Aruvi

Category:

ఆ అమ్మాయి చెంప పేలిపోయింది ఒక్కసారిగా. ఏ తీవ్రవాద సంస్థతో సంబంధం ఉందో తెలుసుకోవడానికి విచారణ చేస్తున్నారు. నీరసపడి, శక్తివిహీనంగా ఒక ఇరవై-పాతిక మధ్యలో వయసుండొచ్చు. మధ్యతరగతి అమ్మాయి అని కనబడుతూనే ఉంది. మాటల్లో సూటిదనం, స్థిరత్వమూ. ఎక్కడా డొంకతిరుగుడు లేకుండా నిబ్బరంగా మాట్లాడుతూ ఉంటుంది. మొహంపై దెబ్బల ఆనవాళ్ళు, ముక్కూ, పై పెదవీ కలిసిన చోట రక్తపు మరకలు. తన పేరు అరువి. స్పృహ కోల్పోతూండగా అంబులెన్సులో హాస్పిటల్ కు తనను తీసుకెళ్తూ ఉంటారు. బయట భోరున వర్షం. అక్కణ్ణుంచి మనం అరువి చిన్నతనంలోకి పయనం.

మూణ్ణాలుగు నెలల పాపాయి. తండ్రి లాలిస్తూ ముద్దులు కురిపిస్తూ. ఎంత ముద్దుగారే బంగారు తునక నా కూతురంటూ భార్యతో మురిసిపోతున్న తండ్రి.

మూడేళ్ళ పాప, తండ్రి గారాబం చేస్తూ, ముచ్చట్లూ, కథలూ చెప్తూ.

ఏడెనిమిదేళ్ళ బాలిక – తోడుగా తమ్ముడు. గుడికెళ్తూ తండ్రి చేయి వదలకుండా తను. స్కూల్లో సాయంత్రం అందరూ వెళ్ళిపోతే, వంటరిగా బెంగతో, భయంతో ఎక్కిళ్ళు పెడుతున్న అరువి. కనుచూపు మేరలో ఆత్రంగా సైకిలు తొక్కుకుంటూ తండ్రి ఆందోళనతో వచ్చేస్తూండగా చూసిన ఆ తడారని కళ్ళల్లో మధ్యాహ్నపు వెలుగు.

పది పన్నెండేళ్ళ పరువంలో భారంగా వెంటాడుతున్న జ్ఞాపకాలన్నిటినీ వదిలిపెడుతూ తండ్రితో ఊరు మారి నగరానికి పయనమౌతూ, కండ్ల వెంట నీళ్ళు జలజలా రాలిపోతూ ప్రయాణం. నాన్న ఓదారుస్తూనే ఉన్నాడు మొత్తం దారిపొడుగునా.

నగరంలో కాలనీలో ఆడుకుంటున్న పిల్లలతో కలవడానికి ఇబ్బంది పడుతూండగా పక్కనే నవ్వుకుంటూ నాన్న.

హైస్కూలుకొచ్చేసరికి హుషారుగా, నవ్వుతూ, తుళ్ళుతూ పద్నాలుగేళ్ళ కౌమార ప్రాయపు అరువి. లవ్ లెటర్ ఇచ్చిన క్లాస్ మేట్ కు గట్టి వార్నింగ్ ఇచ్చిన మొండిఘటం.

ఇంటరు చదువుతూన్న టీనేజీ పిల్ల, క్లాసులో క్రష్. డేర్ అండ్ డెవిల్,అరువి చేతిలో లవ్ లెటర్. ఎవరో ఇచ్చింది కాదు, తనే రాసి అశోక్ కు ఇచ్చింది. వాడెవర్నో అప్పటికే లవ్ చేస్తున్నాడని సమాధానం. దిగులుగా బెంగగా, క్లాస్ మేట్ తో ఏడ్చిన డేర్ అండ్ డెవిల్ ప్రో ఏక్టివ్ అరువి.

కాలేజీలో చేరి కొత్త స్నేహాలతో ఉక్కిరిబిక్కిరౌతూ, లోకంలో ఆనందమంతా తనలోనే నింపుకున్న అరువి. వసంతం వచ్చిన చిక్కటి చిట్టడివీ, పులకింతలో మైమరిచిన ప్రకృతీ అంతా తనలోనే లీనమైనట్లున్న త్రుళ్ళింతల అరువి.

క్లాస్మేట్ ఇచ్చిన పార్టీలో అందరూ తాగుతూనే ఉండగా తను మాత్రం నిబ్బరంగా, చెక్కు చెదరకుండా, ఏ ప్రలోభానికీ, అలవాటుకూ దూరంగా తనని తాను నిలబెట్టుకుంటూ, నిగ్రహ విగ్రహం అరువి. పదిగంటలైనా ఇంటికి రాని పిల్ల కోసం ఆందోళనలో తండ్రి, ఇంటికొచ్చిన కూతురి ధోరణికి అనుమానం వచ్చిన తండ్రి. సమాధానం చెప్పకుండా విసురుగా వెళ్ళిపోయిన పొంగే యువరక్తపు కోపంలో సొంత గౌరవం కోసం మౌనంగా యుద్ధం చేసిన అరువి.

ఒక రోజు స్కూటీపై వెళ్తూండగా చిన్న ప్రమాదం. దెబ్బలు. పక్కనే అమ్ముతూన్న కొబ్బరినీళ్ళు తాగి అప్పటికి తేరుకున్న స్నేహితురాళ్ళు. కొన్ని వారాలకు తల తిరుగుతూ, వాంతులౌతున్న కూతుర్ని చూసి నెత్తి బాదుకుంటూన్న తల్లి. ఏహ్యంతో, అసహనంతో తమ్ముడు. నీచంగా చూస్తూ అనరాని మాటల్ని విసిరేసిన తండ్రి. చిన్నప్పుడు తనకి నచ్చదని చెప్తే మానేసిన తండ్రి చేతిలో మళ్ళీ సిగరెట్టు కనిపిస్తే చూసి కన్నీరు మున్నీరైన అరువి. గుండెలవిసేలా ఏడుస్తూ, తమ్ముడినీ, తల్లినీ, తండ్రినీ ప్రాధేయపడుతూన్నా కరగని కుటుంబం. ఏమయ్యిందో మనకర్థమయ్యేలోగా కూతుర్ని బయటకి వెళ్ళిపోమని చెప్పిన తండ్రి. దిక్కు తోచని క్రాస్ రోడ్స్ మధ్యన స్నేహితురాలింటికి పయనం. తనది వంటరి తండ్రితో జీవితం. ఆ రాత్రి ముగ్గురూ మధుపానీయ సేవనం. కొన్ని రోజుల అలవాటులో మత్తులో మునిగిన అరువి ని ఆ పూట తమకంగా చూస్తున్న స్నేహితురాలి తండ్రి.

అక్కణ్ణుంచి బయటకొచ్చేసి ఒక టైలరింగ్ సంస్థ లో టైలరింగ్ నేర్చుకుంటూ ఆ కొద్ది జీతంతో పేయింగ్ హాస్టెల్ లో జీవితం. అక్కడే ఎమిలీ అనే ట్రాన్స్జెండర్ తో పరిచయం. అది కాస్తా గాఢ స్నేహంగా మారుతుంది. ఇద్దరి గతమూ ఒక్కటే. అయినవాళ్ళు వెలివేసిన గతం. ఒకరంటే ఒకరికి ప్రేమ, అనురాగం పెరుగుతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఒక రోజు తండ్రికి గుండె పోటు అనే వార్త తెలుస్తుంది. వలవలా ఏడుస్తూ,డబ్బులు సర్దడానికి యజమాని దగ్గర మొరపెట్టుకుంటే అనునయిస్తాడతను. యువకుడూ, ఉదారుడు కూడా.

చేతిలో లక్ష రూపాయలతో ఆసుపత్రికి వెళ్తే డబ్బుల్ని ముట్టకుండా నీచపు మాటలు పారేసిన టీనేజీ తమ్ముడు. తండ్రిని చూసేందుకూ కుదరదని చెప్పే సొంత తమ్ముడూ, చూడడానికి ఇష్టపడని తల్లి. ఎవరికీ ఏమీ కాకుండా పోయిన అరువి. చీలికలైన శరీరం, ముక్కలు చెక్కలైన హృదయం మాత్రమే మిగిలింది తనకంటూ. ఎమిలీ ఇక చేసేదేమీ లేక అరువిని బాధనుండి బయటకు తేవడానికి ఓదారుస్తూ చిన్నపాటి యాత్రకు తీసుకెళ్తుంది. గంజాయి, సిగరెట్లు అలవాటౌతూ ఉంటుంది. ఇది వద్దని గుళ్ళూ గోపురాలూ తిరుగుతూండగా ఆ దగ్గర్లోని ముప్పై అయిదూ నలభై మధ్యలో కనిపిస్తూన్న ఒక స్వామీజీ వీళ్ళని ఊరడిస్తాడు. కొన్ని రోజులు అక్కడ ఉండిపోతారు.

తరువాత అరువి తన స్నేహితు(డు)రాలు ఎమిలీతో బాటు ఒక టీ వీ స్టూడియోలో ప్రత్యక్షమౌతుంది. కొంత సేపు తర్జనభర్జనలు జరిగాక వీళ్ళ విషయాన్ని చేర్చేందుకు ఒప్పుకుంటాడు ప్రోగ్రాం డైరెక్టరు. వికృతంగా, కర్కశంగా, అక్కడుండే ప్రతీ మలినాన్నీ చూపుతారు. మనుషుల మాటలు, ఆ హిపోక్రసీ, అసభ్యమైన చేష్టలు, కుళ్ళిపోయిన మనస్తత్వాలు అన్నీ. ఒక్కడే మంచోడు. పీటర్ అని అసిస్టెంట్ డైరెక్టరు. ఆయా కుటుంబాలని రచ్చకీడ్చి తీర్పులు చెప్తూ వికృతమైన రోత పుట్టించే కార్యక్రమాల్లో ఒకటి. సానుభూతి,సంయమనం లేని నటి, మధ్యలో ప్రతీ అవకాశాన్ని వాడుకోవాలని చూసే ప్రోగ్రాం డైరెక్టరు. సెక్యూరిటీ నుంచి కేమెరామెన్ దాకా పేరుకుపోయిన దమ్ములగొండ్లు. ప్రైవేట్ ప్రోగ్రాము. అడిగే దిక్కూ లేదు. ఎవరి స్వలాభం వారిది. పేరుకి సమాజాన్ని, మనుషులనీ ఉద్ధరించే మాటలు.

అప్పుడే మనకీ తెలుస్తుంది, అరువి అక్కడెందుకొచ్చిందో. తనని చెరిపిన ఒక ముగ్గురు మనుషుల్ని ఈ కార్యక్రమంలోకి పిలిచి వారి చేత క్షమాపణలు చెప్పించాక అసలు సంగతి చెప్తా అంటుంది. మనకీ విషయం అర్థమవుతుంది, ఎవరెవరు అని.

వ్యాఖ్యాత తన నాటకం అంతా అయ్యాక ఈ అమ్మాయిని పిలిచి సంఘటన చెప్పమని అడిగి మిగతా ముగ్గురినీ కేమెరా ముందుకు రప్పిస్తుంది. ముగ్గురూ ఇక జీవించడం మొదలు పెడతారు. ఒకడు తండ్రి లాగా నిలబడి కాపాడినానంటే, ఇంకోడు దిక్కులేని దానికి డబ్బులిచ్చిమరీ తన తండ్రి ప్రాణం నిలవడానికి సహాయం చేశానంటాడు. స్వామీజీ మాటలు ఇక సరేసరి.. తామెంతటి ఉత్తములో వాదిస్తారు. ఒకడైతే కొట్టబోతాడు. సింపతీ మొత్తం అటూ ఇటూ తిరుగుతూంటుంది. ఇక కార్యక్రమం వేడెక్కిన స్థితిలో విషయం చెప్పేస్తుంది అరువి. తనకి రెండేళ్ళుగా హెచ్ ఐ వి పాజిటివ్. కొబ్బరికాయలు కొడుతున్న మనిషి ( అతనికి హెచ్ ఐ వీ ఉండి ఉంటుందని అనిపించేలా చూపుతారు) చేతి రక్తపు మరకలున్న కొబ్బరికాయను తాగినప్పుడు, యాక్సిడెంటులో నోటికైన గాయం మూలంగా వైరస్ లోపలికొచ్చిందని తెలుసుకుంటుంది. దానివల్లే నిరోధక శక్తి తగ్గి వాంతులు, జ్వరం, ఇంకా ఇంట్లో అనుమానాలు, పర్యవసానంగా రోడ్డున పడిన అరువి. ఈ మధ్యలోనే ఈ ముగ్గురూ తనని వాడుకున్నారు. ఇది చెప్పి వారిచేత క్షమాపణ చెప్పించి, వ్యాధి గనుక సోకి ఉంటే తొలిదశలోనే ఉండే అవకాశం ఉంది కనుక వారి జీవితకాలం పొడిగించుకునేందుకు సహాయపడడానికే ఇక్కడికి వారిని రప్పించానంటుంది. తనకి ఈ సంగతి ముందే తెలుసు. తల్లిదండ్రులకి చెప్పలేదు. ఇంకెవరికి చెప్పాలి. స్నేహితురాలికి తెలిసేముందే తన తండ్రి ఈ అమ్మాయిని అడ్వాంటేజ్ తీసుకున్నాడు, అదీ మత్తులో ఉండగా.తక్కిన ఇద్దరూ కూడా అవకాశాన్ని వాడుకుంటూండగా తనూ చెప్పలేదు. నిజమే చెప్పుంటే డబ్బులిచ్చేవాడా, ఉద్యోగం ఇచ్చేవాడా అని వాదిస్తుంది. స్వామీజీ సంగతి ఇక చెప్పనక్కరలేడు. అలాంటివాడికి జరగాల్సిందే ఇది అని చెప్తుంది.

ఇక మొత్తం తలకిందులౌతుంది. వ్యాఖ్యాత ఇక అరువిని తిట్టడం మొదలుపెడుతుంది. ప్రాణం విలువ తెలుసా. నీకంటూ ఎవరైనా ఉంటే తెలిసేది.నీలాంటిదానికి మనుషుల ప్రాణాలతో ఆడుకోవడం అనే సైకో వ్యక్తిత్వం ఉండడం మామూలే అని మాటలు పారేస్తూ ఉండగా విషయం తెలిసిన ముగ్గురూ ప్రాణాలు పోయినంత పనైపోయి అరువిని దాదాపు చంపేందుకు మీద పడుతూ ఉండగా టీ వీ ప్రోగ్రాము సిబ్బంది మధ్యలో కలుగజేసుకుని టెస్టులు చేయించేందుకు విరామం ప్రకటిస్తారు. అంతవరకూ ఒక విధంగా చూసిన ప్రోగ్రాం డైరెక్టరు తల వంచుకుని ఉంటాడు. పీటర్ తనని ఆరాధనగా, అబ్బురంగా గమనిస్తూ ఉంటాడు. వైద్య సిబ్బంది వచ్చి టెస్టులు చేసి నెగటివ్ అని ప్రకటిస్తారు. ముగ్గురికీ హెచ్ ఐ వీ సోకలేదు. కానీ ఆ విషయాన్ని దాచి, ప్రోగ్రాముని ఇంకా సెన్సేషన్ చెయ్యాలని కార్యక్రమం కొనసాగిస్తాడు డైరెక్టరు. ఇక మొదలౌతుంది, వ్యాఖ్యాత గారి ప్రతాపం, జీవితమంటే ఏమిటో ఉపన్యాసం ఇస్తూ. ఇక సహించలేని అరువి ఆ రెండు మూడు నిమిషాల్లో చెప్పే డైలాగులు, ఆ మాటల్లో ఇంటెన్సిటీ, వాడే పదజాలం, ఒక్కొక్క భ్రమనే ఒక్కటొక్కటిగా తుంచేస్తూ, హిపోక్రసీలని మాటల్లో కాల్చివేస్తూ, మన బ్రతుకుల్లోని శూన్యాన్ని నింపేందుకు మనం చేస్తున్న పనుల్నీ, పక్కనున్న మనిషితో పోల్చుకుంటూ మనం పడుతున్న అపసోపాల్ని, ఉన్నతంగా కనబడాలని లేనోణ్ణి తొక్కేస్తూ, దాటేస్తూ, ముందుకెళ్తున్నామనే భ్రమలో లోలోపల కృంగిపోతూ, వినియోగదారీ ప్రపంచంలో కొనుగోలుదారులైపోయి ఎప్పుడూ సంతృప్తి అనేది ఏమిటో తెలీకుండా,పాతాళానికి జారిపోతూ బ్రతుకుల్ని అతుకులబొంతగా, మెటీరియలిస్టిక్ జీవితాలని లాగుతున్న మనందరినీ ఎండగడుతూ ఆ నటన, ఆ మాటల్ని పలికే తీరు, ఆ చూపుల్లో వాడి వేడి – మనకు మహా మహా నటులందరూ గుర్తుకొస్తారు. కొన్ని సినిమా కుక్కమూతిపిందెలని వెంటనే తలుచుకుంటారు కూడా. మనకు తెలిసిన ప్రతీ సినిమాలోని గొప్ప గొప్ప నటులు పలికి, జనాలని ఉర్రూతలూగించిన గొప్ప లెంగ్తీ డైలాగులన్నీ ఈ ఒక్క సన్నివేశం ముందు చిన్నబోవడం తథ్యం. No exaggeration at all, trust me.

కార్యక్రమం ఇంకా వేడెక్కి ఆ మొత్తం ఇంటెన్సిటీని వాడుకుంటూన్న డైరెక్టరు ఆలోచనని పసిగట్టి, తక్కిన ముగ్గురూ కూడా పశ్చాత్తాప పడకుండా ఇంకా తననే నిందించడం కొనసాగించడాన్ని చూసిన అరువి, తన బేగులోని రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి తన తాత గారి జ్ఞాపకంగా ఇన్నాళ్ళూ దాచుకున్న రివాల్వర్ ని తీసి డైరెక్టర్ ని కాల్చేస్తుంది. తుపాకీ గుండు భుజానికి తాకి వాడు కిందపడిపోతే ఇక తక్కిన వారంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఒక మూల చేరుతారు. శబ్ధాలు వినిపించిన బయటివారు పోలీసులకి ఫోన్ చేస్తే అక్కడికి పెద్ద సంఖ్యలో పోలీసులూ, మీడియా చేరుతారు. ఇరవై మంది దాకా ఇక్కడ బందీలుగా ఉన్న వారిని త్వరలోనే వదిలేస్తామని తీవ్రవాదుల్లాగా బెదిరించి అక్కడ స్టూడియోలో వీళ్ళందరితో తన సరదా తీరే దాకా ఒక్కొక్కరి చేత వినోదం పండిస్తూ ఒక ఆట ఆడుకుంటుంది. చాలక వీళ్ళందరికోసం బయటినుంచి పోలీసుల చేతనే మందులూ మాకులూ, బిర్యానీలు, భోజనాలూ తెప్పించి పెడుతుంది. నిజానికి అప్పటికే వాళ్ళందరినీ క్షమించేసి ఉంటుంది . ఇక చాలన్నట్లు ఎమిలీ తో కలిసి బయటకొచ్చి పోలీసులకి లొంగిపోతుంది.

ఇంటరాగేషన్ సన్నివేశంలోకి మళ్ళీ వస్తాం మనం. అందరూ వచ్చి చెప్పే సాక్ష్యాలు అన్నీ అరువి కి అనుకూలంగానే ఉంటాయి. కేసు నిలబడదు ఎందుకంటే తను హెచ్ ఐ వీ వ్యాధిగ్రస్థురాలు. కేర్ హోం లోనే ఉంచాలి. అక్కడికి తరలిస్తారు అరువిని. తనని ఇంటరాగేట్ చేసి హింసించిన పోలీసాఫీసరు కూడా తనకో కార్డు పంపిస్తాడు, డోంట్ క్విట్ అంటూ. రోగంతో తీసుకుంటూ నరకయాతనలు పడుతూ అక్కడా ఉండలేక తన దారి వెతుక్కుంటూ, ఎక్కడో దూరంగా కొండల్లో ఒక గుడిసెను సంపాదించి అక్కడే వంటరిగా చనిపోవడానికి నిశ్చయించుకుంటుంది. కొన్ని రోజులకి చిక్కి శల్యమైపోయి చావుకి దగ్గరగా వచ్చేసిన అరువి ఒక వీడియో ని పోస్ట్ చేస్తుంది, అందర్నీ చూడాలనుందని. అసిస్టెంట్ డైరెక్టరు పీటర్ అందరినీ కూడగట్టి, అరువి తల్లిదండ్రులనీ, తమ్ముణ్ణీ వెంటబెట్టుకుని అక్కడకి చేరుతాడు. ఆ రాత్రి వంటలూ వేడుకలూ చేసుకుని అందరూ నవ్వుల్తో మునిగి తేలుతూండగా ….

తర్వాత కథేంటో తెలుసుకోకపోయినా పరవాలేదు.

సినిమా మొదలైన కొద్దిసేపటికే గతంలోకి మనల్ని తీసుకెళ్ళే సంధర్భంలో నవ్వుమొహం బుజ్జిపాపని చూడగానే నిర్వచించలేని దిగులేదో మనల్ని చుట్టుముడుతుంది. విలవిలా ఏడుస్తున్న అరువిని చీదరించుకునే తండ్రిని చూసిన మనకి అంతులేని బరువేదో గుండెల్ని మెలిపెడుతూ ఉంటుంది. మూడుసార్లూ మనకి చూచాయగా విషయం అర్థమై సెలయేటి ( అరువి అనగా సెలయేరు, వాగు, సన్నటి జలపాతం ) కన్నీళ్ళలో తడిసి ముద్దౌతాం. చివర్లో శరీరం శుష్కమైపోయి ఎముకలగూడుగా మారిన అరువిలో మనలో ఒక సగం చచ్చిపోతున్నంత బాధనీ, వేదననీ అనుభవిస్తాం.

తప్పూ చేయని సెలయేరు, ఎండాకాలానికి నీటిచెలమగా మారి చివరికి ఎండిపోయిన ఆనవాళ్ళని చూస్తే మనకేమనిపిస్తుంది? దిగులుకి మాటలు దొరకవు. తిరిగి వానొచ్చి, వరదొచ్చినా అక్కడ మనకు తెలిసిన అరువి ఇక తిరిగి రాదు అనే కదా?

పూర్తి నిడివిలో నాయికా పాత్రలో నటించిన అదితి బాలన్ కి ఇది రెండో సినిమా. దర్శకుడు అరుణ్ ప్రభు పురుషోత్తమన్ కి ఇదే దర్శకుడిగా తొలిచిత్రం. ఎప్పుడో జూన్ 2016 లోనే షాంఘై లో ప్రదర్శింపబడినా, పూర్తి విడుదలకి ఇంకా ఒకటిన్నర సంవత్సరం (December 2017) ఆగాల్సి వచ్చింది. కోటి రూపాయల ఖర్చుతో తీసి ముప్పై అయిదు కోట్ల దాకా వసూళ్ళు రాబట్టిన న్యూ ఏజ్ తమిళ సినిమా. తొంబై శాతం నటీనటులంతా కొత్తవారే. సినిమా విడుదలయ్యాక థియేటర్ నుంచి బయటికొస్తున్న ప్రేక్షకులని ఇంటర్వ్యూ చేస్తూన్న వీడియో ఒకటి చూస్తూండగా, బయటికొస్తున్న ఒకమ్మాయి అన్నదినాకో కూతురు పుడితే దానికి అరువి అనే పేరు పెడతా.”

తమిళ సినిమా తీరే వేరని సినిమా మళ్ళీ నిరూపించింది.సినిమా తీసే వాళ్ళ సంగతి మాత్రమే కాదు, సినిమా చూసే వాళ్ళ సంగతి కూడా !

 

Reviews

There are no reviews yet.

Be the first to review “Aruvi”

Your email address will not be published. Required fields are marked *