Bermuda
కోవెల సంతోష్ కుమార్

యమధర్మరాజును ఎప్పుడైనా చూశారా? అతని చేష్టలను ఎప్పుడైనా కన్నారా? కోరలు చాచుకుని మింగేసేందుకు సిద్ధమైన మృత్యుబిలాన్ని కన్నారా? మన భూమ్మీదే.. మన కోసమే అది కాచుక్కూచుంది. మనిషికి అంతుపట్టని మరణ మృదంగాన్ని మోగిస్తోంది. మన కళ్ల ముందే మనిషిని అనంతలోకాల్లోకి తీసుకుపోతోంది.. అక్కడికి వెళ్తే క్షణాల్లో మనిషి మాయమైపోతున్నాడు. అవును అది అంతు చూస్తోంది. వాసన సోకితేనే దానికి ఆకర్షితులవుతున్నారు. మనుషులే కాదు.. మహా మహా విమానాలు సైతం దానికి లొంగిపోతున్నాయి. దాని ముందు కుప్పకూలిపోతున్నాయి. మనిషికి అంతుపట్టట్లేదు.. మానవేతరుల జాడ తెలియటం లేదు. అక్కడ ఏముంది? దశాబ్దాలుగా మనిషిని భయపెట్టుకుంటున్న ఆ మిస్టరీ ఏమిటి?

మనిషికి అర్థం కాని రహస్యాలను దాచిపెట్టిన ప్రాంతాలవి.. మానవమాత్రులెవరూ దాన్ని దూరం నుంచి చూసేందుకైనా భయపడే ప్రదేశం..ప్రశాంతంగా ఉండే సాగరం.. భూమికి అస్తిత్వాన్ని కట్టబెట్టిన సముద్రం.. అందులో అతి భయానకమైన ప్రాంతం.. అది యమధర్మరాజు నివాసం.. భూమ్మీద ఉన్న మృత్యులోకం.. అక్కడికి మానవులు బొందితో వెళ్లటం నిషేధం.. నౌకలో వెళ్లినా.. విమానంలోకి వెళ్లినా.. క్షణాల్లో మటుమాయం చేసే శక్తి అక్కడ దాగి ఉంది. ఫోటోలకు, సాటిలైట్లకు అంతు చిక్కని విచిత్రమైన ప్రాంతం.
మానవేతరులకు మాత్రమే అక్కడికి వెళ్లగలరు.. క్షేమంగా తిరిగి రాగలరు.. అది వాళ్లు ఈ భూమ్మీద తమకోసం ఏర్పరుచుకున్న స్థావరం.. భూమ్మీద మరెక్కడా కనిపించని శక్తిమంతమైన వ్యవస్థ ఆ ప్రాంతాన్ని కాపాడుతోంది.
ఆ వ్యవస్థ ప్రకృతి సహజమైన నియమాలకు పూర్తి భిన్నంగా ఉంది. భూమ్మీద ఇతర ప్రాంతాల్లో ఎక్కడా కనిపించని ప్రాకృతిక వ్యవస్థ ఇక్కడ ఉంది. దిక్సూచి కొలతలు ఇక్కడ పనికి రావు. తూర్పు పడమరల వంటి దిక్కులు ఇక్కడ కనిపించవు. ఉత్తర దక్షిణాలు ఎటువైపు ఉన్నాయో అర్థం కాదు.
ఇక్కడ ఉన్నట్టుండి తుపానులు వస్తాయి. ఉన్నట్టుండి సమసిపోతాయి. క్షణం కిందటి వరకు ప్రశాంతంగా ఉన్న సాగరం..ఒక్కసారిగా ఎగిసిపడుతుంది. మిగతా ప్రాంతాల్లో తెలిసినట్లుగా ఇక్కడ ఎలాంటి సంకేతాలు లభించవు. మన సాంకేతికతకు మించిన ప్రకృతి వ్యవస్థ ఇది. ఇది గ్రహాంతర వాసులు భూమిని తమ నియంత్రణలోకి తెచ్చుకునేందుకు ఏర్పాటు చేసుకున్న డెన్.. ఇక్కడికి వాళ్లు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు వెళ్తారో తెలియదు. ఇక్కడ ఏం వదిలి వెళ్లారో అర్థం కాదు. ఏం చేస్తున్నారో తెలియదు. తామేదైనా భూమి నుంచి కోరుకుంటున్నారా? భూమికి మేలు చేసేందుకు ఇక్కడ ఉన్నారా? కీడు చేసేందుకా? వాళ్ల ఆనుపానులను తెలుసుకునేదెలా? ఏమిటీ మిస్టరీ.. ఎక్కడ ఉందీ మృత్యుబిలం.. రోదసిని సైతం మధిస్తున్న మన సాంకేతిక పరిజ్ఞానానికి మించిన శక్తి ఏమున్నది? ప్రకృతిలో మనకు తెలియని రహస్యాలంటూ ఉన్నాయా? ఇది నిజంగానే గ్రహాంతర వాసుల స్థావరమా? అయితే వాళ్ల ఉనికిని మనం గుర్తించినట్లేనా? ఎన్నెన్నో ప్రశ్నలు.. దేనికీ జవాబు లేదు.. తెలియదు..? కానీ, ఆ ప్రాంతం ప్రపంచాన్ని మాత్రం వణికిస్తోంది..
ఈ భూమిని ఒక క్రమబద్ధంగా నిర్మించటంలో ఇతర గ్రహాల నుంచి వచ్చిన జీవులు చాలా కృషి చేశారు.. ఆ ప్రయత్నంలోనే కొన్ని ప్రాంతాలను తమ అధీనంలో ఉంచుకున్నారు. ఇవి మనిషి మేధస్సు ఛేదించలేని ప్రాంతాలు..
వీటిలో ఒకటి బెర్ముడా ట్రయాంగిల్.. ఇంతకాలం ఇదొక మిస్టరీ.. ఇది ఏలియన్ల పాలిటి రీసార్ట్ కావచ్చన్నది లేటెస్ట్ విషయం.
అట్లాంటిక్ మహా సముద్రం
ఫ్లోరిడా జలసంధి
బహామా దీవులు
కరీబియన్ దీవులు
అజోరెస్‌కు తూర్పున
త్రికోణాకారంలో విస్తరించిన ప్రదేశాన్ని బెర్ముడా త్రికోణంగా పిలుచుకుంటారు. అట్లాంటిక్ మధ్యలో ఉన్న బెర్ముడా దీవి హద్దులను కలుపుతూ ఉన్న ప్రాంతమిది. ఇవి కూడా ఊహాజనితమైన హద్దులే తప్ప ఖచ్చితంగా డిఫైన్ చేసినవి కావు. మియామీ నుంచి కోస్టరీకా, బెర్ముడాల మధ్య ఉన్న ప్రాంతం అంతా అంతులేని మాయా ప్రపంచానికి కారణమైంది.
ఈ వాతావరణంలోకి ప్రవేశించిన విమానాలు మటుమాయమైపోయాయి. కనీసం వాటి జాడ కూడా తెలియకుండా పోయాయి. ఈ ప్రాంతంలో తిరిగిన నౌకలన్నీ ఉన్నట్టుండి మునిగిపోయాయి. సుడులు తిరుగుతూ సముద్రగర్భంలో కలిసిపోయాయి.
1969లో అమెరికా నుంచి ప్రయాణిస్తూ వెళ్లిన ఓ నౌక ఈ ట్రయాంగిల్‌లోకి ప్రవేశించగానే సుళ్ళు తిరుగుతూ నీటి అలల కబంధ హస్తాల్లో పడి మునిగిపోయింది. సముద్ర గర్భంలో ఎక్కడో విసిరేసినట్లుగా పడిపోయింది. ఆ తరువాత జరిగిన ట్రేసవుట్‌లో నౌకలో కెప్టెన్ ఒక్కడి శవం మాత్రమే కాఫీ కప్పు పట్టుకున్న భంగిమలో కనిపించింది. మిగతా శవాలన్నీ మాయమైపోయాయి. వాటి జాడ కూడా తెలియలేదు.. కారణం ఇప్పటికీ తెలియదు.. అది అంతులేని మిస్టరీ..
అంతకు ముందు వరకు సరిగ్గా ప్రయాణించిన విమానలన్నీ అక్కడ మాత్రమే ఎలా మాయమవుతున్నాయి? అంతటి మహా సముద్రంలో ప్రశాంతంగా తిరిగిన నౌకలన్నీ బెర్ముడాలోకి ఎంటర్ కాగానే ఒక్కసారిగా ఎలా మునిగిపోతున్నాయి? అంతుపట్టని ప్రమాదాలు.. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఇలాంటి ప్రమాదాలు జరిగినట్లే ఇక్కడా జరుగుతున్నాయనుకుంటే పొరపాటు. ఇక్కడి పరిస్థితే ఒక విచిత్రం. ఎంతటి గొప్ప నౌకైనా ఈ ట్రయాంగిల్‌లోకి ప్రవేశించిందంటే నీటి గర్భంలోంచి ఏదో ఒక శక్తి దాన్ని అమాంతంగా ఆకర్శించేస్తుంది. అంతే దాని అంతం ఆసన్నమైనట్లే.
మనకు తెలియని మానవాతీత శక్తి ఏదో బెర్ముడా ట్రయాంగిల్‌లో పని చేస్తున్నది. ఎవరికీ అంతుపట్టని విచిత్రమైన వాతావరణం అక్కడ నెలకొని ఉంది. ఆ వాతావరణం మనకు సరిపడటం లేదు. ఆ శక్తి మనకు అంతుపట్టడం లేదు. ఇక్కడున్న భూమ్యాకర్షణ శక్తి వేరు.. ఎగిసిపడే సముద్రపు అలల తీవ్రత వేరు.. అక్కడే ఎందుకు ఇలా జరుగుతోంది.. నిజంగానే మనిషికి అతీతమైన శక్తులు ఆకాశం నుంచి దిగివచ్చి పని చేస్తున్నాయా?
అమెరికాను కనుక్కున్నదెవరో మీకు గుర్తుందా? క్రిస్టోఫర్ కొలంబస్.. అట్లాంటిక్ మహాసముద్రంలో బెర్ముడా భూతాన్ని మొట్టమొదట కనుగొన్నది ఆయనే.. కాకపోతే ఆయన దాని లోపలికి వెళ్లకుండా అంచుల నుంచే బయటపడ్డాడు కాబట్టి చెప్పగలిగాడు. అక్కడ ఆయనకు కనిపించిందేమిటో తెలుసా? ఆ ప్రాంతంలోకి వెళ్లేసరికి అతని నౌకలోని దిక్సూచి పనిచేయటం మానేసింది. సముద్రం మధ్యలోకి కొన్ని అగ్ని గోళాలు ఆకాశం నుంచి పడుతుండటం చూశాడు.
అవి అగ్ని గోళాలేనా? లేక యుఎఫ్‌ఓలా.. యుఎఫ్‌ఓల్లోంచి గ్రహాంతర వాసులు బెర్ముడా త్రికోణంలోకి దిగారా? సూపర్ నేచురల్ పవర్ అనేది ఇక్కడ పనిచేస్తున్నదనే కొలంబస్ భావించారు. ఆయన తరువాత ఆ ప్రాంతం గుండా ప్రయాణించిన వారందరిదీ ఒకే అభిప్రాయం.. ఆకాశం నుంచి దేవతలు దిగివస్తున్నారని.. బెర్ముడాలో కొంతకాలం గడిపి తిరిగి వెళ్తున్నారని..వాళ్ల ప్రైవసీకి ఆటంకం కలిగించిన వారికి మరణం తప్పదని కూడా వాళ్లు భావించారు.
గత అయిదు వందల సంవత్సరాల్లో వందల మంది బెర్ముడా త్రికోణంలో అంతుపట్టని విధంగా మాయమయ్యారు. తప్పించుకునే అవకాశం లేదు. ప్రతిఘటనకు తగినంత శక్తి లేదు.. ఏం జరుగుతుందో తెలుసుకునే లోగానే అదృశ్యమవుతాయరు. గ్రహాంతర వాసులేనా ఈ ఘటనకు కారణం… అంటే అవునన్నదే ఇప్పటివరకూ ఉన్న సమాధానం.
1945, డిసెంబర్ 5 మధ్యాహ్నం రెండు గంటల సమయం.. అమెరికా సైనిక విభాగం అయిదు బాంబర్ యుద్ధ విమానాలతో తన సైనిక సిబ్బందికి శిక్షణ ఇవ్వటం ప్రారంభించింది. బెర్ముడా త్రికోణం మధ్యలోకి వచ్చేసరికి అయిదు యుద్ధ విమానాలూ అకస్మాత్తుగా అంతర్ధానమయ్యాయి. సహాయ చర్యల కోసం హుటాహుటిన మరో విమానాన్ని ఆ ప్రాంతానికి పంపించారు.. అదీ మాయమైపోయింది.. ఏమయ్యాయో తెలియదు. ఎక్కడ పడిపోయాయో తెలియదు.. అంతు తెలియని మిస్టరీ… అగ్రరాజ్యం మేధస్సుకు ఇంతవరకు అంతు చిక్కని సమస్య.
బెర్ముడా మిస్టరీని ఛేదించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ వృథాగా బూడిదలో పోసిన పన్నీరే అయింది. శాస్త్రవేత్తలు రకరకాలుగా చెప్పుకొచ్చారు.. కానీ, రహస్యం మాత్రం అలాగే ఉండిపోయింది. ఇక్కడ నిజంగా దేవతలు…. అదే గ్రహాంతర వాసులు కొలువై ఉన్నారా? లేక వచ్చి వెళ్తున్నారా? ఏది నిజం? అసలు బెర్ముడాలో ఏం జరుగుతోంది.. మీకు తెలుసా? ఇంత భయంకరమైన మృత్యుబిలం నుంచి కూడా బయటపడ్డ మృత్యుంజయుడున్నాడు. బ్రూస్ గెర్నన్ అనే ఓ పైలట్ తన తండ్రితో, మరో బిజినెస్ పార్టనర్‌తో కలిసి ఫ్లైట్‌లో బయలు దేరాడు.. బెర్ముడా ట్రయాంగిల్‌లోకి ప్రవేశించిన తరువాత వాళ్లు చిత్రమైన పరిస్థితిలో ఇరుక్కున్నారు.. విమానం ఒక్కసారిగా గాల్లోనే ఆగిపోయింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో అన్ని సంబంధాలు తెగిపోయాయి. ఉన్నచోటనే గుండ్రంగా తిరుగుతోంది. అన్ని వైపుల నుంచి ఎలక్ట్రానిక్ తరంగాల రూపంలో విమానంపై దాడి జరుగుతోంది. ఈ ముందు నుంచి సుడులు తిరుగుతూ గాలి మీదకు దూసుకువస్తోంది. 30 నిమిషాలపాటు ఏం జరిగిందో తెలియదు. బ్రూస్ మాత్రం విమానాన్ని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.. ఒక్కసారిగా త్రికోణం ఉచ్చు నుంచి విమానం బయటపడింది. ఇదంతా ఎలా జరిగిందో ఆయనకు తెలియలేదు. పరిశోధకులకు తెలియలేదు. అంతా మిస్టరీగానే ఉండిపోయింది.
సర్ ఐన్‌స్టీన్ దగ్గరి నుంచి ప్రసిద్ధ శాస్త్రవేత్తలు సైతం దీనిపై పరిశోధనలు చేశారు. కానీ, దీని రహస్యం మాత్రం తెలియలేదు. ఏమిటన్నది ఎవరూ తేల్చలేకపోయారు. భూమ్మీద మిగతా ప్రాంతాల్లో ఎక్కడా లేని విధంగా ఇక్కడ ఒక బలవత్తరమైన అయస్కాంత శక్తి ఉంది. ఎలాంటి వస్తువునైనా ఆకర్శించగలిగే శక్తి ఈ ప్రాంతంలో ఉంది. ఇది గ్రావిటేషనా? మరేదైనానా? ఈ అయస్కాంత శక్తి వల్లనే ఆ ప్రాంతంలోకి వచ్చినవన్నీ సముద్రంలో పడి మునిగిపోతున్నాయి. కానీ ఈ అయస్కాంత శక్తి గ్రహాంతర వాసులదేనని అనే వారు లేకపోలేదు.. అత్యధిక స్థాయిలో ఉన్న ఈ అయస్కాంత శక్తి వల్ల వాళ్లు ఊహకు అందని వేగంతో భూమి మీదకు వచ్చి, తిరిగి వెళ్తున్నారని చాలా మంది విశ్వాసం.
బెర్ముడా ప్రాంతంలో మీథేన్ హైడ్రేట్ నిల్వలు అధికంగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ మీథేన్ వల్ల నీటి నుంచి వచ్చే గాలి బుడగలు అక్కడి నీటి సాంద్రతను గణనీయంగా తగ్గించేస్తాయి. దీని వల్ల అక్కడికి వచ్చిన నౌకలకు తేలియాడే శక్తి తగ్గిపోయి తొందరగా మునిగిపోయే అవకాశం ఉంటుంది. బెర్ముడాలో జరుగుతున్న ప్రమాదాలకు ఇదే కారణమని మరొక వాదన.
ఓడలు మునిగిపోవటానికి మీథేనో, మరేదైనా కారణం ఉండిఉండవచ్చు. కానీ, వందల మంది.. ఎలా మాయమయ్యారు? ఇప్పటికీ ఎలా మాయం అవుతున్నారు? వాళ్ల శరీరాలు ఏమయిపోయాయి? వీటికి మాత్రం జవాబులు తెలిసిన వాళ్లు లేరు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలను అతిశయోక్తులనీ, అభూత కల్పనలంటూ వాదించే వాళ్లు సైతం తమ మాటలను నిరూపించుకున్నది లేదు.
అందుకే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని గ్రహాంతర వాసుల కోణంలోంచి చూస్తున్నారు. ఆ దిశగా ఆలోచిస్తున్నారు. పరిశోధన సాగిస్తున్నారు. ఇక్కడికి గ్రహాంతర వాసులు నిజంగానే వచ్చి వెళ్తున్నారా? వస్తే ఏం చేస్తున్నారు? ఏం వదిలి వెళ్తున్నారు? మనల్ని మించిన శక్తిసామర్థ్యాలు కలిగిన వాళ్ల గురించి తెలుసుకోవటం సాధ్యమేనా? అదే జరిగితే, ఈ భూమిపై మనం దేని గురించీ ప్రత్యేకంగా పరిశోధన చేయాల్సిన అవసరమే రాదు. ఎందుకంటే అప్పుడు మనకు అతీతమైంది ఏదీ ఉండదు కాబట్టి.

Reviews

There are no reviews yet.

Be the first to review “Bermuda
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *