Crazy Heart (2009)

Category:

Bad Blake ను ఎలా పరిచయం చేయాలి? ఒక పాటలో చెప్పేస్తే పోతుంది కదా? ఆ పాత్ర నేపథ్యం ఏమిటి? వర్తమానంలో అతని అవస్థలేమిటి? అతని గత జీవితమంతా ఒక పాటలో చెప్పేస్తే ఎలా ఉంటుంది? అదే చేశాడు దర్శకుడు. ఆ పాత్రకి ప్రాణం పోసిన Jeff Bridges. ఆ 1978 నాటి సబర్బన్ కారు. అత్యంత దారుణంగా పద్దతి తప్పి, జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుని, ‘నా’ అనే వారు లేక, బతకడానికి చేతిలో ఒక గిటారు, గత కాలపు వైభవాన్ని బేగేజీ కింద మోస్తూ, దాన్ని గుర్తించే వారు అరుదైపోయి, అస్థిత్వపోరాటంలో తన నైపుణ్యాన్ని కొన్ని డాలర్లకు అమ్ముకుంటూ బతుకు బండిని అతికష్టం మీద లాక్కొని వస్తున్న మనిషి. కోపం, దురభిమానం, అసహనం. అస్తవ్యస్తమైన జీవన విధానం, తాగుడు. ఏదీ వెతక్కుండానే, ఏం కావాలో తెలీకుండానే ఎడారిలో ఎటో వెళ్ళిపోతూ, మధ్యలో ఎక్కడో ప్రాణం పోతుందని తెలిసీ ఎడారి మధ్యలోకి వెళ్ళిపోతున్న Bad. చేసిన తప్పులు, వేసిన తప్పటడుగులు తినేస్తూంటే పశ్చాత్తాపపడే ఓపిక కూడా లేక జీవితాన్ని లిక్కరు సీసాల్లోంచి గొంతులోకి వొంపుకుంటూ శరీరాన్ని మండించేస్తున్న Bad. ఎప్పుడాగిపోతుందో తెలీని కరుడు గట్టిన గుండె. ‘నాకొరకు చెమ్మగిల నయనమ్ము’ లేదని ఇతని గురించే రాశారా అనేట్లు.
ఇదే సినిమా ప్రారంభంలో వచ్చే పాట:
I’ve been loved and I’ve been alone
All my life I been a rolling stone
Done everything that a man can do
Everything to get a hold on you
Done everything that a man can do
Everything to get a hold on you
I’ve been blessed and I’ve been cursed
All my lines has been unrehearsed
All the fires that I walked through
Only tryin’ to get a hold on you
All the fires that I walked through
Only tryin’ to get a hold on you ( https://www.youtube.com/watch?v=grP22coLFhw – ఈ పాట వింటే సంధర్భం ఇంకా బాగా అర్థమౌతుంది).
“I’m 57 years old and I am broke. I got $10 in my pocket.” అదన్నమాట పరిస్థితి. ఒక పట్టణం నుంచి ఇంకో పట్టణానికి వెళ్తూ అక్కడక్కడా కచేరీలు చేస్తూ, బతకడానికి డబ్బులు సంపాదించుకుంటున్న ‘Bad’ Blake. అరవైకి దగ్గరౌతున్న జీవితం. హ్యూస్టన్ లో ఇల్లు, కానీ డబ్బులేం లేవు. తాగుడు, స్మోకింగ్. జీవితంలో చెప్పుకోవడానికేమీ మిగలని గతం. బతికి బట్టకట్టడమే కావడమే గగనమౌతున్న పరిస్థితి. ఒకప్పుడు పాటలు రాసి, స్వయంగా పాడి కొన్ని ఆల్బం లు తయారు చేసి ఉంటాడు. వాటి మీద రాయల్టీలు దాదాపు ఆగిపోయాయి. అమ్మకాలేం లేవు. అదే సమయంలో తన దగ్గర ఒకప్పుడు శిష్యరికం చేసిన Tommy చాలా గొప్పవాడైపోయాడు. ఇద్దరికీ పొసగట్లేదు.
మన కథా నాయకుణ్ణి చూస్తే, తాగుడు, పొగ తాగుడు, ఎవరితోనూ సంబంధాలు సవ్యంగా లేని ఒంటరి. నాలుగు పెళ్ళిళ్ళు పెటాకులైపోయి ఇరవై ఎనిమిదేళ్ళ కొడుకుండి కూడా పాతికేళ్ళుగా ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కూడా తెలీని తండ్రి Bad. దాని మీద ఎలాంటి చింతా లేదు. స్వయంగా విధించుకున్నఒంటరితనం ప్రపంచానికి తనని ఎప్పుడో దూరం చేసేసింది. చిరుగులైపోయి గాలికి తిరుగుతున్న దారం తెగిన గాలిపటం. ఎగరడం కాదు, చెత్తబుట్టలో కూడా పడేసే అవకాశం లేని చెత్తగా తయారైపోయాడు. వింటేజ్ పాటలు విపరీతంగా అభిమానించేవారికి ఇతనేంటో తెలుసు. అతనికి సమకాలీకులు, అతని కెరియర్ గొప్పగా నడుస్తున్న రోజుల్లో ఇతన్ని అభిమానులందరూ అప్పటికే జీవితపు మలిసంధ్యలోకి వచ్చేసినవాళ్ళే. రిలవెంట్, కంటెంపొరరీ సాహిత్యం, సంగీతం ఇతనిదగ్గర లేదని కాదు కానీ ఇతను ఒకప్పుడు మంచి పేరు తెచ్చుకున్న పాటల్నే కచేరీల్లో పాడుతూ ఇతని సంగీతాన్ని మెచ్చే వారి మెప్పు పొందుతూ, రొటీన్ గా తాగడం, సిగరెట్టు పొగల్లో పొగచూరిపోతూ ఉండడమే ప్రస్తుత ‘Bad’ Blake జీవితం.
ఇతని ఏజంట్ ఇతనికి గిటార్ కచేరీలని పబ్బుల్లో, చిన్నపాటి బౌలింగ్ కన్వెన్షన్లలో ఏర్పాటు చేస్తూ ఉంటాడు. అంతకన్నా పెద్ద వేదికల మీద ఇతను ప్రదర్శనలని ఇచ్చి చాలా ఏళ్ళయిపోయాయి. ఇతనిదగ్గర శిష్యరికం చేసిన Tommy కూడా ఒక చిత్రమైన పరిస్థితిలోనే ఉంటాడు. అతని దగ్గర కూడా కొత్త పాటలేం లేవు. ఏవైనా రాయగలిగితే అది Bad మాత్రమే రాయగలడని Tommy నమ్మకం. ఇతను పాటలు రాస్తే అతను పాడి ఆల్బం విడుదల చేయాలనే ఆలోచనలో ఉండి ఏజెంట్ కి అదే సంగతి చెప్తాడు. ఏజెంట్ చేరవేసిన విషయాన్ని ఇతను చాలా తేలిగ్గా తీసుకుంటాడు. Bad కు ఇష్టం లేదు అలా చేయడం. కానీ సొంత ఆల్బం కోసమైతే చేద్దామనే ఆలోచనలో ఉంటాడు కానీ మ్యూజిక్ కంపెనీకి ఇతను చాలా ఏళ్ళుగా ఔట్ డేటెడ్.
ఒక రోజు లిక్కర్ షాపులో ఓనరు ఇతన్ని గుర్తు పట్టి ఇతనిదగ్గర డబ్బులు లేక ఏదో చౌకరకం లిక్కరు కొనుక్కోబోతోంటే చూసి మంచి ఖరీదైన లిక్కరు ఇతని చేతిలో పెట్టి తమ భార్యాభర్తలకి ఇతని సంగీతం అంటే ప్రాణం అని చెప్తూ ఫలానా పాట పాడమని అభ్యర్తిస్తాడు. ఇతను రోజంతా తాగి సాయంత్రానికి పబ్బులో పాడి,అక్కడున్న ట్రూప్ అందిస్తూంటే ఏదో మమ అనిపిస్తాడు. చూసే వాళ్ళకి ఇతనో గొప్ప లెజెండ్ కానీ ఒకప్పుడు ఉర్రూతలూగించిన సంగీతం ఇచ్చిన మనిషి కొద్ది కొద్దిగా ఇతనిలోంచి మాయమౌతూ ఉన్నాడని అర్థమౌతుంది. ఏజెంట్ ఫోన్ చేస్తాడు. Tommy కచేరీ ఒకటి, పన్నెండువేల మంది దాకా హాజరౌతున్న విభావరిలో ఇతను లీడ్ సింగర్ గా ( అంటే మొదట ఇతను ప్రారంభించడం, తరువాతి కచేరీ మొత్తం Tommy నడిపించడం అన్నమాట. Sort of Ice Breaking) ప్రోగ్రాముని మొదలు పెట్టే అవకాశం తలుపు తడుతుంది. ముందు ఒప్పుకోడు కానీ పరిస్థితి అర్థమౌతూనే ఉండగా సరే అంటాడు. అంతకు ముందు అదే పట్టణంలో ఒక లోకల్ మేగజైనుకు రాస్తున్న జర్నలిస్టు Jean పరిచయం అవుతుంది. ఇంటర్వ్యూ లో ఇతని గతాన్ని ముక్కలు ముక్కలుగా చెప్తాడు. ముఖ్యమైన వాటినేవీ గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చేయడు. కొడుకున్నాడనీ, అతనితో ఏ రకమైన బాంధవ్యమైనా నెరిపి దాదాపు పాతికేళ్ళు కావస్తోందని కూడా చెప్తాడు కానీ ఇంకా వివరంగా ఏదీ చెప్పడు. దెబ్బ తినేసిన గతం. ముక్కలైన బ్రతుకు, చిరిగి పేలికలైపోయి గత కాలపు వైభవం చాయామాత్రంగా అక్కడక్కడా తారసపడుతున్న వాస్తవం. ఎవరో, ఎక్కడో ఇతని అభిమానులు గుర్తు పడితే, ఇతని సంగీతాన్ని ఇంకా గుర్తుపెట్టుకుని అభిమానిస్తూంటే తేరుకుని, పైకిలేచి నడిపిస్తున్న వర్తమానం. గుర్తింపు కోల్పోతున్న కళాకారులు తాగుడుకీ, ఇంకా అనేక పలాయన మార్గాల్లోకి పారిపోవడానికీ కారణం అదే.
నాలుగు పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకుని, అయిదో పెళ్ళి సంగతిని ఎప్పుడూ ప్రస్తావించని ఇతను ఈ జర్నలిస్టు Jean తో సంబంధం పెట్టుకుంటాడు. తను కూడా డైవోర్సీ, ఇతని సంగీతం గురించి, ఇతని సమకాలీకుల గురించి, ఇతనికి ముందు ఇతని తరంలోని అనేకమందికి ప్రేరణ నిచ్చిన దిగ్గజాల గురించీ క్షుణ్ణంగా తెలుసుకునే ఉటుంది. నాలుగేళ్ళ బాబు ఉంటాడు తనకు. వంటరి మహిళ. వీరిద్దరికీ దగ్గరౌతున్న Bad.
సంగీత విభావరిలో బ్రహ్మాండమైన ప్రతిస్పందన. Bad వింటేజ్ పాటకు Tommy జత కావడం విశేషంగా జనాల్ని ఆకట్టుకుంటుంది. ఏదో ఉత్సాహం తలుపు తడుతోంది Bad ను. ఏమి సాహిత్యం అది? ఉత్సాహమంతా తన్నుకుంటూ వచ్చే ఏం ట్యూన్ అది? ఉరకలెత్తే సంగీతం తోడై, చేసిన తప్పుల్ని చూసి, వేసిన తప్పటడుగులని గుర్తు చేసుకుంటూ మనలని మనంగానే అంగీకరిస్తూనే వర్తమానంతో సమన్వయం చేసుకుంటూ తనలో మార్పుని కోరుకుంటూ పరివర్తన రావడానికి, తనకు తానే ఊతమై నిలబడడానికి తనకు తాను చేసుకునే సహాయం. మనలో తప్పులే చేయకుండా, జీవితంలో దారి తప్పకుండా, అడ్రినలినూ, టెస్టోస్టిరానూ కలిపి కొట్టి కిందకెక్కడో తోసేస్తే కిందపడిపోతూ తేలుతూండే అనుభూతిని పొందని వారికి ఈ పాట అర్థం కాదు.(పామరభాషలో, జీవితం ఒక్కసారైనా చంకనాకిపోనివాళ్ళకు ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఎక్కదు అని తాత్పర్యం 🙂 ) ఈ ఒక్క పాటలో Bad మొత్తం జీవితం ఒకసారి మన కళ్ళముందు తిరుగుతుంది. ఆ పాట ఎన్నుకోవడం లోనే దర్శకుడి నైపుణ్యమంతా తెలిసిపోతుంది. ఆ పాట సాహిత్యం ఇక్కడ …
BAD
I was goin’ where I shouldn’t go
Seein’ who I shouldn’t see
Doin’ what I shouldn’t do
And bein’ who I shouldn’t be
A little voice told me it’s all wrong
Another voice told me it’s alright
I used to think that I was strong
But lately I just lost the fight

It’s funny how fallin’ feels like flyin’
For a little while
It’s funny how fallin’ feels like flyin’
For a little while

TOMMY
I got tired of bein’ good
And started missin’ that old feelin’ free
Stopped actin’ like I thought I should
And went on back to bein’ me

BAD AND TOMMY
I never meant to hurt no one
I just had to have my way
If there is such a thing as too much fun
This must be the price you pay

Funny how fallin’ feels like flyin’
For a little while
Funny how fallin’ feels like flyin’
For a little while

(ఇక్కడ వినండి: https://www.youtube.com/watch?v=LTYyS8bxV78)
మాటల మధ్యన తన వ్యక్తిగత ఆల్బం గురించి ప్రస్తావిస్తే, పాటలు రాయమని, ఇప్పుడు దానికే చాలా కొరత ఉందని చెప్పి, తిరిగి ప్రచారం లోకి రావడానికి తాను అదే ఇప్పుడు చేయగలిగిందని అంటాడు Tommy. రాసే ఆసక్తి Bad లో ఇప్పుడు లేదు. ఇతన్ని నడిపించడానికీ, ప్రేరణ ఇవ్వడానికీ, తిరిగి తన గుర్తింపును పొందేందుకు ఎలాంటి ఉత్ప్రేరకమూ తన దగ్గర లేదు.
షో అయిపోయాక Jean గుర్తొస్తుంది. వాళ్ళింటికి వెళ్తూ దారిలో కారు ప్రమాదం. పాదం ఎముక విరిగి Jean జాగ్రత్తగా చూసుకుంటూంటే ఇద్దరి మధ్యన , ఆ బాబుతో Bad కూ అనుబంధం పెరుగుతూ ఉంటుంది. ఆ విరామంలోనే తన ఏజెంట్ దగ్గరినుంచి పెద్ద మొత్తానికి కాంట్రాక్టు వచ్చిందనే విషయం తెలుస్తుంది. Tommy మ్యూజిక్ కంపెనీ వారిని వప్పించి ఇతనిచేత పాటలు రాయించేందుకు పెద్ద మొత్తంలో రాయల్టీ, ఇంకా ఇతని సొంత ఆల్బం విడుదల చేయడానికి ఏర్పాట్లు కూడా చేసి ఉంటాడు. ఇతని జీవితంలో ఒక వెలుగు రేఖ, ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్న ఒక బ్రేక్ త్రూ. రెండో ఇన్నింగ్స్ కు ఊపిరొచ్చిన సమయం. హ్యూస్టన్ కి బయలుదేరుతాడు. సొంత కొడుకు గుర్తొస్తాడు. ఫోన్ చేస్తే మాజీ భార్య రెండేళ్ళ క్రితం చనిపోయిందని తెలుస్తుంది. మాట్లాడుతున్నది ఎవరంటే సొంత కొడుకే అని తెలుస్తుంది. తండ్రిని కలవడానికి అస్సలు ఇష్టపడడు. అతనికప్పుడే ఇరవై ఎనిమిదేళ్ళు. తప్పు సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. ఇతనూ మినహాయింపు కాదు. ఇక ఆ అధ్యాయం అయిపోయింది ఇతని జీవితంలో.
Bad, Jean ఇద్దరికీ ఎడబాటు. కలిసుండడం సరే, పెళ్ళి అనేది చాలా పెద్ద నిర్ణయం కాబట్టి దాన్నప్పటికి ఆలోచనల్లొ ఇద్దరూ రానీయరు. హ్యూస్టన్ చేరాక తన పనుల్లో లీనమైపోయిన ఒకరోజు Jean నుంచి ఫోన్ వస్తుంది. నాలుగురోజుల సెలవులు హ్యూస్టన్ లో గడిపాలని నిర్ణయించుకుంటారు. హ్యూస్టన్ లో అన్ని ప్రదేశాలూ తిప్పుతూ ఉండగా తన దగ్గర తన నాలుగేళ్ళ బాబు ని వదిలి విశ్రాంతి తీసుకోమని పంపేస్తాడు. బార్ కు వెళ్ళి ఒక పెగ్గు తాగుతూంటే పిల్లాడు తప్పిపోతాడు. ఆ సరికే ఇతని తాగుడు గురించి హెచ్చరించిన Jean , ఈ సంఘటనకి తట్టుకోలేక కాసేపటికి దొరికిన బాబుని తీసుకుని వెనక్కెళ్ళిపోతుంది. ఎంత బతిమాలినా ఇక ఉపయోగం ఉండదు. అప్పణ్ణుంచి ఇక తాగి, తాగుడులోనే రోజులకొద్దీ సమయం గడిపి శరీరం పాడు చేసుకుని ఒక పొద్దున స్నేహితుడి ( Robert Duvall ) సహాయంతో రెహాబిలిటేషన్ సెంటర్ కి చేరుతాడు. వారాలు గడిచాక మారిన ఈ మనిషి మళ్ళీ Jean దగ్గరకు వెళ్తాడు. అదే సమాధానం. ఇక ఏ అనుబంధమైనా ఏర్పడే అవకాశాలు మూసుకుపోయాయని అర్థమైపోతుంది. ఇతని ప్రేమ నిరాకరింపబడి ఆరో పెళ్ళి దాకా వెళ్ళదు.
ఒక పాట రాస్తాడు. అన్ని చోట్లా ఆ పాటకు బ్రహ్మరథం పడతారు జనం. టామీ కి కొత్త అభిమానులు పాత వారికి తోడయ్యారు. కెరియర్ దూసుకుపోతోంది.Bad జీవితం కూడా దారిలో పడింది. ఆ పాటకు నిజం ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది 🙂
Your heart’s on the loose
You rolled them seven’s with nothing lose
And this ain’t no place for the weary kind
You called all your shots
Shooting 8 ball at the corner truck stop
Somehow this don’t feel like home anymore
And this ain’t no place for the weary kind
And this ain’t no place to lose your mind
And this ain’t no place to fall behind
Pick up your crazy heart and give it one more try
Your body aches’
Playing your guitar and sweating out the hate
The days and the nights all feel the same
(https://www.youtube.com/watch?v=ePVVDGRIHD0)
ఏళ్ళు గడుస్తాయి. అదో పెద్ద ఆడిటోరియం. Tommy పాటకు వచ్చిన వందలాది జనాలు నీరాజనాలు పడుతున్నారు. పాట రాసింది Bad. వేదిక వెనుక నుంచి ఏజెంటు తన చేతిలో పెట్టిన ఒక పెద్ద మొత్తానికి చెక్కుని చూసుకుంటూ బయటికొస్తాడు. పార్కింగ్ లాట్ దగ్గర ఒక స్త్రీ గొంతు. జర్నలిస్టు Jean. ఇంకో పెద్ద పత్రికలో పని చేస్తూ ఉంటుంది. షేక్ హేండిస్తూంటే తెలుస్తుంది, పెళ్ళైన ఉంగరం తన వేలికి తొడిగి ఉండడం. అతను మంచి వాడని చెప్తుంది. పిల్లాడి క్షేమ సమాచారం అడిగి, చెక్కుని ఆమె చేతిలో పెట్టి పిల్లాడికి యుక్త వయస్సొచ్చాక ఇవ్వమని చెప్తాడు. Jean మళ్ళీ ఇంటర్వ్యూ అడుగుతుంది. Bad ఒప్పుకుంటాడు. ఈసారి చేదైన విషయాలు, అతన్ని అతలాకుతలం చేసిన సంఘటనలనీ, నిజాలనీ చెప్పడానికి అతనికి పెద్ద అభ్యంతరాలేమీ ఉండకపోవచ్చు.
It’s never too late !
Jeff Bridges కు ఉత్తమ నటుడిగా అకాడెమీ అవార్డు తెచ్చిపెట్టిన చిత్రం. అంతకు ముందు మూడు సార్లు ఉత్తమ సహాయ నటుడిగానూ, ఒక సారి ఉత్తమ నటుడి కేటగిరీలో నామినేట్ అయిన మనిషి. ఈ సినిమా ఇతనికోసమే తీశారన్నట్లు, ఈ కథకు మూలమైన నవల ఇతనికోసమే రాసినట్లు, కొన్ని అలా రాసి పెట్టే ఉంటాయి. కాబట్టి Pick up your crazy heart and give it one more try.

Reviews

There are no reviews yet.

Be the first to review “Crazy Heart (2009)”

Your email address will not be published. Required fields are marked *