శిఖా..సఖా..కవి చతుర్ముఖా..!
డా.ప్రసాదమూర్తి

ఆకాశమంత పసి పిల్లాడు. సముద్రమంత పిచ్చివాడు. మనుషుల్లో మనిషిని వెదుక్కుంటున్న వెర్రిబాగుల దేవుడులాంటోడు. ఒరే శిఖా అంటాను. ఏరా ప్రమూ అంటాడు. ఎప్పుడో విశాఖలో యూనివర్సిటీలో చదువులు..కడలి తీరంలో వయసు పరుగుల సంరంభంలో నన్ను తుఫానులా చుట్టుముట్టాడు. ఇప్పటికీ నా తీరం దాట లేదు. ఇప్పుడు కొత్తగా శిఖామణిని తూచే సాహసం నాకెందుకు? ఈ పరీక్ష పెట్టింది మాత్రం వాడే. పైగా ఒక్కపూటలో రాసివ్వాలని ఆదేశం కూడా. నా కంటె ముందే ఎం.ఏ.లో చేరాడు. నా కంటె ముందే పుస్తకాలు ప్రచురించాడు. కవిత్వంలోనూ నా కంటె ముందే వున్నాడు. ఎంతైనా సీనియర్ కదా. నీ కవిత్వం మీద నేను రాయడం ఏమిట్రా అన్నాను. నువ్వు రాస్తే అందులో ఆత్మీయత వుంటుందిరా రాయి అన్నాడు. ఆ మాట వింటే శరీరమంతా నీరైపోయింది. తుడుచుకుంటే పోయే కన్నీరా ఇది? అతని తడియారని కవిత్వమూ అతని దోర దోర దోస్తానా ఇచ్చిన కానుక కదా. మూడున్నర దశాబ్దాల స్నేహం. అప్పుడెప్పుడో మువ్వల చేతి కర్ర పట్టుకుని వాడు తెలుగు లోకాన్ని ఆటలాడించిన రోజుల్లో నేను కూడా శిఖామణితో పాటే ఆ సంబరాల్లో పాల్గొన్నాను. శిఖామణితోనే కాదు వాడి నీడతోనూ కలిసి పంచుకున్న కాలాతీత కవిత్వ కాలక్షేపాల నిధి నిక్షేపాలు నాకెన్నో వున్నాయి. నిలువెల్లా కవి కావడం, మనసంతా బంగారం కావడం వల్ల శిఖామణి పట్టిందల్లా కవిత్వమైంది.

“ ఒంటరిగా వున్నా సమూహంలో వున్నా

మెలకువనైనా నిద్రనైనా

కవిత్వం నా చిటికెన వేలు పట్టుకుని

నన్ను నడిపిస్తున్నప్పుడు

నేను కవిలా వుంటాను “ (ఎలా వుంటాను )

కొంతమంది కవిత్వం కోసమే పుడతారు. కవిత్వం కోసమే బతుకుతారు. పోరాటమైనా ఆరాటమైనా కవిత్వం కోసమే. మిగిలిన జీవితమంతా సైడు బిజినెస్సే. శిఖామణి చేత్తో జుట్టును వేగంగా వెనక్కి కొడుతూ, కళ్ళజోడు వేగంగా తీసి మళ్లీ అంతే వేగంగా పెట్టుకుంటూ, వేగంగా మూతి తుడుచుకుని అంతే వేగంగా లాల్చీ కాలర్ కొంచెం వెనక్కీ కొంచెం ముందుకీ లాగుతూ ఏదైనా కవిత చదివినప్పుడు వాడిలో భలే పొగరు కనిపిస్తుంది. వీడు ఇందుకోసమే పుట్టాడురా అనిపిస్తుంది. ఆ మాత్రం పొగరు కవికి అలంకారమే మరి.

బలమైన కవి సృజించిన కవిత్వంలోకి దిగినప్పుడు మనలో చాలా కోరికలు పుడతాయి. ఒక కవి స్నేహితుల మీద రాసిన కవిత్వం చదివినప్పుడు ఎవరిలోనైనా అతనితో దోస్తీ కట్టాలన్న కాంక్ష చెలరేగాలి. అతను పసి పిల్లల మీద రాసిన పద్యాలు చూసినప్పుడు మనం చిట్టి తల్లులమైపోయి, ఆ కవి కళ్ళను చేతుల్లా చాపి ఎక్కడ నిల్చుంటాడో తెలుసుకుని అక్కడ వాలిపోవాలని కలలు గనాలి. పిట్టల మీదో చెట్టుల మీదో పువ్వుల మీదో అతడు రంగులద్దిన అక్షరాల హరి విల్లులు చూసినప్పుడు మనలో కొమ్మలు పొడవాలి . రేకులో రెక్కలో విచ్చుకోవాలి. కురిసినప్పుడు కాదు. కురవకుండా తడిపేదే వర్షం. చదివినప్పుడు కాదు. నిశ్చల తటాకంలా మనమేదో యోగముద్రలో వున్నప్పుడు మన లోపల సన్నగా మొదలై నిలువెల్లా ఆవహించి కుదిపేసేదే కవిత్వం. ఇన్ని సంవత్సరాలుగా తెలుగు కవిత్వ ప్రేమికులకు శిఖామణి మిగిల్చిన అనుభూతులు ఇవే.

“ అభ్యంగన స్నానానంతరం /సాంబ్రాణి ధూప మేఘాల మీద తేలియాడి

మైమరచి నిద్రిస్తున్న చిన్నారి /బంగినపల్లి మామిడి చివరి వొంపులాంటి

చుబుకాన్ని చుంబిస్తున్న/ తల్లి తన్మయత్వపు వివశత్వంలా వుండాలి “

( కవితానుభవం)

కవిత్వానుభవం ఇలా ఉండాలని తానే నిర్దేశిస్తున్న శిఖామణి ఈ తాజా కవితల సంపుటితో మనకెలాంటి అనుభవాన్ని ఇస్తున్నాడు? ఆ చూపుతో నేనీ కవితల్ని చదివాను. దాదాపు అన్నీ పత్రికల్లో ఇంతకు ముందు చూసినవే. అతని నోట విన్నవే. కాని ఒక చోట ఆ కవితల్ని గుది గుచ్చినప్పుడు అతను విస్తరించిన తీరు.. తనను తాను సానబెట్టుకున్న వైచిత్రి..అతని నుండి వీచిన సరికొత్త గుబాళింపులు నన్ను ఆనందపరచాయి. అబ్బురపరచాయి.

కవిత్వాన్ని సిమిలీలతోనో మెటఫర్లతోనో కొలిచే రోజులు పోయాయి. పదాల్లోనో వాక్యాల్లోనో రసాన్ని తోడే ప్రయత్నాలకు కాలం చెల్లింది. పద చిత్రాలతోనో భావ చిత్రాలతోనే కట్టిపడేసే కనికట్టు విద్యలకు ఇప్పుడు సమయం కాదు. ఒక కవిత, దాని సంపూర్ణత్వంతో మనల్ని మన నీడ కంటె దగ్గరగా వెన్నంటి నడవాలి. మన కలల్లోకి వచ్చి కూర్చోవాలి. మన కను రెప్పల మీద వాలాలి. మన తలపోతల సంధ్యల్లో అరుణ వర్ణ సంద్రమై ఉప్పొంగాలి. కవితలోని అక్షరాలన్నీ గిన్నెలో పోసి మరగ కాసి వడపోస్తే మిగిలే కాస్త కప్పుడు రసమే ఆ ఆనందానుభవం. శిఖామణి ఇంకా మువ్వల చేతికర్రలతోనో.. చిలక్కొయ్యలతోనో..పూల కుర్రాళ్ళతోనో..కొయ్యకాళ్ళతోనో..ప్రమిద కింది చీకట్లలాంటి నర్సులతోనో మాట్లాడుతూ ఉన్నాడా మరెటు వైపైనా ప్రయాణిస్తున్నాడా? ఆ దిశగా నా పరిశీలన సాగింది. ప్రతి రోజూ కొత్తగా ఉదయించడం సూర్యడికి సాధ్యం కాదు. అది కవికే సాధ్యం. తన పూర్వ వైభవాన్ని కాపాడుకుంటూనే కొత్తగా తనను ప్రదర్శించడం ఏ కవికైనా కత్తి మీద సాములాంటిది. ఆ ప్రయత్నంలో విజయం సాధించిన వాడే మొనగాడు. ఫలానా కవిలో ఫలానా కవే ఉంటాడు. ఉండాలి. కాని మొన్నలా నిన్న, నిన్నలా నేడు ఉండకూడదు. అదే సమస్య. అంటే తాను తనలా ఉంటూనే ఉండకూడదు. ఉండకుండానే ఉండాలి. ఇదో భయంకరమైన స్థితి. దీన్ని అర్థం చేసుకొని ఎవరు సాగుతారో వారే సుదీర్ఘ కాలం మనుగడ సాగిస్తారు. లేదంటే అంతే సంగతులు చిత్తగించవలెను.

శిఖామణికి ఈ రహస్యం తెలుసనే అనుకోవడానికి ఈ సంపుటిలో కొన్ని సాక్ష్యాలున్నాయి.

“ అప్పుడే భూమ్మీద పడ్డ బిడ్డ కేర్ కేర్ మని ఏడవట్లేదని

తలకిందులుగా వేలాడదీసి వీపు మీద సుతారంగా చరిచినట్టు

మళ్ళీ ఒకసారి కొత్తగా మొదలవ్వాలి “ (బీజాక్షరం )

అదీ సంగతి. కొంచెం కొత్తగా మొదలవ్వాలని..కొంచెం కొత్తగా చివరవ్వాలని..కొంచెం కొత్తగా నడి మద్దె నాణ్యం కావాలని.. శిఖామణి కవితలు ఉవ్విళ్ళూరిన వైనం ఇక్కడ చాలా వుంది. చూడండి

అప్పుడే స్నానించిన/ పచ్చి పసుపు కొమ్ము ఛాయ

మోము మీద కాసిన్ని/ నీటి బిందువులు సేద తీరుతుండగా

కెంజాయ పూరేకుల్లాంటి/ మూసిన కనురెప్పలను

సీతాకోక చిలుక రెక్కల్లా/ విప్పార పైకెత్తి /చిటికెడు కుంకుమ రజను తీసి

చూపుడు వేలితో భ్రుకుటి మధ్య / గుండ్రంగా దిద్దగా

సూర్యోదయం ( తమోనిలం)

శిఖామణి తనను తాను కొత్తగా డిస్కవర్ చేసుకున్న క్రమానికి సరికొత్త ఉదాహరణ ఈ తమోనిలం అనే కవిత. ఒక సూర్యోదయం..ఒక చంద్రోదయం..ఒక పసిపాప చిట్టి అడుగుల బుడిబుడి తడి సవ్వడి ఈ తమోనిలం.

“ సుదూర విరహ విరామం తర్వాత

గొప్ప తమకపు సమాగమానంతరం

ప్రియురాలు విడిచిన దీర్ఘ నిశ్వాసంలా

తమోనిలం “

డిక్షన్.. డికాక్షన్ లాంటి మాటలు నాకు తెలియవు కాని శిఖామణిలో పాతకొత్తలు కలగలిసిన కొత్త శిఖామణిని చూసాను చాలా కవితల్లో. కాలానికి అనుగుణంగా కవి వేషాలు మార్చుతాడో.. కాలానికే కళ్లజోడు తగిలిస్తాడో.. తేల్చి చెప్పడం కష్టమే. అయితే ఏదో మేజిక్ జరిగి తీరుతుంది. మనకు అనుభవంలో వున్న దృశ్యాలే కొత్త రెక్కలు తొడుక్కుని, కొత్త రంగులు పులుముకుని అలా కదలి వెళ్ళిపోయి, మళ్ళీ కొత్త రెక్కలతో కొత్త రంగులతో ప్రత్యక్షమై కవ్విస్తూ కవిత్వమై మెరుస్తాయి.కళ్ళతో చూసినప్పుడు కాదు, వేళ్ళతో తడిమినప్పుడు హృదయానికి అంటుకునేదే కవిత్వం. శిఖామణి అలా అంటుకుపోతాడు. యోగ నిద్ర, పావురాల భాష, ఆకాశ మందారం, అప్పుడప్పుడూ , దాల్చిన గంధి లాంటి కవితలు ఫ్రేములు ఫ్రేములుగా మన చుట్టూ గిర్రున తిరుగుతూ వుంటాయి. మనమూ ముక్కలుగా విడిపోయి వాటి చుట్టూ తిరగడం మొదలవుతుంది. అంతరిక్షంలో గ్రహాల్లాగా అంతరించని మన లోలోపలి మోహాల్లాగా ఇదో మార్మికానుభవం.

‘” ఉన్న చోటనే వుండి చుట్టూ పరికిస్తే ఏముంది?

భూమి పళ్ళెరం మీద ఆకాశం గాజు గిన్నెను

ఎవరో బోర్లించినట్టే వుంటుంది దాని కింద గాలాడని గాజు ఈగల్లా

నువ్వూ …నేనూ..”

అందుకే ఎగిరెళ్ళిపోవాలంటాడు కవి.

“బంగారు వర్ణపు సన్నని కమ్మచ్చు కిరణాల ఎండ పొడలో

సూర్య స్నానం చేస్తూ ఎగిరెళ్ళి పోవాలి “ ( ఎగిరెళ్ళి పోవాలి )

కవి తనకోసం తాను రాసుకుంటాడు. పాఠకుడు కవిలో తనను చూసుకుంటాడు. ఈ చర్విత చర్వణ పునరపి పునరపి జీవన గమనం ఉన్నట్టుండి గడ్డ కట్టుకుపోయినట్టుగా తోస్తుంది. నదులన్నీ గాజు నదుల్లా..పిట్టలూ చెట్టులూ కుక్కపిల్లలూ అన్నీ బొమ్మల్లా గోచరిస్తాయి. అసలు మనిషికి తనకు తానే ఒక నీడలా అనిపిస్తుంది. అప్పుడే ఎగిరెళ్ళిపోవాలని కూడా అనిపిస్తుంది. వాస్తవానికి ఈ ఎగిరెళ్ళిపోవడం వాస్తవంలోంచి ఎగిరి పోవడం కాదు. వాస్తవంలో లేని సౌందర్యంలోకి ఎగిరిపోవడం. నిజంలోంచి స్వప్నంలోకి గంతులేయడం. ఇది కవికే సాధ్యం. అనంత మానవ వేదన పునాదిగా సాగిన శోధనలోంచి జనించిన తాత్త్విక గాఢత ఇది. అందుకే కవిని కౌగలించుకోవడం అంటే మానవ గోళాన్ని పలుమార్లు చుట్టి రావడమే నా దృష్టిలో. ఎగిరెళ్ళిపోవాలి వంటి కవితలు మరికొన్ని వున్నాయి. ఏం పట్టుకెళ్తాం ఎవరైనా, చోటు, చిన్ని చిన్ని కానుకలు మొదలైనవి.

శిఖామణిలో ప్రాణ లక్షణం ఏంటంటే విస్తారమైన కాన్వాసు మీద చిత్రించాల్సిన వస్తువుల్ని ఒక చిన్ని కవితలో విజువలైజ్ చేయడం. రొట్టెలాంటి మనిషి కవితను తీసుకోండి. శివారెడ్డి కవిత్వమూ వ్యక్తిత్వమూ మాత్రమే కాదు అతని జీవన బాధల గాధల అగాథాలతో పరిచయమున్న వారికి ఈ కవిత ఒక అద్భుతమైన నవలలా కనిపిస్తుంది.

“మూడు వేళ్ళకే /మృదువుగా చిదుము పడే

రొట్టెలాంటి అతణ్ణి/ ఇంటిల్లిపాది /తలా ఒక తుంపు తుంచుకుంటారు “ (రొట్టెలాంటి మనిషి)

సంసార బంధాలు..ప్రాపంచిక బంధాలు..కవిత్వ బంధాలు..ఇలా అనేక బంధాల ద్వారబంధాలకు వేళ్ళాడుతూ ఎవరెంత తుంచుకున్నా అంతే పరిపూర్ణమవుతూ మిరమిరలాడే ఫీనిక్స్ రొట్టె అది. స్నేహితుడి కూతుర్ని చూస్తే కవికి ఆ పిల్లలో స్నేహితుడి తండ్రి కనిపించాడు. “అప్పుడే అణగు తట్ట దిగిన తల్లి కోడి/ పిల్లల్ని వెంటేసుకు తిరుగుతున్నప్పుడు/ ఈ పిల్ల పసుపు పచ్చని టెన్నిస్ బంతిలా/ కోళ్ళ గుంపులో ఎలా కలిసి పోయింది?/ తాతయ్యకు ఇష్టమైన బెల్లప్పొంగలి వండినప్పుడు/ బారులు తీరిన చీమల బారులో/ తనూ ఒక ఎర్ర చీమై ఎలా కదలబారింది?” అని తనలో తనే తర్జనభర్జన పడతాడు. తాతయ్యే పిల్లలా తిరుగుతున్నాడేమో అని నమ్మకంగా ప్రకిటించిన తీరు చదివి అనుభవించాల్సిందే. ప్రాణ హంస అని తన పోలీసు మిత్రుడు చనిపోయినప్పుడు రాసిన కవిత కూడా ఇలాంటిదే. పుట్టినూళ్లో ఒక కుక్కలా పుట్టినా నువ్వు జ్ఞాపకానికొచ్చినప్పుడల్లా స్మశానానికెళ్ళె నీ సమాధి చుట్టూ మూచ్చూస్తూ ముమ్మార్లు తిరిగి తలవాలు దగ్గర ముడుచుకు పడుకునే వాడినని అంటాడు. అప్పుడు మనం ముందరి కాళ్ళను ముందుకు చాపి వాటి మీద తల ఏటవాలుగా ఆన్చి తనివి తీరా పడుకునే కుక్క పిల్లలమైపోతాం. తాను రాస్తున్న వ్యక్తిని ముట్టుకుంటే పగిలిపోయేంత మెత్తగా చెక్కుతాడు. పనిమంతుడు..ప్రతిభావంతుడూ కదా శిఖామణికి ఇది అలవోకగా అబ్బిన విద్యే.

శిఖామణి కవితలే కాదు. ఆ కవితల శీర్షికలు కూడా శిఖామణి మాట్లాడుతున్నట్టే వుంటాయి. అమ్మను అడిగానని చెప్పు, ఒక మాట చెప్పి వెళ్ళు , అన్నలేని ఇంటికి, ఏం పట్టుకెళ్తాం ఎవరైనా ఇలా చాలా చెప్పొచ్చు. శిఖామణి ఎలిజీ రాశాడంటే ఇక మనల్ని మాయం చేసి మరో శరీరంలో పరకాయ ప్రవేశం చేయించేస్తాడు. బెజ్జంగి ఎన్ కౌంటర్ మృతుల మీద రాసిన కవిత “ఒక మాట చెప్పి వెళ్ళు “ చదివితే ఏ అడవిలోనో అనాధ శవంలా మన దేహాలు పడివున్నట్టు మనల్ని మనమే అన్వేషించుకుంటూ పోతాం. “పగలు లక్షల ఆకులతో/ రాత్రి అనంతానంత చుక్కల కన్నులతో/ నువ్వు నడిచి వెళ్ళిన కాలిబాట వైపే/ ఎదురు చూస్తుంటాను /వాగ్దాన ఫలాల్ని మోసుకొస్తూ/ తిరిగొచ్చే నీ మెత్తని అడుగుల సవ్వడి కోసం.” వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రారు. కాని కలల మంటల్లో కాలిపోయిన వాళ్ళు వస్తారు. మరొక సారి మరొకరిలా వస్తారు. మంటల్ని మాలలుగా ధరించి వస్తారు. ఈ సారి పండిన కలల పళ్ళు తీసుకొస్తారు. ఆ ఆశనే మిగిలిస్తూ కవిత ముగించడం అద్భుతం. మనుషులు మాయమైపోతున్న తన ఊరు మీద రాసిన “మనిషి లేని ఊరు” కవిత కూడా ఇలాంటిదే. “దారి పొడవునా /ఎదురైన ప్రతి మనిషినీ /కుశలమడిగి వెళ్ళేసరికి /బారెడు పొద్దెక్కేది/ ఇప్పుడు కుశలమడగడానికి మనుషులేరి?” కన్నీళ్ళు పెడుతున్న పల్లెలు గోరటెంకన్నలా గొంతెత్తినట్టు ప్రతి కవీ ఎప్పుడో అప్పుడు తన ఊరిని చూసి ఇలా గొంతులోంచి కన్నీళ్ళు కక్కుకోవలసిందే. శిఖామణిలో శిఖామణే వుంటాడు అనడానికి ఇలాంటి కవితలెన్నో దోసిళ్ళతో పట్టి చూపొచ్చు. ఈ మొత్తం కవితలు చదివాక తానే ఒక కవితలో అన్నట్టు

ఏటవాలు ఎదురు వానజల్లుకు /మట్టితో కట్టిన మదురు గోడ

తడిసి కాసింత మెత్తబడ్డట్టు /మనసు మెత్తబడింది. ( ఎగిరెళ్ళిపోవాలి)

ఎప్పుడైనా నా కవిత ఏదైనా చూసినప్పుడు ఫోన్ చేసి ఏరా ప్రమూ కవిత్వం ఎలా రాయాల్రా అని అడుగుతాడు. వాడి కవిత చదివినప్పుడు నేను కూడా ఒరే శిఖా విశాఖలో కొండలు పట్టుకుని..సిగరెట్లు పట్టుకుని..సముద్రం పట్టుకు తిరగడం నేర్పావు కాని ఎప్పుడైనా కవిత్వం ఇలా రాయల్రా అని నేర్పావా? అని అడుగుతాను. ఒరె ఒరే ప్రమూ దొంగా అని ఒకటే మురిసిపోతాడు. పిచ్చోడు..పసోడు..అని ముందే చెప్పాను కదా. అమ్మలేనోడు అని వాడి మీద ఎప్పుడో ఒక కవిత రాశాను. “కనపడ్డ పసిపాపనల్లా వాటేసుకుని పద్యాల పాలకోవాలు తినిపిస్తావు. ఎప్పుడు చూసినా తిరునాళ్ళలో దారి తప్పి అమ్మకోసం వెదుకుతున్న పిల్లాడల్లే కనిపిస్తావు. మా మధ్య కూర్చుని నువ్వు కవిత్వం కట్టలు విప్పుతుంటే అమ్మ కోసం అంజనం వేస్తున్నట్టే అనిపిస్తుంది.” పుడుతూనే అమ్మను పోగొట్టుకున్న ఈ కవిని కవిత్వమే అమ్మయి సాకింది. అందుకే వాడిని చూస్తే నాకెప్పుడూ ఇంతే గారాబం. ఇంతే ప్రేమ. పిల్లల మీద శిఖామణి చూపించే మమకారం..పెద్దల పట్లా..సాటి కవులూ రచయితల పట్లా అతని స్నేహ సంబంధాలు అతణ్ణి కవిగానూ వ్యక్తిగానూ కొంచెం ఎత్తుగానే నిలబెట్టాయి. కవికి రిటైర్ మెంట్ లేదని సభలూ సమావేశాలూ పత్రికల నిర్వహణా ఇత్యాది కార్యక్రమాలతో తనను తాను నిత్యనూతనం చేసుకుంటున్న శిఖామణి, కవిత్వం మీద ఎంత శ్రధ్ధ పెడతాడో అంతే శ్రధ్ధ ఆరోగ్యం మీద కూడా పెడతాడని ఆశిస్తూ హెచ్చరిస్తూ అభినందిస్తున్నాను.

ఏం పట్టుకెళ్తాం ఎవరైనా

మూసిన రెండు గుప్పిళ్ళ శూన్యాన్ని తప్ప

నిజమేనా శిఖా? ఇంత మంచి కవిత్వం చదువుకున్నాక గుప్పిళ్ళ నిండా కవిత్వం వుంటుంది కాని శూన్యం ఎందుకుంటుంది? అందుకే నువ్వు ఒకటి కాదు రెండు షష్టి పూర్తులు చేసుకోవాలి. మరిన్ని గుండెల గుప్పిళ్ళు నింపడానికి. ఓకేనా సఖా..?

———————————- ————————————–

-డా.ప్రసాదమూర్తి

22.10.2017

( “ఒక మాట చెప్పి వెళ్ళు” కవితా సంపుటి ముందు మాట నుంచి)

Reviews

There are no reviews yet.

Be the first to review “శిఖా..సఖా..కవి చతుర్ముఖా..!
డా.ప్రసాదమూర్తి”

Your email address will not be published. Required fields are marked *