అంటూ ఫ్రాంక్ నిర్ణయాన్ని తేలిగ్గా తుంచేస్తాడు జాన్. మొహమాటంగా నవ్వుతున్న ఫ్రాంక్ ని అసలు కారణం ఏమిటని సూటిగా కోపంగా ప్రశ్నిస్తాడు. నీ భార్య దీని గురించి మాట్లాడిందా? చూడబోతే నాకు కనబడుతున్నదాన్ని బట్టి ఏప్రిల్ చాలా దృఢంగా కనిపిస్తూ ఉంది. తన నిర్ణయం వేరే అని కూడా అర్థమౌతూ ఉంది సో, అది నీ నిర్ణయమన్నమాట అంటూ ఏమయ్యిందని ఫ్రాంక్ ని ఇంకా గట్టిగా టేబిల్ దగ్గర నిలదీస్తాడు,ఒక పక్క తల్లి వారిస్తున్నా. అక్కడ ఫ్రాంక్ కు కోపం వస్తూ ఉంటుంది. ధైర్యం సరిపోలేదా, పిరికివాడివా నువ్వు, ఇక్కడే బాగుంటుందని నిశ్చయించుకున్నావా? చివర్లో, ఈ Hopeless Emptiness లోనే కంఫర్టబుల్ గా బతికేద్దామనుకుంటున్నావా అంటూ కోపంగా ప్రశ్నలు సంధిస్తాడు. ఇతను మానసికంగా వ్యాధిగ్రస్తుడు, వైద్యం చేయించుకుంటూ ఉన్నవాడు, కనబడుతున్న వాస్తవాన్ని బయటకు చెప్పెయ్యడంలో ఏ మొహమాటమూ లేనివాడు. అంతకన్నా, ఫ్రాంక్-ఏప్రిల్ ల మానసిక పరిస్థితిని తాత్వికంగా గతంలో సరిగ్గా అంచనా కట్టినవాడు.
ఇంకా ముందుకు వెళ్ళి ఫ్రాంక్ ఉద్దేశపూర్వకంగానే ఏప్రిల్ కు ప్రెగ్నెన్సీ రావడానికి ప్రయత్నించి, తక్కిన జీవితం మొత్తం ఏప్రిల్ వేసుకోబోయే మెటర్నిటీ డ్రస్ వెనుక దాక్కోవాలని చూస్తూ, తనేమిటో తెలుసుకునే ప్రయత్నం జీవితాంతం చేయనక్కరలేదు అని మాటలు తూల్చేయడంతో ఫ్రాంక్ లో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇతను పిచ్చోడో, రోగో నాకనవసరం కాకపోతే ఇతని అభిప్రాయం ఇతను ఏ హాస్పిటల్ కు చెందుతాడో అక్కడే వెళ్ళి చెప్పుకోవాలి కానీ ఇక్కడ కాదు అంటూ అవమానించేస్తాడు ఇంటికొచ్చిన అతిధులందరినీ. సిగరెట్ తాగుతూ మౌనంగా కూర్చుని ఉంటుంది ఏప్రిల్ ఇదంతా చూస్తూ. వెళ్దాం పద అంటూ తండ్రి కొడుకుని పిలుస్తాడు. హెలెన్ కుటుంబం వెళ్ళిపోతూ ఉండగా తిరిగి వెనక్కొచ్చిన జాన్, ఏప్రిల్ ను చూస్తూ జాలిగా తన గురించి చాలా బాధపడుతున్నానని, మీ ఇద్దరూ ఒకరికొకరు చాలా ముఖ్యం. ప్రస్తుతం నిన్ను చూస్తూంటే ఫ్రాంక్ మీద కూడా జాలి కలుగుతోంది. ఐ ఫీల్ సారీ ఫార్ హిం టూ. I mean, you must give him a pretty bad time, if making babies is the only way he can prove he’s got a pair of balls.
కొట్టడానికి దూసుకొస్తున్న ఫ్రాంక్ ని ఆపి హెలెన్ బతిమాలుతుంది, జాన్ పరిస్థితి బాగాలేదంటూ. హెలెన్ కుటుంబం క్షమాపణలు చెప్పి బయటికెళ్తూ ఉండగా ఒక్కసారిగా వెనక్కొచ్చిన జాన్ తను కూడా సారీ చెప్తూ కానీ ‘ఒక్క విషయం గుర్తు పెట్టుకో ఏప్రిల్, నేను ఒక్క విషయం గురించి మాత్రం ఆనందంగా ఉన్నా. ఎందుకో తెలుసా, నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ నేను కాదు కాబట్టి.’ మ్రాన్పడిపోయిన ఏప్రిల్, నిశ్చేష్టుడై ఫ్రాంక్ నిలబడతారు. వారు వెళ్ళిపోయాక ఫ్రాంక్ తాను చేసిన షో గురించి మాట్లాడుతూ అవమానకరంగా ప్రవర్తించాను కదా అని అడిగితే అవునంటుంది ఏప్రిల్. ఆ జాన్ చెప్పిందంతా నిజం కదా? దానికి సమాధానం నేను చెప్పనక్కరలేదని, నువ్వే నా తరపునుంచి చెప్పేస్తున్నావంటుంది. నీ ఆలోచన పొరబాటు. ఎందుకు? ఎందుకంటే అతని మానసిక రోగి. అతను Insane. దానర్థం తెలుసా? మరి నీకు తెలుసా?.ఒక స్థితిని ఒక మనిషికి అన్వయించి అర్థం చేసుకునే ఎబిలిటీ అనేదే Sanity అంటే. ప్రేమించలేని అశక్తత అంటేనే Insanity…
… అని అంటూండగానే వికటాట్టహాసం చేస్తూ పెద్దగా నవ్వుతుంది మొత్తం బాధనీ, వేదననీ, అశక్తతనీ బయటికి కక్కేస్తూ, అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతూ. ( స్త్రీని అర్థం చేసుకోవడం అంటే మగాడు తనను తాను తెలుసుకోవడం. అదెప్పటికీ జరగదు. )
The inability to love, Frank you really are a wonderful talker. If black could be made into white by talking, you’ be the man for the job. So, now I am crazy because I don’t love you, is that the point?
No, wrong. You are not crazy, because you do love me. That’s the point, April.
But, I don’t. I hate you. You were just some boy who made me laugh at a party once and now I loath the sight of you. In fact, if you come any closer, if you touch me or anything, I think I will scream.
అది కాదంటూ తాకబోతే, నిజంగానే గావు కేకలు పెడుతుంది ఏప్రిల్. పక్కనే ఉన్న అడవిలోకి వడివడిగా నడుస్తూ వెళ్ళిపోతుంది. అనుసరిస్తున్న ఫ్రాంక్ ను వెళ్ళిపోమని చెప్పి, ఆలోచించుకునే సమయం ఇవ్వమని చెప్పి బతిమాలి పంపేస్తుంది. ఇంట్లోపల ఇతను మద్యం తాగుతూ ఆలోచిస్తూ, అడవిలోంచి బయటికొచ్చి రాత్రంతా వంటరిగా ఆలోచిస్తూ తను. పొద్దున్న ఆఫీసుకు బయలుదేరుతూ కిచెన్ బల్ల దగ్గరికొచ్చిన ఫ్రాంక్ కు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ చేసి పెట్టి, ఈరోజు ఫ్రాంక్ కు చాలా ముఖ్యమైన రోజు కదా అని గుర్తు చేసి, కొత్త ఉద్యోగం సంగతులు అడుగుతుంది. మామూలుగానే మాట్లాడుతూ ఉంటుంది. ఊపిరి పీల్చుకున్న ఫ్రాంక్ పరిస్థితిని చక్కదిద్దేందుకు దృఢనిశ్చయం తీసుకుంటాడు. నవ్వుతూ తను చేయబోతున్న కొత్త బాధ్యతల గురించి వివరిస్తాడు. టాటా చెప్పి ఆఫీసుకు బయలుదేరి వెళ్ళిపోతాడు.
ఫ్రాంక్ వెళ్ళిపోయాక, అప్పుడు సొరుగులో దాచి పెట్టిన అబార్షన్ పరికరాన్ని తీసుకుని నిదానంగా, అన్ని ఏర్పాట్లు చేసుకుని మేడ మీద బాత్రూం గదిలో సొంతంగా గర్భవిచ్చిత్తి చేసుకునేందుకు పకడ్బందీగా తయారౌతుంది ఏప్రిల్. కాసేపటికి నిదానంగా మెట్లు దిగి వచ్చి గాజు కిటికీ ముందు నిలబడి ఎండలో అవతలి వైపు ప్రకృతిని చూస్తూ నిలబడుతుంది. వేడిగా గాలి వీస్తూ ఉంటుంది. నిశ్శబ్ధం అంతటా, గాలి వీస్తున్న చప్పుడు తప్ప. అబార్షన్ వికటించిందని మనకు కనిపిస్తూ ఉంటుంది. పక్కకు వెళ్ళి టెలిఫోన్ చేస్తుంది, మెడికల్ ఎయిడ్ పంపమని. తరువాత హాస్పిటల్ లో ఏడుస్తూ ఫ్రాంక్. అప్పుడే అక్కడికి చేరుకున్న షెర్ప్ తో ఫ్రాంక్, సొంతంగా తను అబార్షన్ చేసుకుందని అందుకే అది ఇక్కడికి దారితీసిందని విల విలా ఏడుస్తూంటాడు. దూరంగా తలుపు తెరుచుకుంటుంది. హెడ్ నర్సు ఒకావిడ బయటికొచ్చినట్లు కనబడుతుంది. మరు క్షణం రోడ్డు మీద పిచ్చివాడిలా పరిగెడుతూ ఫ్రాంక్. గుండెలవిసేలా బాధ కొన్ని గంటల వరకూ మనల్ని వెంటాడుతూ ఉంటుంది.
ఆ ఇంటికి కొత్తగా దిగిన ఇద్దరు దంపతులు మిల్లీ ఇంట్లో మాట్లాడుతూ ఉంటారు. షెర్ప్, ఏప్రిల్ ప్రస్తావన వస్తే మౌనంగా బయటికెళ్ళిపోతే అతన్ననుసరించిన మిల్లీతో ఇంకెప్పుడూ ఏప్రిల్ ప్రస్తావన ఇంట్లోకి తేవద్దని కోరుకుంటాడు. ఆ ఇంటివైపే శూన్యంగా చూస్తూ నిలబడతారిద్దరు దంపతులూ.
ఫ్రాంక్, ఈ ఇల్లు వదిలిపెట్టి, టవున్ కి షిఫ్ట్ అయిపోయి పిల్లలతో వంటరిగా జీవితం గడుపుతూ, ఖాళీ సమయంలో పిల్లలతో మాత్రమే సమయమంతా వెచ్చిస్తూ ఉంటున్నట్లు చూపిస్తారు.
అక్కడ తన ఇంట్లో కొత్తగా దిగిన కొత్త దంపతులని పొగుడుతూ, గతంలో ఫ్రాంక్-ఏప్రిల్ కుటుంబం వల్ల ఆ ఇల్లు ఎంతగా పాడయ్యిందీ, వారెంతటి పనికిరాని మనుషులు, పిల్లలు ఆ ఇంటిని క్రేయాన్లతో గోడలకు మరకలు చేసి, చిందరవందరగా ఇంటిని పాడు చేసి ఇంటి విలువని ఎంతలా పోగొట్టారో అని హెలెన్ తన భర్తతో ఆ రాత్రి తన ద్వేషమంతా కక్కుతూ ఉండగా, హెలెన్ ఆంతర్యం అర్థమైన ఆవిడ భర్త తన చెవిటి మెషీన్ వాల్యూముని కొద్ది కొద్దిగా తగ్గిస్తూ మ్యూట్ లోకి వెళ్ళిపోతూ ఉండగా సినిమా ఎండింగ్ టైటిల్స్ పడిపోవడం ప్రారంభమౌతుంది.
Note: ఇంత విస్తారంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందో కారణం తెలీదు. ఈ కథలో ఇద్దరు మనుషుల జీవితాల మీద వారికున్న ఎరుక, మానవ ప్రయత్నం, ఓటమి, అసంతృప్తి, ఎంపికల్లో మానవసహజమైన లోపాలు, కాలానుగుణంగా కరిగిపోయే అభిప్రాయాలు, నమ్మకాలు, ప్రేమలు. జీవితం పట్ల ఒక దృక్పధం అనేది ఉంటూనే ముఖ్యమైన వనరేదో లోపించినట్లు అర్థమైపోవడం, తమకేం కావాలో తెలీకనే ఏళ్ళు గడిచిపోయి ప్రేమకు బాధ్యత అనే ముసుగేసి నడుపుతూ రావడం, సంబంధాల్లో కాంప్లెక్సిటీలు, అర్థం కాకపోవడం, అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోవడం, ఉన్నది ఏమిటో తెలుసుకోకుండా పరిష్కారాలని వెతకడం, ఒక పరిష్కారమే అన్నిటికీ మందు అనే నమ్మకం బలపడి ప్రత్యామ్న్యాయాలని కనీసం చూడకపోవడం ఇలాంటివన్నీ రెండు పాత్రల మధ్య, అదీ Leonardo DiCaprio, Kate Winslet లాంటి బాగా పరిచయమైన జంట భార్యాభర్తలుగా వైనం అత్యద్భుతం. ఈ సినిమా తీసిన Sam Mendes నాకు బాగా నచ్చిన దర్శకుల్లో ఒకడు. ఎప్పుడో 61 లో పాపులర్ అయిన నవలను మొదటిసారిగా సినిమాగా తీసుకురావడనికి అన్ని సంవత్సరాలు పట్టింది.
మధ్యతరగతి అమెరికా కుటుంబ వ్యవస్థ, స్త్రీ స్వేచ్చ, భార్యా భర్తల నిర్వచనాలు, మగాడి దౌర్బల్యాలూ, స్త్రీ తన చట్రం దాటి బయటికి వచ్చేయడానికి సమాజం పరిపక్వమౌతున్న కాలం, నచ్చలేదంటే వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి పెద్దగా ఆలోచించని సమాజం నుంచి నలబై ఏళ్ళు వెనక్కెళ్ళి అప్పటి వ్యవస్థల్ని, కన్నీటి వ్యధల్ని, కోరికల్ని, నలిగిపోయిన జీవితాలని చూపడం ఆషామాషీ కాదు. నేపథ్య సంగీతం, సన్నివేశాల సృష్టి, తక్కిన ముఖ్య పాత్రల నటన అన్నీ ఒక కాలం నాటి కథకి సజీవ సాక్ష్యంగా ఈ సినిమా నిలబడడానికి తోడ్పడ్డాయి.

Reviews

There are no reviews yet.

Be the first to review “Revolutionary Road (2008)”

Your email address will not be published. Required fields are marked *