తెలంగాణ ఉద్యమ శిఖరం సురవరం

నిలువెత్తు సంతకం గోలకొండ
మన అస్తిత్వాన్ని ప్రపంచానికి చాటిన మనీషి
చైతన్య దీపికలను వెలిగించిన ధీరుడు
తెలంగాణ సాహిత్య వైభవానికి ప్రాణ ప్రతిష్ఠ చేసిన మహానుభావుడు
సురవరం ప్రతాపరెడ్డి.. ఈ పేరు వింటేనే చాలు తెలంగాణ అస్తిత్వపు ఆత్మీయ స్పర్శ తగులుతుంది. తెలంగాణ సాంస్కృతిక తేజస్సు కళ్లెదుట ఉట్టిపడుతుంది. నిర్బంధాల నిజాం రాజ్యంలో నిరాటంకంగా గోలకొండ పత్రికను నడిపించిన ధీరోధాత్తుడు. సాహిత్యం, భాష పరిరక్షణలకోసం నిరంతరం తపించిన వాడు. ఆయన నేతృత్వంలో గోలకొండ పత్రిక తానే తెలంగాణమై శిఖరప్రాయంగా వెలుగొందింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలం ఇటిక్యాలపాడులో జన్మించిన సురవరం ప్రతాపరెడ్డి కవిపండితుడు.. పత్రికారచయిత..స్వాతంత్య్ర ఉద్యమకారుడు.
కవిగా, పండితుడిగా…
సురవరం ప్రతాపరెడ్డి కవిగా అనేక గ్రంథాలను రచించారు. హంవీర సంభవం లాంటి ఖండకావ్యాలు, గ్రామీణ భాషలో రచించిన దండకాలు ఆయన కవితాశక్తికి నిదర్శనాలు. చారిత్రాత్మకమైన ఇతివృత్తంతో ఉచ్ఛల విషాదం, వ్యవహారిక భాషలో ప్రదర్శనకు యోగ్యంగా భక్త తుకారం నాటకాలను రచించారు. ప్రతాపరెడ్డి రచించిన అనేక కథల పుస్తకాలు ఆయన సామాజిక దృష్టికి దర్పణం పడతాయి. వింత విడాకులు నిజాం ప్రభువు పాలనలో తెలంగాణ సాంఘీక జీవనాన్ని ప్రతిఫలింపజేస్తుంది. ఆయన రాసిన నిరీక్షణ కథ అనేక ఇతర భాషల్లోకి అనువాదం జరిగింది. మరో రెండు సంపుటాలుగా మొగలాయి కథలను వెలువరించారు. హైందవ ధర్మవీరులు రచన నాటి విద్యార్థుల మనస్సుల్లో దేశ భక్తిని రగిలించింది. హిందువుల పండుగలు, రామాయణ విశేషాలు, ఆంధ్రుల సాంఘిక చరిత్ర వంటివి ఆయనలోని పరిశోధకుడిని వెలుగులోకి తెచ్చాయి. వాల్మీకి రామాయణాన్ని నిశితంగా పరిశీలించి రామాయణ విశేషాలు అనే గ్రంథాన్ని రచించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తొలిసారిగా కేంద్ర సాహిత్య అకాడమీ ద్వారా అవార్డు అందుకున్న ఆంధ్రుల సాహిత్య చరిత్రకు సరితూగగల గ్రంథం ఆరు దశాబ్దాలు గడిచినా వెలువడలేదు. ఈ గ్రంథం ఆయనకు సాంస్కృతిక వైతాళికుడిగా చిరస్థాయి కీర్తిని తెచ్చిపెట్టింది.
చైతన్య దీపిక గోలకొండ పత్రిక..
సురవరం ప్రతాపరెడ్డి కొందరు ప్రముఖుల ఆర్థిక సాయంతో 1926 మే 19న గోలకొండ పత్రికను ప్రారంభించారు. హైదరాబాద్లోని ట్రూప్ బజార్లో ఓ చిన్న పెంకుటింటిలో ఏర్పాటైన గోలకొండ పత్రిక కార్యాలయం అతిసాధారణ రీతిలో కొనసాగింది. ఈ కార్యాలయంలో నిత్యం కవులు, రచయితలు చేరి ఉత్తేజకరమైన చర్చలు కొనసాగించేవారు. ఆధునికమైన ఉదాత్త భావాలు, ఆలోచనలు, జాతిని తట్టిలేపే ప్రబోధ కార్యక్రమాల ప్రణాళికలు ఇక్కడ చర్చాగోష్ఠుల్లో ప్రతిధ్వనించేవి. తెలంగాణ ప్రజానీకాన్ని జాగృత పరచడంలో గోలకొండ పత్రిక అద్భుత పాత్ర పోషించింది. సురవరం వ్యాసాలు, పద్యాలు, విమర్శలు, సంపాదకీయాలు దాదాపు వెయ్యి వరకు ఉండగా, మారుపేరుతోనూ కోకొల్లలుగా కథానికలు, కవితలు రాశారు. చిత్రగుప్త, భావకవి, రామ్మూర్తి, యుగపతిసింహ, సంగ్రామసింహ మొదలైన ఎన్నో మారుపేర్లతో ఆయన అసంఖ్యాక రచనలు చేశారు. ఆనాటి నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమానికి చేదోడుగా నిల్చిన గోలకొండ పత్రిక తెలంగాణాలోని ఓ చిన్న ఇంట్లోని ఓ చిరుదీపంలా సురవరం నిర్వహణలో దినదిన ప్రవర్థమానమై విశాలాంధ్రనే వెలిగించే ఆఖండ జ్యోతిగా చరిత్రలో నిలిచింది. గోలకొండ పత్రిక సంపాదకీయాలు అద్భుతం. అది నిజాం ప్రభుత్వ గుండెలో కుంపటి. అది పత్రిక మాత్రమే కాదు. మహాసంస్థ. గాఢాంధకారంలో ఉన్న కాంతిరేఖ గోలకొండ అని మహాకవి దాశరథి తన యాత్రాస్మృతిలో పేర్కొన్నారు.
గోలకొండ కవుల సంచిక
నిజామాంధ్రమున తెలుగుకవులు పూజ్యము అంటూ బ్రిటిష్ ఆంధ్రకు చెందిన ముండుబై వేంకట రాఘవాచార్యులు చేసిన ఓ కువిమర్శ తెలంగాణ ఆత్మగౌరవానికి తీవ్ర విఘాతం కలిగించింది. ఈ వ్యాఖ్యపై సురవరం వారు తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. తెలంగాణలో ఉన్న సాహిత్య చేతనను ప్రపంచానికి చాటిచెప్పాలని నిర్ణయించారు. ఆయన తీసుకొన్న నిర్ణయంతో తెలంగాణలోని 354మంది కవులతో గోలకొండ కవుల సంచిక 1935లో వెలువడింది. ఇందులో 183మంది పూర్వ కవుల కవితలను కూడా పొందుపరిచి బ్రిటిష్ ఆంధ్ర సాహిత్యకారుల అహంభావానికి దీటైన సమాధానం చెప్పారు. తెలంగాణ కవుల ఆత్మగౌరవానికి ఇది ప్రతీక. పరిశోధకులకు కరదీపిక.
ప్రపంచ భాషకులకు ఏకలిపిని సూచిస్తూ జార్జి బెర్నార్డ్షాతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపిన మహావిద్వాంసుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆంధ్ర సారస్వత పరిషత్, మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాల, రెడ్డి వసతి గృహం తదితర వాటికి ఆయన అందించిన సేవలు అమూల్యం.
తొలి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడిగా..
1930 మార్చి 3న మొదటి నిజాంరాష్ట్ర ఆంధ్ర మహాసభ జోగిపేటలో జరిగింది. ఈ తొలి మహాసభకు సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రతినిధులు, స్వచ్ఛంద సేవకులు, అశేష జనవాహిని ఓ ప్రవాహంలా కదలివచ్చిన ఈ సభలో తెలుగు తేజం ఉట్టిపడినంతగా నిలిచింది. ఆంధ్ర సారస్వత పరిషత్తును స్థాపించడంలో, ముందుకు నడిపించడంలో సురవరం వారు ప్రధాన భూమిక నిర్వహించారు. 1944లో వరంగల్లో జరిగిన నిజాం రాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు సభలు కూడా సురవరం అధ్యక్షతన కొనసాగాయి. సారస్వత పరిషత్తుకు రెండేండ్లపాటు ఆయన అధ్యక్షుడిగా కొనసా గారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “తెలంగాణ ఉద్యమ శిఖరం సురవరం”

Your email address will not be published. Required fields are marked *