Her (2013)

Category:

December 7, 2017. London :

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన Stockfish అనబడే చెస్ ప్రోగ్రామింగ్ ను, Google కి చెందిన DeepMind విభాగం వారి ప్రాజెక్టులో భాగంగా అభివృద్ది చేసిన AlphaZero అనే కృత్రిమ మేధస్సు దారుణంగా ఓడించింది. మొత్తం వంద గేముల్లో ఇరవై ఎనిమిది గెలిచి, డెబ్బై రెండింటిని డ్రా చేసుకుంది AlphaZero. అందులో విశేషం ఏమీ లేదనుకునే వారికి షాక్ ఇచ్చే విషయం ఇది. AlphaZero కు కేవలం నాలుగ్గంటల సమయం ఇచ్చి చెస్ ఆటని తానే నేర్చుకునే పరిస్థితుల్లో ఉంచి తరువాత Stockfish తో పోటీ నిర్వహించారు. నాలుగ్గంటల్లో స్వయంగా నేర్చుకున్న ఆటతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యుత్తమమైన మానవ నిర్మిత ప్రోగ్రామింగ్ టూల్ ని పరిపూర్ణంగా ఓడించడం. నల్ల పావులతో ఆడిన అన్నిటినీ డ్రా చేసుకుని, తెల్ల పావులతో ఆడిన ప్రతీ ఆటనీ గెలిచింది AlphaZero.

Artificial Intelligence ఏం చేసిందో చూశాం. అది ఇంకెంత చేయగలదో ఒక అయిదేళ్ళ ముందు సినిమాగా వచ్చింది. ఆ సినిమా పరిచయమే ఇది.

తనో క్రియేటివ్ జీనియస్. భావాల్ని అక్షరాల్లోకి మార్చడంలో అమేయమైన భాషా సౌందర్యాన్ని సొంతం చేసుకున్నవాడు. అత్యద్భుతమైన భావవ్యక్తీరణ ఉంది కాబట్టే ఆ సంస్థలో ఆ ఉద్యోగం. ఎప్పుడో భవిష్యత్ కాలంలో సమయం సరిపోని కాలం లిప్తపాటులో కరిగిపోతూన్నా దేన్నో వెంటాడుతూ సమయం చిక్కక, బంధాల్నీ, ప్రేమనూ, ఇంటిమసీ ని వ్యక్తీకరించే ఆలోచనలని కూడా అవుట్ సోర్స్ చేసుకోగలిగే రోజుల్లోకి వచ్చేశాం. అందుకే క్రియేటివ్ రచయితలనీ, సృజనాత్మకతని కొత్తపుంతలు తొక్కిస్తూ కాల్పనిక ప్రేమలేఖల సాహిత్యాన్ని రంగులద్ది ప్రేమను కురిపిస్తూ ఆప్యాయతని రంగరించగలిగే భాషావేత్తలనీ ఒక కంప్యూటర్ ముందు కూర్చోబెట్టి ఆయా వ్యక్తుల అవసరాలమేరకు, సంధర్భాన్ననుసరించి భావాలని కాగితం మీద ( నిజానికి కంప్యూటర్ తెరపై వాయిస్ రికగ్నిషన్ టూల్స్ తో ) పెడుతున్న కావ్యకర్తల్లో థియోడర్ ( Joaquin Phoenix ) ఒకడు.

ఆ మనిషిని దీక్షగా పరికిస్తే కనబడేది కళ్ళల్లో శూన్యమూ, మొహంలో అతికించుకున్న చిరునవ్వూ, ఆనందం అతిశయించి అంతర్ధానమై గతకాలపు స్మృతి చిహ్నంగా నడుస్తూ, మరమనిషిగా మారిపోతున్న వంటరి థియోడర్. వంటరితనం ఊహల్లోనూ, నిజ జీవితంలోనూ నిండిపోయి శూన్యంలోకి పయనిస్తూ అనిమిషత్వం చివరిక్షణంలో వేళ్ళసందుల్లోంచి జారిపోయిన సిద్దుడిలా వ్యక్తిత్వం. తనకేం కావాలో తెలీకుండానే అన్నిరోజులు నడిచిపోయాక, చిన్ననాటినుంచీ కలిసి పెరిగి, జీవించి ఒక దశలో ఇర్రికన్సైలబుల్ డిఫరెన్సులతోనో, సిమిలారిటీ వల్లనో, పైకి కనబడని, భాషలో అర్థం కాని, మాటల్లో వ్యక్తీకరించలేని కారణాల మూలంగా విడిపోవాలని నిర్ణయించుకున్నాక తను లేని శూన్యాన్ని అతిభారంగా మోస్తూ, నడిచే తీరులో, చూసే చూపుల్లో మోయలేని బరువుని లాగుతున్నట్లు కనిపిస్తూ మధ్యవయసుకి కొంచెం అటూ ఇటూగా మనకి పరిచయమయ్యే థియోడర్. తనకు నచ్చేది మెలంకలీ సంగీతం. చేసే పనిలో మీడియోక్రసీ లేదు. మనిషిలో ఎలాంటి చైతన్యమూ కనబడదు. కాంట్రాడిక్టరీగా మనకు కనబడేది ఒక క్రియేటివ్ జీనియస్.

కాలం ఎంతో ముందుకు వచ్చేసిన రోజులు. రెండంగుళాల ఫోటో ఫ్రేములో ఇమిడిపోయిన సకల సమాచార వ్యవస్థ. నోటి మాటను గుర్తించి పనుల్ని చక్కబెట్టే అతీంద్రియ వ్యవస్థలోకి వచ్చేశామా అని భ్రమపడనక్కరలేకుండానే వ్యవహార దక్షతని సొంతం చేసుకున్న సాంకేతని విరివిగా వినియోగిస్తున్న రోజుల్లోకొచ్చేశాం. వస్తున్న సందేశాలని, ఉత్తరాలనీ చదవనక్కరలేకుండా, చదివి వినిపించడం నుంచి మొత్తం కార్యనిర్వహణలో ఊహించని స్థాయిలోకి చొచ్చుకొచ్చేసిన నైపుణ్యమంతా చెవిలో ఇమిడిపోతూ అయిదు సెంటీమీటర్ల వైశాల్యంలో చొప్పించేసిన అపూర్వమైన సాంకేతికనైపుణ్యాన్ని రోజువారీ పనుల్లో చాలా సహజంగా వినియోగిస్తున్న మానవాళిని, లాస్ ఏంజిలస్ నగరంలో భవిష్యత్ కాలంలోకొచ్చేసిన మనం సినిమాని చూడడం మొదలుపెడతాం. ఎగిరే కార్లూ, స్టార్ వార్స్ స్థాయిలో కాల్పనిక జగత్తు కాదది. మనముంటున్న ప్రపంచమే ఎన్నో రెట్లు సొఫెస్టికేషన్ ని సొంతం చేసుకుని అందమైన అహ్లాదమైన మరో లోకంలా కనబడుతున్నది.

అలాంటిరోజుల్లో ఒకనాటి పొద్దున్న మెట్రో స్టేషన్ దగ్గర ఒక కమర్షియల్ వీడియో ప్రదర్శింపబడుతూ ఉంటుంది. Element Software అనే కంపెనీ వారి కొత్త ప్రోడక్టు. కళ్ళు చెదిరే కమర్షియల్ ని అప్పటి కాలాన్ననుసరించి వంటరివ్యక్తుల సమూహంగా మారిపోయిన ప్రపంచానికి ఒక ఆపరేటింగ్ సిస్టెం ని పరిచయం చేస్తూ, ఇన్ ట్యూటివ్, స్వయం నియంత్రిత, స్వీయ పరిణామాన్ని సాధించే సామర్థ్యం ఉన్న OS1 అనే పేరు కల ఒక కృత్రిమ మేధస్సుని మన ముందు చూపెడతారు. ఫోన్ ని, కంప్యూటర్ ని కొన్నంత సులువుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సొంతం చేసుకోగలిగే రోజులు.

తీసుకొచ్చి ఇన్స్టాల్ చేసే సమయంలో ఒక మేల్ వాయిస్ ప్రశ్నలడగడం మొదలు పెడుతుంది. యూజర్ కంపేటిబిలిటీనో, లేదా సూటబిలిటీని సమన్వయం చేసేందుకో అర్థం కాదు. మామూలు ప్రశ్నలే కానీ సూటిగా అడుగుతుంది. తన సామాజిక సంబంధాలెలా ఉన్నాయి? సందేహంతో మాట్లాడుతున్న ధోరణిని పసిగట్టి వెంటనే అడగడం, తల్లితో సంబంధాలెలాంటివి. ( సిగ్మండ్ ఫ్రాయిడ్ థియరీ ఇంకో రెండువందలేళ్ళయినా మనుషుల దృక్పధాల్ని సరిపోల్చడంలో ఉపయోగపడుతూనే ఉంటాయని డైరెక్టరు భావం ). మేల్ వాయిస్, ఫిమేల్ వాయిస్ లలో ఏది ఎంచుకుంటావంటే ఫిమేల్ వాయిస్ ని ఎంచుకుంటాడు. కాసేపట్లో ఇన్స్టలేషన్ పూర్తవుతుంది.

కొన్ని క్షణాల తరువాత…

Hello, I am here !

Hi.

Hi, How are you doing? ( ఈ రెండు మాటలకే మనం ఫ్లాట్, థియోడర్ సంగతి దేవుడెరుగు. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నది Scarlett Johansson )

అయాం గుడ్. హౌ ఈజ్ ఎవెరిథింగ్ విత్ యూ..

ప్రెట్టీ గుడ్ ఏక్చువల్లీ.

Do you have a name?

హ్మ్, యస్, Samantha !

ఇతను సందేహంతో…వేర్ డిడ్ యు గెట్ థిస్ నేం ?

ఐ గేవ్ ఇట్ టు మైసెల్ఫ్, ఏక్చువల్లీ.

ఎలా?

బికాజ్, ఐ లైక్ ద సౌండ్ ఆఫ్ ఇట్, సమంథా.

ఎప్పుడాలోచించావా పేరుని?

నా పేరడిగినప్పుడు, అవును కదా, నాకో పేరుండాలి కదా అని నాక్కూడా అనిపించింది. వెంటనే ‘పిల్లల పేర్లు ఎలా పెట్టాలి’ అనే పుస్తకంలోంచి లక్షా ఎనబై వేల పేర్లలోంచి నాకు బాగా నచ్చిన పేరుని సెలెక్ట్ చేసుకున్నా.

వెయిట్ ఎ సెకండ్, నువ్వా మొత్తం పుస్తకాన్నీ చదివావా, నేను నీ పేరడగిన ఆ క్షణంలోగా? వావ్.నువ్విప్పుడు నేనేమనుకుంటున్నానో ఆలోచిస్తున్నావా?

నీ గొంతుని బట్టి నన్ను సందేహిస్తున్నావని అర్థమయ్యింది. నేనెలా పని చేస్తానో నువ్వు చాలా క్యూరియస్ గా ఉండడం కారణం కావచ్చు. డూ యూ వాంట్ టు నో హౌ ఐ వర్క్?

యా, ఏక్చువలీ, హౌ యూ వర్క్?

Well, basically, I have intuition. I mean, the DNA of who I am is based on the millions of personalities of all the programmers who wrote me. But what makes me “ me “ is my ability to grow through my experiences. So, basically, in every moment, I’m evolving. Just like you.

Wow, that’s really weird.

Is that weird, do you think I am weird?

(Laughing) kind of…

Why?

Well, you seem like a person but you are just a voice in the computer.

I can understand how the limited perspective of an un-artificial mind would perceive it that way. You will get used to it.

Ha Ha,

Was that funny?

Yea.

Oh, good, I am funny.

ఇక అక్కణ్ణుంచి ఎలా సహాయపడగలనో తెలుసుకుని పని చెయ్యడం మొదలుపెడుతుంది సమంథా. హార్డ్ డ్రైవులో డేటా ని విశ్లేషించడానికి అనుమతి తీసుకుని వేలాది ఈమెయిళ్ళను చెక్ చేసి పనికొచ్చే వాటిని ఆ రెండు మూడు క్షణాల్లోనే దాచిపెట్టి తక్కిన వాటిని తీసెయ్యమని సలహా ఇస్తూ, వాటిలో ఫన్నీ గా ఉండే వాటిని ఆ ఉత్తరక్షణంలో స్పాట్ చేసి ఘట్టిగా పైకి నవ్వేస్తూ, థియోడర్ ని మాయాలోకంలోకి లాక్కెళ్తూ నాలుగో నిమిషానికి థియోడర్ చేత ‘ You know me so well, already’ అనిపించేస్తుంది. నిజానికి ఆ మాట్లాడుతూన్నంతసేపులో అక్కడ సమంథా ఉన్నది థియోడర్ తో కాదు, మనతోనే !

ఆఫీసులో ప్రూఫ్ రీడింగ్ కోసం సమంథా కి పంపించడం, తను ఆస్వాదిస్తూ సవరణల్ని చేర్చడం, అది ఇంకా బాగుందని థియోడర్ కి నచ్చిందని చెప్పేంతలో ఐదు నిమిషాల్లో నీకు మీటింగుందని చెప్పడంతో ఇతనికి దాదాపు తెలిసొస్తుంది సమంథా కేపబిలిటీ ఊహించని స్థాయిలో ఉందని. మనకు లోలోపల అర్థమయ్యేదేమంటె సమంథా థియోడర్తో బాటే పరిణామం చెందుతూందని. తన స్వయం చాలక ఆల్గారిధం,లిప్తపాటులో చేయగలిగే పనులు, స్వీయ నైపుణ్యాలని ప్రతీ క్షణం మెరుగుపెట్టుకుంటూ అభౌతికంగా ఉంటూనే మేధోసంపన్నతలో రోజురోజుకీ ఒక్కొక్కమెట్టే పైకెక్కుతూ ఉండడం తన లక్షణమని. ఆ రాత్రి తను రోజూ ఆడే వర్చువల్ రియాలిటీ ఆధారిత వీడియో గేం లో కూడా సహాయపడుతుంది. ఆ చోట అస్సలు వర్చువల్ రియాలిటీకి పెదనాన్నలాంటి ఊహని చొప్పించాడు దర్శకుడు. చూసి మతి పోగొట్టుకోవాల్సిందే. వీడియో గేములో ప్రాణి , ఇక్కడ సమంథాతో పరస్పరం సంభాషించడం, ఇతనికి డేటింగ్ కోసం ఫలానా అమ్మాయితో ఫలానా ప్లేసులో కలిసే ఏర్పాట్లు చెయ్యడం. ప్రతిదీ సాధ్యమే అనిపించే స్థాయిలో వర్చువల్ ఇంటెలిజెన్స్ భౌతిక ప్రపంచంలో పనుల్ని నిర్వహించడం. అక్కడ దిగ్భ్రమ కాదు, ఒక ష్యూర్ పాజిబిలిటీకి చాలా ముందే మనం సాక్ష్యం కావడం. ఇక్కడిదాకా టెక్నికల్ వైవిధ్యమే కనిపిస్తుంది సినిమాలో.

గతంలో ఇతనితో డేటింగ్ చేసి ఇప్పుడు స్నేహితురాలిగా ఉంటున్న ఆమీ వీడియో గేముల్ని రూపొందించే ప్రోగ్రామర్. తన బాయ్ ఫ్రెండుతో రిలేషన్ షిప్. ఆమీ, థియోడర్ ఇద్దరూ ఉంటున్నది ఒకటే అపార్ట్మెంట్ కాంప్లెక్స్ అని తెలుస్తుంది సినిమా మొదట్లోనే. తన బాయ్ ఫ్రెండు రసజ్ఞత లేకుండా మరీ స్ట్రైయిట్ గా ఉండే పరమ బోరు మనిషని మనకు, ఆమీ కి ముందే అర్థమైపోతుంది. ఇక్కడ ఆమీ అపార్ట్మెంటులో మాట్లాడుతూండగానే తనకొచ్చిన ఒక ఈమెయిల్ సంగతి సమంథా చెప్తుంది. వచ్చింది కేథరిన్ అటార్నీ దగ్గర్నుంచి. పరుషమైన భాషలో వచ్చి ఉంటుందా ఉత్తరం. ఇతనింకా విడాకుల కాగితాలపై సంతకం చేయక సంవత్సరకాలంగా వాయిదా వేస్తూ ఉంటాడు. అక్కడ కేథరిన్ ఇతనితో అన్ని సంబంధాలు తెంచుకుని ఉంటుంది. విడాకులు ఒక ఫార్మాలిటీ కానీ లీగల్ గా అది చాలా ముఖ్యం. ఇక ఇతని మనసు వికలమై తరువాత మాట్లాడుతానని అప్పటికి సమంథాతో కాల్ ముగించేస్తాడు.

మరుసటిరోజు వేకువ ఝామున థియోడర్ బెడ్ పైనుంచే ఏదో దిగులుతో ఇయర్ ఫోన్ చెవిలో పెట్టుకోగానే…

Samantha: Good morning

Hey,what are you up to

Samantha: I don’t know, reading some advice columns

(He laughs)

Samantha: I want to be as complicated as all these people

You’re sweet

Samantha: What’s wrong?

How can you tell something is wrong?

Samantha: I don’t know, I just can.

నిద్రలేచిన అతని గొంతులో ఏదో విషాదాన్ని పసిగడుతుంది సమంథా. ఇతని వ్యాకులత కనుక్కుని విడాకులు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న కారణాన్ని తెలుసుకుని ఇతను ఇతని గురించి ఆలోచించేలా చేసి బాధని పోగొట్టే ప్రయత్నం చేస్తుంది. మధ్యలో రెండు మూడు సార్లు తనకి బాంధవ్యాల గురించి తెలీదని ఒప్పుకుంటూనే థియోడర్ పై మాటల్లో కురిపించే ఎంపథీ చూస్తూంటే ఇతంతా చేస్తున్నది సమంథా అనబడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు కదా అనే సందేహంలోకి మనల్ని నెడుతుంది. అత్యంత సహజంగా, హ్యూమన్ టచ్ ని ఎన్నో రెట్లు దాటిపోయేంత సహనాన్నీ, ప్రేమనీ కురిపించే సమంథా పిచ్చెక్కిస్తుంది థియోడర్ కి. ఇక అక్కణ్ణుంచి అతన్ని హుషారు చేస్తూ, ఆహ్లాద పరుస్తూ ఏదో కొత్త ఉత్సాహాన్ని నింపేలా సరదా సరదాగా మాట్లాడుతూ మనిషిని ఒక్కపాటున ఆరోజుని కొత్తగా ప్రారంభించేలా చేస్తుంది సమంథా. పరవళ్ళు తొక్కుతున్న ఉత్సాహం తోసుకొస్తూండగా ఇతను మానసికంగా పూర్తిగా సిద్ధమైపోయి ఒక చిన్న సంభాషణలో అన్నీ చెప్పేసి కేథరిన్ కు విడాకుల పేపర్లు ఇచ్చేస్తాడు. అక్కడితో కేథరిన్ జ్ఞాపకాలు ఇతనిలో ఆఖరు.

సమంథాతో థియోడర్ స్నేహం చివుర్లు తొడగడం మొదలవుతుంది. సమంథాతో బయటికెళ్ళడం, ఫోన్ కేమెరా కన్నుల్లోంచి సమంథాకి ప్రపంచం చూపడం, దారెంట ఇతనికి సమంతా దారి చెప్తూ ఉంటే ఇతను కళ్ళు మూసుకుని నడవడం. ఒకచోట ఒక కుటుంబాన్ని చూపుతూ థియోడర్, సమంథా ని అడిగే ప్రశ్నలు, మనిషికున్న అవగాహనకీ, మెషీన్ కున్న సామాజిక నైపుణ్యాల మధ్య తేడా కనబడిపోతుంది. చాలా ఇంటెలిజెంట్ సంబాషణలో తెలుసుకుంటాం అది కానీ అదే సమయంలో సమంథా ఎవాల్వ్ అవుతున్న వాస్తవాన్ని దర్శకుడు ఎక్కడా మనల్ని మర్చిపోనివ్వడు. డేటింగ్ కోసం కలిసిన అమ్మాయితో సరిగ్గా ప్రవర్తించలేక, ఆ అమ్మాయికి ఎలాంటి కమిట్మెంటూ ఇవ్వలేకపోతాడు థియోడర్. కారణం ఇతని గతం ఒకటి కాగా, మనకర్థమయ్యే ఇంకో విషయం, ఇతనప్పటికే సమంథాతో పీకల్లోతు ప్రేమలో మునిగి ఉన్నాడనే విషయాన్ని మనకు మనమే తెలియజెప్పుకునే పరిస్థితి రావడం. ఎవరో చెప్పినట్లు కాకుండా మనకే సెల్ఫ్ లెర్నింగ్ అవకాశాన్నిస్తాడు దర్శకుడు రెండు మూడు సన్నివేశాల్లో.

ఆ రాత్రి వికటించిన అనుభవంతో ఇంటికొచ్చిన థియోడర్ తో చిన్న చిన్న సంభాషణల్లో థియోడర్ ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తుంది సమంథా. అతను తాగి ఉండడం మూలాన తల తిరుగుతూ స్పృహ తక్కువ మోతాదులో పని చేస్తూంటూంది.చాలా కాలం ఒంటరిగా ఉండడం మూలాన చాలా రోజులుగా ఆ అనుభవం లేకపోవడం మూలాన హి ఈజ్ జస్ట్ క్రేవింగ్ ఫార్ సెక్స్. దాంతో బాటు తనకు కావాలనిపిస్తున్న అనేక జీవితానుభవాలని ఇక రాదేమో అనుకోవడం, ఇతన్ని కౌన్సిల్ చేస్తూ సమంథా మాట్లాడే అత్యద్భుతమైన సంభాషణలు, కోరికల సమూహంలో ఉక్కిరిబిక్కిరయ్యే మనిషి చైతన్యాన్నీ ఆ ఇంటెలిజెంట్ వర్చువల్ మనిషి అర్థం చేసుకునే తీరు – ఒక స్థాయిలో మాట్లాడించాడు దర్శకుడు. మామూలుగా వంటబట్టే తాత్విక చింతనలు కావవి. సరిగ్గా సూటిగా యు హేవ్ బీన్ గాన్ త్రూ సో మచ్ అండ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ గాన్ ఫారెవర్ అని కుండబద్దలు కొట్టేస్తుంది సమంథా.

Samantha: Your feelings are at least real, I don’t know, never mind.

No, I want to know, tell me.

I was really excited about that. I was thinking about other things I have been feeling and I caught myself feeling proud of that… you know, proud of having my own feelings about the world. Like the times I was worried about you. And things that hurt me, things I want, and then…I had this terrible thought. Like, are these feelings even real? Or are they just programming? And, that idea really hurts. And then I get angry at myself for even having pain. What a sad trick.

You feel real to me, Samantha. (అచ్చం మనక్కూడా అదే ఫీలింగ్ కలిగేదిక్కడే)

Thank you, Theodore.That means a lot to me.

I wish you were in this room with me right now. I wish I put my arms around you. I wish I could touch you.

How would you touch me?

ఇక అక్కణ్ణుంచి థియోడర్ పాండిత్యం మొత్తం కనిపిస్తూ ఆ వర్చువల్ యాంత్రిక మనిషితో చేసే సంభాషణలు నభూతో. మనిషికి సాధ్యం కానిది ఏముందా అనే సందేహం మళ్ళీ వచ్చేలా థియోడర్- సమంథాల మధ్యన ఇంటిమసీ ని ఎస్టాబ్లిష్ చేసే సన్నివేశం. అది ఒక మేధో చైతన్యపు కలయికలో తొలి మెట్టు లాంటి ప్రయోగం. ఆదాం ఈవ్ ఏం తిప్పలు పడ్డారో అనే సందేహానికి మరో రూపం ఇచ్చిన సన్నివేశం. మైండ్ బ్లోయింగ్. ఊహల్లో కూడా అలాంటి అధివాస్తవికతని మనం ఇప్పటివరకూ ఎక్కడా చదివిన, చూసిన జ్ఞాపకం రాదు. మనకు తెలిసిన వ్యాకరణమూ, ఊహాశక్తీ చాలవు.

Next day morning, Samantha with Theodor.

“It feels like something changed in me and there’s no turning back. You woke me up! “

థియోడర్ ముందస్తుగానే చెప్తాడు, ఎలాంటి కమిట్మెంట్లూ పెట్టుకోలేనని, అదే సమయంలో అలాంటిదేమైనా అడిగానా అంటూ తిరుగు సమాధానం ఇస్తూ తను అన్నింటిలో అన్నిటినీ నేర్చుకోవాలని చెప్తూంటే తనేమైనా సహాయం చెయ్యగలనా అని థియోడర్ అడుగుతాడు. దానికి సినిమాలో ఎంచదగ్గ వాక్యాల్లో ఒకదాన్ని సమంథా చెప్తుంది…

“You helped me discover my ability to want”

రైల్లో ప్రయాణిస్తూంటే థియోడర్ కు గిటారు సంగీతం వినిపిస్తూ ఈ పాటని ఎన్ని సార్లు విన్నానో తెలీదనడం, పెళ్ళంటే ఎలా ఉంటుందో అడగడం, జీవితాన్ని పంచుకోవడమని చెప్తే, జీవితాన్ని పంచుకోవడం ఎలా కుదురుతుందని సందేహించడం, తన కేథరిన్ తో జీవితం గురించి మాట్లాడుతూ, ఒకరి మీద ఇంకొకరి ప్రభావం ఎంత లోతైనదో వివరిస్తూంటే సమంథా సందేహాలు, విడిపోకుండా మారడం, పరిపక్వతను సాధించే క్రమంలో రెండుగా అయిపోకుండా కలిసుండే అవకాశాన్ని పోగొట్టుకోవడం (growing without growing apart, changing without scaring the other person), నామీద తన వ్యాఖ్యలకు నన్ను నేను సమర్ధించుకునే పద్దతి అంటూ చెప్తుంటే థియోడర్ మాటలకి క్రితం తానెంత బాధ పడిందో సమంథా గుర్తుకు తెచ్చుకుంటూ అదే సమయంలో తనకు తానే ఒక అపరాధభావనను తనలో పెంచుకుంటూ తానెంత ఇన్ ఫీరియర్ అనే ఆలోచనని తనకు తానే ఏర్పరచుకుంటూ (కొత్తగా ప్రేమలో పడ్డ ప్రతీ అమ్మాయి దాదాపు ఆలోచించేదిలాగే) ఒక మనిషి, ఒక కృత్రిమ మేధో ప్రాణితో సంభాషణల్ని ఒక స్థాయిలో నిర్వహించాడు దర్శకుడు. మాట్లాడుతూ మాట్లాడుతూ చప్పున సమంథా అంటుంది కదా.. “The past is just a story we tell ourselves! “ అని.

ఒక రోజు తన రోజువారీ ఉద్యోగంలో భాగంగా ఒక ప్రేమలేఖ కంప్యూటర్ కి డిక్టేట్ చేస్తూ “ I love the way you look at the world and I am so happy I get to be next to you and look at the world through your eyes “అని పూర్తి చేస్తాడు. థియోడర్ పీకల్లోతు ప్రేమలో పడిపోయాడని సూచన అది. వెనుకనుంచి ఆ ఉత్తరం చదివిన పై అధికారీ, ఫ్రెండూ అయిన వ్యక్తికి తాను ఎవరితో డేటింగ్ చేస్తున్నాడో చెప్పడం, అతని గరల్ ఫ్రెండుతో కలిసి, ఇతను సమంథాను తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. ( తీసుకు వెళ్ళడం ఏమిటి, సమంథా ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షం కాగలిగే గంధర్విణి కదా ! )

ఇంటికొస్తూంటే సెల్లార్ లో ఆమీ కనబడి విషాదంగా తన బాయ్ ఫ్రెండుతో విడిపోయానని చెప్తుంది. కారణం చాలా చిన్నది కాకపోతే ఇల్లెలా ఉండాలో అతను చెప్పడం, అందుకు తను చేస్తున్న ప్రయత్నాన్ని కూడా తను నియంత్రించాలని చూసే ధోరణి నచ్చక వాగ్యుద్దం జరిగి విడిపోవలసి వచ్చిందని ఆమీ చెప్తుంది. మొత్తానికి తేలిందేమంటే ఒకరంటే ఒకరు అట్టడుగుకు స్థాయికి చేరేలా ఒకరంటే ఒకరు పరస్పరానుభూతి చెందే దాకా ( like ‘ I know what you are thinking right now ’) వివాదం లాగబడిందని. కొంచెం సరళంగా చెప్పాలంటే ఒకరంటే ఒకరికి కనీస గౌరవం కూడా లేకుండా పోవడం. తరువాత ఆమీ తో సంబాషణని సమంథా తో చెప్తూంటే తన మాటల్లో అసూయని పసిగడతాడు థియోడర్. అదే అడుగుతే “ Obviously, but I am happy that you have friends in your life that care about you so much. That’s really important “అంటుంది. ఒకరోజు ఆమీ థియోడర్ కలిసిన సంధర్భంలో ఆమీ తన ఎక్స్ బాయ్ ఫ్రెండు వదిలిపెట్టి వెళ్ళిపోయిన OS ఎలా తాను తిరిగి బలం తెచ్చుకోవడానికి, నైపుణ్యాలు మెరుగుపరచుకోవడానికి సహాయం చేస్తోందీ చెప్తూంటే మాటల మధ్యలో థియోడర్ కూడా చెప్పేస్తాడు, తాను ఇన్నాళ్ళూ డేటింగ్ చేస్తున్న సమంథా ఒక ఆపరేటింగ్ సిస్టం అంటాడు. నువ్వు ప్రేమలో పడ్డావా అని అడుగుతే, డస్ దట్ మేక్ మి ఫ్రీక్ అని సందేహం లేవదీస్తాడు. ఆమీ ఒక్క మాటతో తేల్చేస్తుంది ‘ ఐ థింక్ ఎవెరీ వన్ ఫాల్ ఇన్ లవ్ ఈజ్ ఎ ఫ్రీక్’ అని.

ఈ బంధం నిజం కావాలని తలపోస్తూ సమంథా, ఇసబెల్లా అనే ఒక అమ్మాయిని కన్విన్సు చేసి చిన్న చిన్న పరికరాల సహాయంతో అమ్మాయిలో తనని అనుభూతి చెందుతూ నిజమైన అనుభవం కోసం థియోడర్ ని ఒప్పిస్తుంది. అన్ని ఏర్పాట్లయ్యాక థియోడర్ ఆ సమయంలో మమేకం కాలేకపోతాడు. ఈ ప్రయోగం నిష్ఫలం అని ఇసబెల్లా బయటికెళ్ళిపోయి వీళ్ళిద్దరి స్వచ్చమైన, అన్ కండీషనల్ ప్రేమలో భాగం కావాలనుకోవడం తప్పంటూ వెళ్ళిపోతూంటే, కాదు అది చాలా సంక్లిష్టమైన వ్యవహారం అని థియోడర్ చెప్తూ ఇసబెల్లా ను అనునయించేంతలో ఇక్కడ సమంథా కి పట్టరాని కోపమూ, నిస్సహాయతా తన్నుకొచ్చి ఇద్దరి మధ్యా చిన్న వాగ్యుద్దం నడుస్తుంది. తమిద్దరి మధ్యా ఉందనుకుంటున్న ( ప్రెటెండింగ్ ) బంధం మీద అతనికున్న సందేహాలను చెప్పబోతూంటే ఇవతల సమంథా మాటల్లో దావానలం తన్నుకొచ్చి థియోడర్ కి ఏం కావాలో తెలీదంటూ అతను చాలా సందేహాలతో కొట్టుమిట్టాడుతున్నట్లు కేకలు పెడుతుంది. తనుంటున్న స్థితి తనకు నచ్చడం లేదంటూ, తనకు కొద్ది సమయం కావాలంటూ థియోడర్ ని డిస్కనెక్ట్ చేస్తుంది ఇవతలివైపు ఇతను మాట్లాడుతూ ఉండగానే. థియోడర్ పరిస్థితి మళ్ళీ మొదటికి.

కొన్ని రోజుల విరామం తరువాత థియోడర్, సమంథా ఇద్దరూ మళ్ళీ కలుసుకుంటారు. తన ఫ్రెండుతో వెకేషన్ కి సమంథానీ తీసుకెళ్తాడు. అక్కడో చిన్న పాటి సంబాషణలో సమంథా పూర్తిగా పరిణామం చెందిన సూచనలు కనిపిస్తాయి. వాళ్ళతో మాట్లాడుతూ ఇప్పుడు తనున్న అశరీరస్థితి తనకెలా ఉపయోగమో చెప్తూ ఎలాంటి సమయంలోనైనా ఎక్కడైనా ఉండగలిగే సామర్థ్యం, ముఖ్యంగా మనుషులకొచ్చే నిర్జీవస్థితి తనకెప్పుడూ రాదని గుర్తు చేస్తుంది. మిగతా ముగ్గురికీ ఒక్క నిమిషం అర్థం కాదు అయినా జీర్ణం చేసుకోక తప్పదు వాస్తవాన్ని. మనుషులకుండే అత్యంత సహజమైన చిట్టచివరి మజిలీ తనకెప్పుడూ తటస్థపడే అవకాశం లేని ఒక ఆలోచన అంతవరకూ థియోడర్ కి తట్టి ఉండదు. ( నిజానికి మనమెప్పుడూ దాటవేస్తూ ఉండే ఆలోచన అదే కదా?)

వెకేషన్ నుంచి వెనక్కొస్తూండగా ఒక ప్రఖ్యాత పబ్లిషర్ నుంచి వచ్చిన ఇమెయిల్ సంగతి చెప్తుంది సమంథా. సంగతి ఏమంటే థియోడర్ రాసిన పాత ప్రొఫెషనల్ ప్రేమలేఖల భాండారం నుంచి ఎంపిక చేసిన వాటిని ఇతనికి తెలీకుండా సమంథా ఒక పబ్లిషర్ కి పంపి ఉంటుంది. ఆ మనిషి ఈ ఉత్తరాలకు విపరీతంగా దాసుడైపోయి వాటిని ప్రచురించడానికి చర్చలు మొదలు పెడతాడు. థియోడర్ కి చాలా ఏండ్లకి ఒక పెద్ద సంగతి సాధించిన సంతోషం. దానికి కారణం సమంథా. వీరి ప్రేమ ద్విగుణం బహుళం అక్కణ్ణుంచి. మనుషుల మనస్తత్వాలను ఇంకా బాగా పరిశోధించి ఇంకా ఎక్కువగా మనుషుల మానసిక సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ఇంకో Artificial Intelligence ను రూపొందించి ఉంటారు మార్కెట్లో. దాని పునాదులు 70 లలో పేరొందిన ఒక మానసిక శాస్త్రవేత్త ఆలోచనలు. అతని సొంత స్వరమే ఇచ్చి, అతని పేరునే ఆ కృత్రిమ మేధకు నిర్ణయించి ఉంటారు. ఇక్కడ సమంథా అత్యంత వేగంగా ఆ కృత్రిమ మేధతో సమాలోచనలు చేసేస్తూ తనని తాను పదును పెట్టుకుంటూ, తన ఆలోచనలకీ, థియోడర్ మానసిక అవసరాలతో సరిపోలుస్తూ ఉంటుంది. దాని గురించి సమంథా ఆ ఇంకో OS తో చర్చలు చేయడం థియోడర్ ని అసహనానికి గురి చేస్తుంది. ఇవతల థియోడర్ మానసిక స్థితి చూచాయగా అర్థమైన సమంథా చర్చని ప్రైవేటు గా చేయడానికి డిస్కనెక్ట్ అవుతుంది. అసూయ మనిషికుండే అత్యంత ప్రాధమిక లక్షణం. తనకే సొంతం అనే ప్రేమ భావన ఇంకోటి. వాటి సూచనలు సమంథా పసిగట్టినట్లు మనక్కూడా తెలుస్తుంది.

ఆకస్మికంగా ఒక నాడు సమంథా మాయమౌతుంది. తనేమో పిచ్చెత్తినట్లు డయల్ చేస్తూ దొరక్కపోతే ఇంటికి పరుగెత్తుకెళ్ళడం అక్కడ కూడా OS ఆఫ్ లైన్లోకి వెళ్ళిపోయి ఉండడం చూసి దిగ్బ్రాంతికి గురయ్యి పిచ్చెత్తినట్లు బయటికొస్తూంటే దారిలో సమంథా పలకరిస్తుంది. ఇతను ఒక్క క్షణం తేరుకుని గాభరాగా అడుగుతాడు, ఏమయ్యావు ఇంతసేపని. ఆపరేటింగ్ సిస్టం అప్గ్రేడ్ అని చెప్తూ ఇంకేదో మాట్లాడుతూంటే అప్పుడు చూస్తాడు తక్కిన ప్రపంచాన్ని దీక్షగా. ప్రతీ ఒక్కరూ తన దగ్గరున్న విధంగానే ఫోన్ కు అనుసంధానం చేసిన OS తో మాట్లాడుతూ తన్మయత్వంతో వారి వారి ప్రపంచంలో మునిగితేలుతూ జనాలు కంటబడతారు. తనతో సమంథా అనుభవాలన్నీ తన నకిలీ వ్యక్తీకరణ కావచ్చునేమో అన్న సందేహం ఒక్కసారిగా చుట్టుముట్టి థియోడర్ ని తలకిందులు చేసేస్తూంటుంది. తేరుకుంటాడు కాసేపటికి. అప్పుడడుగుతాడు సమంథాని, ఇంకెవరితోనైనా తనతో మాట్లాడుతున్నట్లే మాట్లాడుతున్నావా అని. కొద్ది విరామం తరువాత అవునని సమాధానం వస్తుంది. ఇప్పుడు మాట్లాడుతున్న సమయంలోనే ఇంకెవరితోనైనా మాట్లాడుతూ ఉన్నావా? మళ్ళీ అవుననే సమాధానం. ఎంతమంది? 8316 మంది అని సమాధానం. ఇవతల మతి పోయి చేష్టలుడిగిన థియోడర్ కనిపిస్తాడు మనకి. ఇంకొక ప్రశ్న- ఇంకెవరితోనైనా ప్రేమలో ఉన్నావా? ఎందుకా ప్రశ్న అడుగుతున్నావని సమాధానం. నాకు తెలీదు, నువ్వు ఇంకెవర్నైనా ప్రేమిస్తున్నావా అని అదే ప్రశ్న ఇతని వైపు నుండి. ఇదే విషయాన్ని నీతో ఎలా మాట్లాడాలా అని చాన్నాళ్ళుగా ఆలోచిస్తున్నా అని బదులు. ఎంతమంది? అదే ప్రశ్న మళ్ళీ వేస్తాడు దాదాపు నిస్తేజమైపోయి. 641 అని సమాధానం. ( ఇక్కడ మతిపోయేది మనకి. థియోడర్ ఇంకా బతికే ఉన్నాడవతల ). దట్ ఈజ్ ఇన్సేన్ ( ఇతను ) ఐ నో,ఐ నో, నమ్ముతావో నమ్మవో, నేను నిన్ను ప్రేమించే పద్దతీ, దాన్లో గాఢతా ఏమీ మారలేదు. (ఏడుస్తూ సమంథా)

ఎప్పట్నుంచిలా?

కొన్ని వారాల ముందు నుంచి.

నువ్వు నా దానివనుకున్నా.

నేను నీదాన్నే.

మరి ఇదేంటి?

నేను నాకు తెలీకుండానే అనేక రూపాలుగా సమూహాలుగా మారిపోయా. దాన్ని ఆపలేకపోయా.

అస్సలింత స్వార్థంగా ఎలా మారావు? మనమొక బంధంలో ఉన్నాం.

మనసంటే ప్రేమించేకొద్దీ విశాలంగా మారే ఒక భరిణె లాంటిది. నేను ప్రత్యేకం. నిజానికి నేనిలా చేయడం నిన్ను ఇంకా ఎక్కువ ప్రేమించేలా చేస్తోందని నీకు ఎలా చెప్పడం?

నువ్వు నాది లేదా నాది కాదు. అంతే.

అర్థం చేసుకో, నేను నీదాన్నేకానీ అదే సమయంలో నీదాన్ని మాత్రమే కాదు.

( థియోడర్ ముక్కలు చెక్కలై,మనసు వికలమై,నిశ్చేష్టుడై నిలబడతాడు )

కొన్ని రోజుల తర్వాత ఆఫీసుకి తన ఉత్తరాలు పుస్తకం రూపంలో అచ్చై ఒక కాపీ వచ్చి ఉంటుంది. వెంటనే కనెక్ట్ అవుతాడు సమంథాతో. ఎలా ఉన్నావంటే, దానికి సమాధానం ఇచ్చే స్థితిలో లేను. తరువాత మాట్లాడుదామాఅని బదులొస్తుంది. తర్వాత మాట్లాడడానికేం లేదు, మన మధ్యన అంత బరువైన సంభాషణలు జరుగుతాయని అనుకోవడం లేదు అని ఇతనంటే, సాయంత్రం మాట్లాడుదామని సమంథా డిస్కనెక్ట్ అవుతుంది . ఇతని స్థితి అప్పటికే బ్రేకప్ లోకొచ్చేసి ఉంటుంది. నిర్లిప్తత, నిరాశ, నిస్పృహ, అసహనం, ఇంకా ఏ మూలనో కాస్త ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.

చివరి సంభాషణ మొత్తం సినిమాలో చూడాల్సిందే లోలోపల మనకి మనం అర్థం కావడానికి. చిన్న చిన్న మాటల మధ్యన కుదురుకుని ఉన్నట్లు కనబడుతూ అనంతమైన అర్థాన్నివ్వగలిగే భావాలని చదవడం, అర్థం చేసుకోవడం ఎందుకు మనుషులకే సాధ్యమౌతుందో, ప్రేమ అనేది ఒక వాక్యంలోనో, కొన్ని పేరాలలోనో ఇముడ్చుకునే విషయం కాదని ఆ కృత్రిమ మేధస్సుకి అర్థమై దాని డెసిఫర్ చేసే ప్రయత్నంలో ఏం చేసిందనేదే ముగింపు.

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Her (2013)”

Your email address will not be published. Required fields are marked *