Muthal Mariyathai (1985) ముదల్ మరియాదై

Category:

ఆ ఏటివార చెట్టుకింద ఏ చలనమూ లేని ఆ బండరాయికి చలనమొస్తుందా? “దాన్ని చేతుల్లోకి ఎత్తుకుంటే నిన్ను మనువాడతా”నన్న కుయిల్ (రాధ) ఒకింత గంభీరంగానే వేళాకోళమాడినా, దాన్ని ఎత్తిచూపాలని ఆసరికే యాభై దాటి ఆరేళ్ళ పిల్లాడి చేత తాతా అనిపించుకుంటున్న మలైచ్చామి (శివాజీ గణేశన్) చేయని ప్రయత్నం లేదు. రోజూ ఆ ఏటి వైపు రావడం, చుట్టూ చూసి ఎవరూ లేరని నిశ్చయం చేసుకున్నాక ఆ రాయిని కదపడం, ఒక అంగుళం, రెండంగుళాలంటూ రోజూ పైకి లేపుతూ వీలు కాక తమాయించుకుని మళ్ళీ చుట్టూ చూసుకుని ఎవరూ గమనించలేదని ధృఢపరచుకుని దారంట సాగిపోవడం. కొన్నాళ్ళుగా అదే పని. ఆ మధ్యవయసు అందగాడు ఆ ఊరికి నాట్టామై ( ఊరి పంచాయితీ పెద్ద ). పెళ్ళైపోయి అత్తారింట్లో ఉన్న కూతురు (ముచ్చెర్ల అరుణ). ఊరికి తలా గుండెకాయా అన్నీ అతనే. ఉదారత నిలువెల్లా నిండిన మేలిమి బంగారం లాంటి మనిషి మలైచ్చామి. గూడకట్టు పంచెని పైకి సవరించుకుని నడుస్తూ చేలల్లో పనీ పాటలు చేసుకుంటున్న ఊరి ఆడా మగా అందరి చేత వరుసలు కలిపి పిలిపించుకుంటున్న, మామ, బావ, చిన్నాన్న అంతా ఇతనే. చెప్పులు లేని కాళ్ళు, నవ్వు మొహం చెదరని రూపం. ఆ మాట, యాస, సౌమ్యంగానే బయటపడే గద్దింపులోంచి వినబడే ఆప్యాయత, మనుషులంటే ప్రేమ. ఊరికి వలసొచ్చి, ఊరిపెద్ద మేనమామ ఇల్లరికపు అల్లుడై తరువాత ఆ ఊరి నాట్టామై బాధ్యత నెత్తినపడ్డ సౌమ్యుడు.
మలైచ్చామి ఇంటావిడ పొన్నాత్తా (వడివుక్కరసి ) ఒక మొరటు మనిషి. పరమ పిసినారి. నాజూకూ, శుభ్రతా లేని వట్టి గయ్యాలమారి. నోట్లో మంచి మాటనేది ఎప్పుడూ రాదు. ఎవరినీ లెక్కపెట్టదు. ఇల్లరికం వచ్చిన మొగుడంటే అలుసు, శుచిగా ఒక పూట అన్నం పెట్టి ఎరుగదు. ఇద్దరి మధ్య పెళ్ళైనప్పటినుచీ దాదాపుగా మాటలు లేవు. ఒకే గూట్లో ప్రమాదవశాత్తూ చేరిన పక్షుల్లాంటి జీవితాలు. చెరోదారినా వెళ్ళలేరు. కలిసీ ఉండలేరు. భార్య ఉన్నా ఇతను ఒంటరి పక్షి లాంటివాడే. మలైచ్చామి ఇంటల్లుడు ఒక తిరుగుబోతు. పెళ్ళాం నగలతో బాటు అన్నీ తగలేసి ఊర్లమీద పడి తిరుగుతూన్న నిలకడలేని మనిషి. ఏ కోశానా మంచివాడు కాదు. అదును దొరికితే డబ్బు కోసం ఎంతకైనా తెగించే నీచుడు. పుట్టింటికి రావడం పోవడం లాంటిదే మలైచ్చామి కూతురి కాపురం.
వీళ్ళింట్లో చిన్నప్పటి నుంచీ దాదాపుగా వెట్టి చేస్తున్న సెల్లకణ్ణు అనే పేరున్న మలైచ్చామి దూరపు చుట్టం. వీడు తిండి దండుగ అని పొన్నాత్తా నిశ్చితాభిప్రాయం. మలైచ్చామి లేనప్పుడు తిట్టడం వీలైతే బరిసెలతో వాణ్ణి గొడ్డును బాదినట్లు బాదడం.మేకలు తోలుకు పోయి రావడం సెల్లకణ్ణు పని. పొద్దున్నే సద్ది తాగి వెళ్ళిపోతే అంతే, సాయంత్రం దాకా మేకలు మేపుకుంటూ పిల్లనగ్రోవి ఊదుతూ రోజు గడపడం.తనో దిక్కులేని అనాథ అనే బాధ నుంచి బయటపడడానికి అతనికి మిగిలిన వ్యాపకం అదే. చదువూ సంధ్యా లేదు. మలైచ్చామే దిక్కంటూ ఈ ఇంటికి వలసొచ్చిన వంటరి ఇంకో పిల్ల పక్షి వీడు. అందగాడు, వయసులో ఉన్న చక్కని పిల్లగాడు. గుట్టలమీద వీడి పిల్లనగ్రోవి నైపుణ్యానికి ఆవులూ మేకలతో బాటు రోజూ మైమరిచిపోయే ‘సెవుళి’. ఆ ఊరి తోలుపని చేసే సెంగోడన్ ఒక్కగానొక్క కూతురు. చక్కని చుక్క.నల్లగా, నిగనిగలాడే చర్మంతో ఆల్చిప్పల్లాంటి కళ్ళున్న చురకత్తిలాంటి రూపం. సెల్లకణ్ణు అంటే వల్లమాలిన ప్రేమ. వాడిక్కూడా. కులాలమధ్యన తీవ్రమైన అంతరమున్నా వీరి ప్రేమకు ఏదీ అడ్డం రాలేదు. ఆ ఊరి చివరి గుట్టల్లో వీరి ప్రేమాయణం సెల్లకణ్ణు వేణుగానంలో మునిగి తేలుతూంటుంది. వీరిద్దరి పెళ్ళి పిల్లలు సంసారం మీద వీరి మాటలు ఊహల తో పోటీ పడుతూంటాయి. ఏ మాయా మర్మమూ తెలీని ముచ్చైటైన పదహారేళ్ళ ప్రాయపు ప్రేమ పక్షులు.
ఒకరోజు ఆ ఊరిని దాటుకుంటూ బ్రతుకు తెరువుకోసం ఒక తండ్రీ కూతుళ్ళూ కనబడతారు. మాటల్లో కుయిల్ గడుసుదనం, మాటకు మాటా మిగలకుండా సమాధానం ఇచ్చేస్తున్న రీతీ చూసి మలైచ్చామి ముచ్చటపడతాడు. తర్వాతి రోజు తెలుస్తుంది, తండ్రీ కూతుళ్ళు ఆ ఊరి ఏటి ఒడ్డునే ఒక గుడెసే వేసుకునే పనిలో ఉన్నారని. ఇంకో ఊరికి వెళ్ళలేక అక్కడే ఊరి జనాన్ని తెప్ప మీద ఏరు దాటించే పని చేసుకుందామనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది. వారికి ధైర్యం చెప్పి, ఊరి పంచాయితీ మనుషులను ఒప్పిస్తానని అభయం ఇస్తాడు. జనాలని ఏరు దాటించడం, పనిలేనప్పుడు ఏట్లో చేపల్ని పట్టి ఊళ్ళో అమ్మడం లాంటిది చేస్తూంటుంది కుయిల్.తండ్రి చుట్టుపక్కల ఊళ్ళల్లో పనికోసం వెళ్తూ వస్తూ ఉంటాడు.
పంటలు బాగా పండాయి కాబట్టి ఆ పూట పనివాళ్ళందరికీ కూలీతో బాటు ఒక మూట వడ్లు అదనంగా తీసుకోమని చెప్పిన మలైచ్చామిని సరిగ్గా అక్కడికి ఆ సమయంలో ప్రత్యక్షమైన పొన్నాత్తా ఇల్లరికం అల్లుడు హద్దులు మీరి దానధర్మాలు చేయడానికి ఇదేమైనా ఆయన నాన్న సొత్తా అంటూ అన్యాపదేశంగా మలైచ్చామిని తీవ్రంగా మాటలతో కూలీల ముందు అవమానిస్తుంది. బాధతో చేల మధ్యన పాట పాడుకుంటూ తిరుగుతున్న మలైచ్చామికి తన పాటకు ఎదురు పాడిన గొంతొకటి వినిపిస్తుంది. తీరా చూడగా అది కుయిల్. అంత వేదన గూడుకట్టుకున్నట్లు ఆ పాటేమిటి అంటే, ఆ బాధ పోవడానికే కదా పాడుతున్నది అంటాడు మలైచ్చామి. బాధల్ని గాలిపటంలా ఎగరగొట్టెయ్యాలంటూ ఆరిందాని మాటలు మాట్లాడిన కుయిల్ ని చూస్తూ తనలో ఏమూలనో శిధిలమైపోయిందనుకున్న యవ్వనం తన్నుకొస్తుంది. తన గుండెని తాకే ఏ మనిషీ ఇన్నాళ్ళుగా లేని తనతో తొలకరి పలకరిస్తున్న అనుభూతిని పొందుతాడు. నువ్వు పెద్ద మనిషివి, గొప్పవాడివి, అందరికీ ధైర్యం చెప్పాల్సిన వాడివంటూ మాట్లాడుతున్న కుయిల్ తో మళ్ళీ తననెక్కడ వయసుమీరిన మనిషిలా చూస్తూ ఉందేమోనని అనుమానిస్తూ చేయి చాపి నిలబడితే నీలాంటి అమ్మాయిలు ఊయల ఊగేంత బలమున్న మనిషిని తాను అని చెప్పుకుంటున్న మలైచ్చామిని చూస్తూ పగలబడి నవ్వుతుంది. కుయిల్ మీద ప్రేమ లాంటి భావన ఒకటి పూలగాలిలా వచ్చి పలకరించి వెళ్ళిపోతుంది మలైచ్చామిలో. అప్పటినుంచీ విరగబడి నవ్వుతున్న కుయిల్ ముసలాడు తాళి కట్టేలా ఉన్నాడని ఆ మాట బయటికే అంటూంటే కోపం తన్నుకొచ్చిన మలైచ్చామి గుడిసె ఖాళీ చేయించేస్తానని బెదిరిస్తాడు. భయపడిపోయిన కుయిల్ అప్పటకీ తగ్గకుండా అక్కడే చెట్టుకిందున్న ఓ మోస్తరు సైజున్న బండరాయిని చూపి నువ్వు యువకుడే ఒప్పుకుంటాను, కానీ ఈ బండరాయిని పైకెత్తి చూపు, అప్పుడు ఒప్పుకోవడం కాదు,నీ చేత తాళి కూడా కట్టించుకుంటానని బంతిని ఇవతలి వైపుకి నెడుతుంది. సరే, దాన్ని పైకెత్తుతా కానీ నన్ను పెళ్ళిచేసుకుంటావా అని తిరిగి ప్రశ్నిస్తాడు. సరే, పెళ్ళి చేసుకుంటా అనేస్తుంది. మళ్ళి నువ్వు తప్పించుకోలేవు జాగ్రత్త, బ్రతికిపో అంటే చేతగాక ఈ మాటలెందుకులే అని నవ్వేస్తూ గుడిసెవైపు పారిపోతుంది. నవ్వుకుంటూ తన దోవన పోతూ ఒక్కసారి ఆగి రాయి వైపు చూస్తాడు. తిరిగొచ్చి కొంత పైకిలేపి తనవల్ల కాదని అప్పటికి ఆ ప్రయత్నం విరమిస్తాడు. కుయిల్ మాటల్ని తీవ్రంగానే పట్టించుకున్న మలైచ్చామి ఆరోజు నుంచి చేస్తున్న పని అదే. రోజూ ఆ రాయిని కదిపే పని చేయడం, వెళ్ళిపోవడం.
అక్కణ్ణుంచి మలైచ్చామితో మాట్లాడే సంధర్భాల్లో కుయిల్ మలైచ్చామిని ఆట పట్టిస్తూ, వేళాకోళం చేస్తూ వయసు వ్యత్యాసం చూడకుండా సరదాగా మాట్లాడుతూ ఉంటుంది. మలైచ్చామి కూడా ఆ భేద భావం చూడకుండా మామూలుగానే ఉంటాడు. పెద్ద మనిషన్న గర్వమూ, అదే సమయంలో వెకిలి తనమూ చూపకుండా చిన్న పిల్లలతో మాట్లాడుతున్నంత ఆనందం అనుభవిస్తూ ఉంటాడు. తనలో ఇంతకాలం దాగున్న చిలిపి మాటలు, నిజమైన ఆనందాన్నిచ్చే స్నేహం అన్నీ ఒక్కొటొక్కటిగా జీవితంలో అనుభవంలోకొస్తూ ఉన్న మలైచ్చామి. ఆ స్నేహంలో కల్మషం లేదు. ఆ మాటల్లో స్నేహ మాధుర్యం తప్ప ఇంకో అసభ్యత కనబడదు. ఆ ఊళ్ళోనే ఉన్న అనుమానపు మనిషి ఒకడు వీరిద్దరినీ చూసి సంధర్భం కోసం ఎదురు చూస్తూంటాడు, ఎలాగైనా పొన్నాత్తా కు పురెక్కించి వేడుక చూడాలని.
ఆ పూట, మేకను అమ్మాలని సంతలో కూర్చునుంది కుయిల్. సంతలో మలైచ్చామి తారసపడతాడు. మేకను అమ్మేందుకు తన తెలివితేటలతో ఒక మనిషిని బురిడీ కొట్టించి హెచ్చు ధర ఇప్పిస్తాడు. పనైపోయాక సంతలో తిరుగుతూ అక్కడా ఇక్కడా వస్తువులు కొనుక్కుంటున్న కుయిల్ తో కలిసి సరదాగా నడుస్తూంటాడు. ఫోటోలు తీస్తున్న టెంటులో దూరి మలైచ్చామితో బాటు బలవంతంగా ఫోటో ఒకటి తీయించుకుంటుంది కుయిల్. వారిద్దరినీ చాలా సేపటినుంచీ గమనిస్తూ వెనుకే తిరుగుతున్న అనుమానపు ఊరి మనిషి. వాడికా రోజు సంధర్భం వచ్చింది. సరైన అవకాశమూ దొరికింది. అదే సంతలో మామయ్యకు కనబడకుండా సెవుళి తో తిరుగుతున్న సెల్లకణ్ణు. సంతలో అమ్ముతున్న సెకండ్ హేండ్ పేంటూ షర్టూ చూస్తూ నిలబడిన సెల్లకణ్ణు. వాడికేం కావాలో అర్థమైనట్లు తలపంకించిన సెవుళి.
ఆరోజు మేకలు తోలుకుంటున్న సెల్లకణ్ణు చేతిలో సంతలో చూసిన పేంటూ షర్టూ పెడుతుంది సెవుళి. ఆ బట్టలతో ఇంటికెళ్ళిన సెల్లకణ్ణుకి బడితెపూజ జరుగుతుంది పొన్నాత్తా చేత. దొంగతనం అంటగట్టి కొడుతూంటే కూతురు అడ్డొచ్చి పోయిందని అబద్దమాడుతున్న ఆవిడని నిలబెట్టి, డబ్బులు ఎవరికో అప్పిచ్చావన్ని గుర్తు చేసి పొన్నాత్తా ఆగ్రహాన్ని చవిచూసి సెల్లకణ్ణుని కాపాడుతుందా అమ్మాయి. ఏడ్చుకుంటూ ఏటివారకి వెళ్ళిపోయిన సెల్లకణ్ణు వేణుగానంలో లీనమౌతాడు. అడుగులో అడుగేసుకుంటూ వచ్చిన సెవుళి ని చిరాకు పడి వెళ్ళిపొమ్మంటాడక్కణ్ణుంచి. వీణ్ణి ప్రసన్నం చేసుకోవాలని ‘నీకోసం వెన్నెలని తెచ్చా చూడు’ అంటూ దోసిట నీళ్ళను పట్టి ఏట్లో జారవిడుస్తుంది. చెదిరిన ఏటి నీటి అలలు సద్దుమనగానే వెన్నెల ప్రతిబింబం తారస పడుతుంది. సెల్లకణ్ణు సెవుళిని ప్రేమగా పిలుస్తాడు. తను దూరంగా జరిగి సిగ్గుపడుతుంది. అక్కడ చిత్రీకరించిన పాట ( https://www.youtube.com/watch?v=CH1IyEUlaO0&list=RDCH1IyEUlaO0&t=55 ) ముప్పై మూడేళ్ళైనా తమిళ దేశమంతా ఇంకా వినిపిస్తూనే ఉంది. ఇళయరాజా స్వరపరచి, స్వయంగా పాడి, వైరముత్తు సాహిత్యంలో వచ్చిన ఈ పాట ఇళయరాజా పాటల్లో మొదటి పది స్థానాల్లో ఎప్పటికీ ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఇళయరాజా మేజిక్ అది.ఇంకా చెప్పాలంటే ఈ సినిమాలో వచ్చిన పాటలు ఇళయరాజా మొదటి వందపాటల్లో ఎప్పటికీ చోటు చేసుకునేవే అంటే అతిశయోక్తి కాదు.
వీరిద్దరి బాగోతాన్ని స్వయంగా చూసిన కుయిల్ అప్పటికి మలైచ్చామికి చెప్పదు. ఒకరోజు వీళ్ళింటికి వచ్చిన సెవుళి తండ్రి సెంగోడన్, మలైచ్చామి గతమంతా చెపుతాడు. ఆయన కాళ్ళకు చెప్పులు కుట్టిచ్చే అవకాశం ఈ జీవితానికి లేదా అని వాపోతాడు. కుయిల్ లో ప్రకంపనలు. మలైచ్చామి పట్ల ఆపేక్ష ఒకేసారి కలుగుతాయి. ఆ మనిషి గతం అలాంటిది. సెంగోడన్ తెచ్చిన సంబంధం గురించి చెప్పి మరుసటి రోజు పెళ్ళి అనే వార్త సెల్లకణ్ణు కి చెప్తుంది సెవుళి. ఆ రాత్రి ఇద్దరూ ఏటి దగ్గరున్న కుయిల్ దగ్గరకు పారిపోతారు. సెంగోడన్ మలైచ్చామి ఇంటికెళ్ళి మొహమాటపడుతూ కాళ్ళమీద పడి ఏడుస్తూ ఊరంతా తన కూతురు సెల్లకణ్ణుతో పారిపోయిందంటున్నారని మొరపెట్టుకుంటాడు.వేట కత్తి తీసుకుని బయలుదేరుతాడు మలైచ్చామి. ఏటి దగ్గర వీరిద్దరినీ తెప్పలో ఉంచి ఏటి లోపలకంటా పంపి తాడు కొస పట్టుకుని నిలబడుతుంది కుయిల్. అక్కడికొచ్చిన మలైచ్చామి కుయిల్ ని పరుషంగా మాట్లాడుతూంటే చేతిలో ఉన్న తాడును వదిలేసి వాళ్ళను చంపుకుంటావో, కులం చూడకుండా వారిని కలిపి కాపాడుకుంటావో నీ ఇష్టం, నీ లాంటి బతుకు సెల్లకణ్ణుకి వద్దు. నీలా వాళ్ళ జీవితాలని ఎండమావిని చేయొద్దని వాదిస్తుంది. సెల్లకణ్ణుని ఎక్కడ పోగొట్టుకుంటానో అని గాభరాపడుతూ తాడును పట్టుకుని నిలబడుతాడు మలైచ్చామి. తన గతం కుయిల్ కు తెలిసిపోయిందన్న విషయం కూడా తనకు అవగతమౌతుంది.
వారిని ఒడ్డుకి లాగి నరికెయ్యబోతూంటే కుయిల్ వారించి వారిని ఒకటి చెయ్యమని ప్రాధేయపడుతుంది. మలైచ్చామి కళ్ళు తెరుచుకుంటాయి. ఇద్దరినీ వారి వారి ఇంటికి పంపిస్తాడు. సహజంగానే పరిమళాలని వెదజల్లే గుణమున్న వట్టివేళ్ళని నీళ్ళలో ముంచితే నీళ్ళకు కూడా ఆ పరిమళం అంటుకుంటుందనే వాస్తవం మనకూ అర్థమౌతుంది. సహజాతాలను అవగతం చేసుకుంటే ఎవరైనా, ఏ సమయంలో అయినా మనుషులందరూ మంచివాళ్ళే అనే జీవితాదర్శమూ అర్థమౌతుంది. తరువాతొచ్చే పాట అద్భుతం.జాతి మత భేదాలున్న సమాజాన్ని నిర్వచిస్తూ దాని తీరుతెన్నులనీ, చరిత్రనీ, మనిషి మనిషిగా ఉండాల్సిన ఆవశ్యకతనూ విడమరిచి చెప్పే అద్భుతమైన సాహిత్యం. మలేషియా వాసుదేవన్, జానకి గాత్రం. ఎన్ని వందల సార్లు విన్నా తనివితీరని చైతన్యం నిండిన పాట అది. భారతీరాజా ఆలోచనలకి అక్షర రూపం ఇచ్చిన వైరముత్తు. సాహిత్యానికి ప్రాణం పోసిన శివాజీ, రాధ నటన. (https://www.youtube.com/watch?v=F0lYy2cdZrA )
సెవుళి, సెల్లకణ్ణుకి దగ్గరుండి పెళ్ళి చేస్తాడు మలైచ్చామి. ఇంట్లో గొడవలూ, పెడబొబ్బలూ పెడుతున్న పొన్నాత్తాని అస్సలు పట్టించుకోడు. మలైచ్చామి, కుయిల్ కలిసి చేపలు పట్టే సన్నివేశం, ఆ చేపల పులుసు తినమని బలవంతం చేస్తే ఈ కాలంలో మా అమ్మ లాగా చేపల పులుసు చేసే వాళ్ళెవరున్నారని చెప్తూ, అలాంటివి తినడం ఎప్పుడో మానేశా అని బదులిస్తాడు. ఇతని చేత ఎలాగైనా అన్నం తినిపించాలని చేప ముల్లు గొంతులో ఇరుక్కున్నట్లు నటించే కుయిల్ ను కాపాడే ప్రయత్నంలో అన్నం గిన్నెలో చెయ్యి పెట్టిన మలైచ్చామిని ఏట్లో ఎప్పుడూ తిరుగాడే తనకు చేపల పులుసు తినడం తెలీకపోవడం ఏమిటంటూ చేయి తడిపావు కాబట్టి ఒక్క సారి తినమని బతిమాలితే ఆ సంధర్భంలో చేపల పులుసు తింటూ తల్లిని గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుని ఆవురావురుమని భోంచేస్తున్న మలైచ్చామిగా శివాజీ నటన అజరామరం.
ఆ ఏటి ఒడ్డుకు ఒకరోజొస్తారు సెవుళి సెల్లకణ్ణు జంట. ‘నువ్వు వేణువు ఊదుతూ ఉండు, అది వినబడే దూరం దాకా నేను పరుగెత్తుతా. అక్కడికి నువ్వు నిదానంగా రా’ అని సెవుళి పరుగెట్టడం మొదలుపెడుతుంది. పరుగెత్తి ,పరుగెత్తి అలసిపోయి ఒక చోట కూలబడుతుంది. దాహమేసి ఏటి దగ్గరకు నీళ్ళు తాగడానికి వెళ్తుంది. అక్కడే ఉన్న మనిషొకడు సెవుళి వంటిమీదున్న నగలని చూసి చెవి దుద్దులని చెవులు తెగేళా లాక్కొని, మెడలో నగల్నీ లాక్కుని పారిపోతూంటే వాడి వెంట పడుతుంది. వాడు విదిలించుకుని పారిపోతుంటే కాళ్ళు చివరకు వాడి కాలి బొటనవేలినొకదానిని నోట్లోకి కరుచుకుంటుంది. వాడు ఇక చివరగా సెవుళి తలను నీళ్ళలో ముంచి చంపేస్తాడు. ఆ అమ్మాయి నోటిలో ఇరుక్కుపోయిన తన బొటన వేలిని కత్తితో తెగ్గోసుకుని వెళ్ళిపోతాడు. సెవుళిని వెత్తుకుంటూ అక్కడికొచ్చిన సెల్లకణ్ణు ఏటి ఒడ్డున రక్తం ముద్ద ముద్దగా పడి ఉండడం చూస్తూ ఏట్లో గమనిస్తే సెవుళి శవం తేలుతూ కనబడుతుంది. చేతిలో పిల్లనగ్రోవిని గాల్లోకి విసిరేసి దీనాతిదీనంగా రోదిస్తాడు. ( ఇక్కడి నుంచి ఒక నిమిషం పాటు సాగే BG గురించి భారతీరాజా ఇంటర్వ్యూ ఒకటి ఉంది. ఈ మొత్తం సంధర్భాన్నీ, ఆ సంధర్భానికి చేసిన ఎడిటింగ్, దానికి తగ్గట్లు సెకన్ల లెక్కతో బాటు సన్నివేశంలో మనల్ని లాక్కెళ్ళిపోయేంతగా నేపథ్య సంగీతాన్ని అందించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. BG యొక్క ప్రాధాన్యతని దర్శకుడు వివరిస్తూ ఆకట్టుకోలేని, నటన సరిగా పండని, పెద్దగా ప్రభావం చూపలేని దృశ్యాలకి కూడా ప్రాణం పోయగలిగేది, దర్శకుడి ఆలోచనలకి వీక్షకులని దగ్గర చేయగలిగేది నేపథ్యసంగీతమే అంటూ చెప్పడం మనకు తెలీని అనేక విషయాలని బోధపరుస్తాయి. ఆ ఇంటర్వ్యూ ఇక్కడ : https://www.youtube.com/watch?v=rA_vG0eLldg )
కొన్నాళ్ళకు వీధి వెంట వెళ్తున్న మలైచ్చామితో ‘ నాకో నిజం తెలియాలి సామీ ‘ అంటూ కళ్ళల్లోకి తదేకంగా చూస్తున్న సెంగోడన్ (చనిపోయిన సెవుళి తండ్రి) తో మనసును పదిలపరుచుకోమని ధైర్యం చెప్పి ఇంటికొచ్చిన మలైచ్చామిని నవ్వుతూ పలకరించిన కూతురు. సంగతేమిటంటే, పెళ్ళాన్ని ఇంటికి తీసుకుపోయేందుకు అల్లుడుగారొచ్చారు. కూతురు మొహంలో ఆనందం. పంపనంటాడు నాన్న. అల్లుణ్ణి నమ్మే పని ఇంకోసారి చెయ్యనంటాడు. పొన్నాత్తా తిట్లదండకం మొదలుపెడుతుంది. అయినా చలించడు. కూతురు కన్నీళ్ళు పెట్టుకుంటూ వేడుకుంటుంది. అయినా చలించడు. వీధిలో ఆ రాత్రి గుడ్డి దీపాల వెలుగులో సెంగోడన్, చిన్నపాటి ఢమరుకం లాంటిది చేతిలో పట్టుకుని చప్పుడు చేస్తూ ‘ నాకో నిజం తెలియాలి సామీ ‘ అంటూ వీధి వెంట నడుస్తూ వీరింటి ముందు నిలబడి మలైచ్చామి కళ్ళల్లోకి దీక్షగా చూస్తూ నిలబడతాడు. మలైచ్చామిలో ఏదో కలవరం పుడుతుంది. బయలుదేరి సెంగోడన్ ఇంటి ముందు నిలబడితే, సెంగోడన్ ఇంటి కిటికీ దగ్గర దాచిన వెదురు బుట్టలోంచి కుళ్ళిన బొటనవేలిని చూపుతాడు. అప్పటికే గర్భం దాల్చి ఉన్న తన కూతురి మరణం సాధారణం కాదు, చాలా కిరాతకంగా చంపాడు వాడు అంటూ దీనంగా ఏడుస్తాడు. కలచివేస్తున్న మనసుతో ఇంటికొచ్చి మళ్ళీ వాదిస్తున్న కూతురితో పొద్దున బయలుదేరమంటాడు.సంతోషంతో కూతురు మొహంలో కొత్త కళ వచ్చి చేరుతుంది. తన గదివేపు నడుస్తూ కిటికీలోంచి అల్లుడిని గమనిస్తాడు. గుండె ఆగిపోతుంది. అతని కుడికాలి బొటనవేలి స్థానం ఖాళీ గా కనబడుతుంది. కూతురి మొహం వేపు చూస్తాడు. ఆ ఆనందం ఇంకెంతకాలం అనే నైరాశ్యం అలముకుంటూ ఉండగా పొద్దు వాలుతుంది. పెట్టే బేడా సర్దుకుంటూ ప్రయాణానికి సిద్ధం అవుతున్న కూతురు బండి వచ్చిందా అని అడిగితే వస్తోందని సమాధానం ఇస్తాడు మలైచ్చామి. కొంతసేపటికి పోలీసు జీపు ఆగుతుంది. ఇంట్లోకొస్తున్న పోలీసులని చూసి మొహం కడుక్కుంటున్న అల్లుడు పారిపోజూస్తాడు. ఇంటి వెనుక వైపు సెల్లకణ్ణు రాయొకటి చేతపుచ్చుకుని నిలబడతాడు. ఇటువైపు ఒక దెబ్బ వేసి మరీ మలైచ్చామి పోలీసులకి అల్లుణ్ణి అప్పగిస్తాడు. ఇల్లంతా శోకం.కూతురి కన్నీళ్ళు ఆపడం ఎవరితరమూ కావడం లేదు. పొన్నాత్తా శాపనార్థాలు ఆరోజు ఇంకో స్థాయికి చేరాయి. శోకం నిండి, గాయపడిన మలైచ్చామిని ఓదార్చే సాహసం ఆ పూట ఎవరికీ లేదు. కొన్నాళ్ళకు ఆసరికే మతి చలించి ఉన్న సెల్లకణ్ణు అదే ఏట్లో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు. శవాన్ని తగలబెట్టి మరుసటిరోజు చితిమీదనే సెల్లకణ్ణుకి చెందిన పిల్లనగోవుల్ని వదిలేసి ఇంటికొచ్చేస్తాడు మది భారమై తనవాడంటూ ఎవరూ మిగలని మలైచ్చామి.
ఒక రోజు సమయం చూసి వీరిద్దరూ సంతలో తీయించుకున్న ఫోటో పొన్నాత్తా చేతిలో పెడతాడా ఊరి అనుమానపు మనిషి. పొన్నాత్తా లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. మొగుడి మీద ప్రేమ కాదు, ఆయన పేరునే ఆస్తంతా రాసిపెట్టి పోయిన నాన్న గుర్తొచ్చి. ఎక్కడ కుయిల్ మలైచ్చామిని లొంగదీసుకుని ఆస్తి మీద అదుపు తెచ్చుకుంటుందో అనే కోపంలో ఆ పూట వీధిలో కనబడిన కుయిల్ ను అందరూ చూస్తూండగా ‘ ఉంచుకోవడానికి నా మొగుడే కావలసి వచ్చాడా ‘ అంటూ చీపురుకట్టతో బాదుతుంది. దెబ్బల సంగతి దేవుడెరుగు, ‘ ఉంచుకున్నావా ‘ అనే మాటలకు చీపురు దెబ్బలు పూలవర్షంలా అనిపిస్తుంది కుయిల్ కు. విషయం తెలీని మలైచ్చామిని ఊరి జనం పంచాయితీలో నిలదీస్తారు, ఏమిటి సంగతని? ఒళ్ళు మండిన మలైచ్చామి ‘ అవును, కుయిల్ ను ఉంచుకున్నాను ‘ అంటూ కుండలు బద్దలు కొడతాడు. ఆవేశం వల్ల వచ్చిన మాటలే కానీ ఆ ఉద్దేశం లేదతనికి. గుడిసె దగ్గరకొచ్చి కుయిల్ ను క్షమాపణ అడుగుతాడు. నీ మనసులో నేను లేకనే ఆ మాటన్నావా అని ప్రశ్నిస్తే ఆ ఉద్దేశం ఎప్పుడూ లేదనే బదులిస్తాడు.నీకు వయసుంది, భవిష్యత్తు ఉంది, అలాంటి ఆలోచనలు రానీయకు అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోతాడు.
ఇంటికొచ్చిన మలైచ్చామిని చూస్తూ రాగాలు మొదలు పెడుతుంది పొన్నాత్తా. ఆ అరుపులకి జడిసి తలుపు దగ్గరగా వేసి లోపలకొచ్చిన మలైచ్చామికి వినబడేలా ఆవేశంలో మాటొకటి జార్చేస్తుంది. ‘అవును నిజమే, ఆరోజు కక్కుర్తి పడి కాలు జారి కడుపుతో ఇంటికొచ్చాను’. అని ధీర్ఘాలు పెడుతూంటే కూతురు వినేస్తుంది. మతిపోయి, అన్నేళ్ళుగా దాచిన నిజం తెలిసిన అదురుకి ప్రాణం పోయినంత పనౌతుంది. పొన్నాత్తాని ఒక్క తాపు తంతాడు మలైచ్చామి. అన్ని సంవత్సరాల జీవితంలో అదే ఆమెను ముట్టుకోవడం అతను. ఆ రోజు తన మేనమామ తన వంశ గౌరవం పోతుందని, కడుపుతో వచ్చిన తన కూతుర్ని పెళ్ళి చేసుకోమని కాళ్ళు పట్టుకుని పాదాలను కన్నీళ్ళతో కడిగినందుకు మాట ఇచ్చానని, ఏరోజూ పొన్నాత్తా తో సంసారం చెయ్యలేదు, పెట్టిన తిండి తినలేదు. అస్సలు ఒక మనిషిగా పట్టించుకోలేదు అంటూ విసురుగా బయటికి వెళ్తుండగా తండ్రిని అర్థం చేసుకోలేని తను, తనకు పుట్టిన బిడ్డ కాకపోయినా గుండెల్లో పెట్టుకుని కాపాడుతూ పెంచి పెద్ద చేసిన తండ్రిని నాన్నా నాన్నా అంటూ కాళ్ళు పట్టుకుని ఏడుస్తున్న కూతురితో ఎన్ని జన్మలెత్తినా నువ్వే నా కూతురు అందులో ఏ సందేహమూ వద్దు అంటూ కూతురిని ఊరడిస్తాడు. ఒక నిజం బద్దలయ్యింది. పొన్నాత్తా మొహం లో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. పుట్టుకతో వచ్చిన ఆ దుష్టత్వమూ పోదు.
ఉత్తముడైన మేనమామ కాళ్ళు పట్టుకున్న పాపానికి ఆరోజు నుంచీ చెప్పులు వేసుకోడు. ఇదే నిజం సెంగోడన్ కుయిల్ కు గతంలో చెప్పింది. ఇదే నిజం కుయిల్ ను మలైచ్చామికి మానసికంగా దగ్గర చేసింది. అదే కారణం మలైచ్చామి ఘోటక బ్రహ్మచారిగా యాభై ఏళ్ళుగా మిగిలిపోయినందుకు. ప్రేమ కోసం, తలవాల్చేందుకు ఒక ఒడి కోసం, శుచిగా ఒక పూట భోజనం కోసం అన్నేళ్ళూ వగుస్తూ ఉండిన మలైచ్చామి. ఏ సుఖమూ ఎప్పుడూ ఎరుగకుండానే మనవలనెత్తుకున్న ఆజన్మ బ్రహ్మచారి. నీతి రీతి దాటని కలికాలపు పుణ్య పురుషుడు.
ఊరంతా గుసగుసలు పోతూంటుంది. వీరిద్దరి సంబంధం గురించే ఊరంతా చర్చ జరుగుతూ ఉంటుంది. చివరగా ఈ బంధానికి ముగింపు పలకాలని ఒక నిర్ణయానికి వస్తుంది కుయిల్. తన చుట్టాల్లో మొగోడనిపించుకున్నోళ్ళందరినీ పొన్నాత్తా పిలిపించుకుని వేట కొట్టి భోజనం పెట్టి కుయిల్ ను పూర్తిగా లేకుండా చేయడానికి పథకం వేస్తుంది. వీరి సంగతి అర్థమైన మలైచ్చామి ఇంటికొచ్చిన అతిధుల్ని సవాలు చేసి వేట కత్తి చేతపట్టుకుని కుయిల్ గుడిసెకు కాపు కాయడానికి బయలుదేరుతాడు.అన్నిటికీ తెగించి అక్కడే ఉండిపోయేందుకే వచ్చాడని మనకూ అర్థమౌతుంది. అక్కడ గుడెసెలో కుయిల్ లేదు. పిచ్చోడిలా అరుస్తూ, దడదడలాడుతున్న గుండెలతో చుట్టుపక్కల వెతుకుతూన్న మలైచ్చామికి ఏటి దగ్గర పోలీసులు కుయిల్ ను అదుపులో తీసుకుని కనిపిస్తారు. దగ్గరలో ఒక యాభై ఏళ్ళ మనిషి చచ్చి పడిపోయి ఉంటాడు. చంపింది కుయిల్. అరెస్టు చేసి తీసుకుపోతారు. సెల్లో ఉన్న కుయిల్ ను మలైచ్చామి బ్రతిమాలుతాడు ఎవరు చేశారని. లాయర్ ను పెట్టి విచారించకుండా ఉంటే చెప్తానని ఒట్టు వేయించుకుని నిజం చెప్తుంది. ఆ చంపబడ్డవాడు (సత్యరాజ్) వచ్చింది తనకోసం కాదు, పొన్నాత్తా కోసం. అప్పటి సంఘటనని గుర్తు చేసి, బెదిరించి కొంత ఆస్తి, డబ్బులూ కాజెయ్యాలని వచ్చాడు. పొన్నాత్తాకు కడుపు చేసింది వాడే. తన కూతురికి అతనే అసలు తండ్రి. ఆస్తి పక్కనపెడితే, ఇన్నేళ్ళూ ఏ పరువు కోసం తన జీవితాన్ని త్యాగం చేసి, మొండిగోడలా బతుకుతున్నాడో ఆ మలైచ్చామి పరువు ఇప్పుడు వీధిన పడబోతూంటే సహించలేని కుయిల్ అతన్ని తెప్పలోనే ఏరు దాటించే మిషతో తెడ్డుతో కొట్టి చంపేస్తుంది.
తను చేసిన త్యాగాన్ని నిలపడానికి, తన గౌరవాన్ని కాపాడడానికి, తన జీవితాన్ని మోడువార్చేందుకు సిద్దపడ్డ కుయిల్ ను చూసి కన్నీళ్ళు కారుస్తాడు మలైచ్చామి. ఆ త్యాగానికి ఎలా వెల కట్టగలం? వెళ్ళిపోతున్న మలైచ్చామి చేతిలో ఒక చిన్న పూసల కడియాన్ని పెడుతుంది. అది తన దగ్గిరుండే పూసలు, మలైచ్చామి తల్లో తెల్ల వెంట్రుక ఒకదాన్ని కలిపి నేసింది. వారిద్దరూ కలిసుండేది దానిలోనే. వారి జీవితాన్ని భౌతికంగా కలిపింది ఆ వస్తువే.
సంవత్సరాలు గడుస్తాయి. మలైచ్చామి అక్కడ ఆ గుడెసెలోనే ఉంటున్నాడు ఇన్నేళ్ళుగా, కుయిల్ రాక కోసం. కొన ఊపిరితో కొట్టుకుంటున్న ఆ ప్రాణం ఎంతవరకుంటుందో తెలీదు. ఒక మనిషి కోసం అని అందరికీ తెలుసు. తనని ఆ ఇంటికి తీసుకుపోయేందుకు అనుమతించడు. ఇక్కడే, ఈ గుడెసెలోనే ప్రాణం పోవాలని అతని నిశ్చయం. కానీ చనిపోయేలోగా ఒక్క సారి కుయిల్ ను చూడాలి. పోలీసు కాపలాతో కుయిల్ వస్తుంది. గుడిసెలో మలైచ్చామిని చూస్తుంది. అంతవరకూ స్పృహ లేని శరీరంలో చలనం వస్తుంది. కుయిల్ ను చూసిన మొహంలో నవ్వులు పూస్తాయి. ఇద్దరూ నవ్వుతారు. ఆ నవ్వు మరుక్షణంలో ఆగిపోయింది. మలైచ్చామి కన్ను మూస్తాడు ఆ ఆనందంలోనే. ఇక్కడ బొగ్గింజను రైల్లో మండుతున్న బాయిలర్ కనబడుతూంటే, అక్కడ మలైచ్చామి చితి కాలుతూ ఉంటుంది. కుయిల్ ని జైలుకి తిరిగి తీసుకెళ్తూంటారు. స్టేషన్ వస్తుంది. కిటికీ పక్కనున్న కుయిల్ ను కదుపుతారు. చేతిలో పూసలదండ తెగి రాలి కిందపడిపోతుంది. ప్రాణం ఎప్పుడు పోయిందో తెలీదు.
ఆ ప్రేమ కథ అలా ముగిసిపోయింది.
Afternote: ఇంత కథా చదివి ఆ బండరాయిని మలైచ్చామి ఎత్తాడా లేడా అని అడిగేవారు ముందుగా బెంచీ ఎక్కండి 🙂 ఒక ప్రేమ కథలో శివాజీ గణేశన్ నటించడం, సటిల్ గా మేరుపర్వత సమాన నటనా స్థాయిని చూపడం ఇదే తొలిసారి కాదు కానీ మలైచ్చామి పాత్రలో శివాజీ తప్ప ఇంకో నటుడిని ఊహించుకోవడం కుదరదు.రాధ, శివాజీ ఇద్దరికీ జాతీయ ఉత్తమ నటులుగా పురస్కారాలు రావడం, ఇళయరాజా వన్ ఆఫ్ ద కెరియర్ బెస్ట్ సంగీతాన్నిఅందించడం, భారతీరాజా సినిమాలన్నిటిలో ఎవర్ గ్రీన్ కల్ట్ క్లాసిక్ గా నిలవడం, వైరముత్తు జాతీయ స్థాయి అవార్డు తెచ్చుకోవడం అన్నీ మామూలు విషయాలు కావు. పొన్నాత్తా గా నటించిన వడివుక్కరసి డైలాగులు అంత సులభంగా కొరుకుడు పడవు. ఈ సినిమా దెబ్బకు వడివుక్కరసిని ఆఖరుకి కే ఆర్ విజయ లాంటి నటి కూడా అనుకరించాల్సి వచ్చిందంటే ఈ పాత్ర ప్రభావం ఆ తరువాతొచ్చిన సినిమాల్లో ఎంత వరకూ ఉందో అర్థం చేసుకోవచ్చు. సెవుళి గా నటించిన సింగపూర్ అమ్మాయి ఆ కాలపు డార్లింగ్. ఎంత మంది నిద్రలు పోగొట్టుకున్నారో తెలీదు. స్వాతి ముత్యంలో నటించేందుకు వెళ్ళిపోవడంతో రాధిక చేయాల్సిన పాత్రకు రాధను ఎంపిక చేశారు. రాధకు గొంతు అరువిచ్చి అదే రాధిక కుయిల్ పాత్రను పలికించింది. శివాజీ గణేశన్ జీవితంలో పెద్ద హిట్టు సినిమాల్లో ఇదొకటి.
ఇప్పటికీ తమిళనాడులో ఏ మూలకు వెళ్ళినా అందరూ గుర్తుపట్టగలిగే పాటలని ఈ సినిమాలో నుంచి మాత్రమే చూడగలం. అంతగా జనాల్లోకి వెళ్ళిన సినిమా ఇది. తెలుగులోకి డబ్ అయింది కానీ ఆ నేటివిటీ ఎంత మంచిగా డబ్బింగ్ చెప్పుకున్నా, ఎంతగా ప్రాంతాలని పేర్లు మార్చి పలికినా, సామెతలనీ, పాత్రలనీ తెలుగు సంస్కృతిలోకి పరకాయప్రవేశం చేయించినా అతకలేదనేది నా అభిప్రాయం. దీనిని రీమేక్ చెయ్యడం మాత్రమే కరెక్టు.అది మనవాళ్ళు చేసినట్లు లేదు. ఇప్పటికీ ఈ కథకి రిలవెన్సు ఉందనే నా నమ్మకం.
అత్యంత నేలబారు జీవితంలోంచి కథను నడిపిస్తూ, గుడిసెల్లో, చిరుగు బట్టల్లో అంతంత గ్రామీణ, మానుష సౌందర్యాన్ని ఆవిష్కరించిన భారతీరాజా నైపుణ్యాన్ని చూసి తక్కిన వారు నేర్చుకోవలసింది ఎంతో ఉందని అర్థమౌతుంది. డైరెక్టరుకున్న కన్విక్షన్ ఎంత గొప్పదంటే శివాజీ నాలుగు మెట్లు దిగొచ్చి డైరెక్టరు ఊహల్లో పాత్రను తాను పండిస్తున్నానా లేదా అని అడిగేంత, సరిగ్గా రావడం లేదని బెరుగ్గా అంటే తనను తాను సరిదిద్దుకుని మలైచ్చామి పాత్రలో శివాజీ పరకాయ ప్రవేశం చేసేంత. జనాల జ్ఞాపకాల్లో నిలిచిపోయిన పాటలని ఇచ్చిన ఇళయరాజా,తన కెరియర్ బెస్ట్ లలో ఒకటి అని చెప్పుకునేంత. గ్రామీణ నేపథ్యంతో సినిమా అంటే ఈ సినిమాను ముందు పెట్టుకుని రిఫరెన్సు కింద వాడుకునేంత.
కథ, కథా విస్తరణ, సంభాషణలు, పాత్రలకు సరిగ్గా ప్రాణం పోసిన నటులు, దర్శకుడి ఇమేజినేషన్, సంగీతం, సాహిత్యం. ఇవన్నీ ఖచ్చితంగా సమపాళ్ళలో కుదరడం, జనాలకు చేరడం, దశాబ్ధాలకొద్దీ ప్రజల మదిలో నిలవడం అన్నీ ఈ సినిమాని తమిళ సినిమాలన్నిటిలో అత్యుత్తమమైన వాటిలో ఒకటిగా నిలబెడుతుంది.
One of the very perfect films I ever watched. The reach and charisma of this film will keep influencing all the current and future film makers in the many many years to come.

Reviews

There are no reviews yet.

Be the first to review “Muthal Mariyathai (1985) ముదల్ మరియాదై”

Your email address will not be published. Required fields are marked *