సుప్రసన్న దీప వృక్షం

Category:

1953లొనే, మాఅయ్యగారు పుట్టపర్తి వారికీ, తెలంగాణా రచయితల సంఘం, జనగామ శాఖకూ అవినాభావ బంధం యేర్పడి వుండటం వల్లా, 2003 లో (అంటే సరిగ్గా, యాభై యేళ్ళ తరువాత) నేను రోజూ ప్రయాణించే తెలంగాణా ఎక్స్ ప్రెస్ జనగామ మీదుగానే ప్రయాణించటం వల్లా, వరంగల్ ఆకాశవాణి కేంద్రానికి నా రోజూవారీ ప్రయాణం కూడా యేదో అవ్యక్తానుబంధం తోనే కొనసాగేది. 1953 లో జనగామలో జరిగిన ఆంధ్ర సారస్వత పరిషత్ వార్షికోత్సవాలలో అయ్య తెనాలి రామకృష్ణుని గురించి ఇచ్చిన అద్భుత ప్రసంగ పాఠం, 1953 సెప్టెంబర్ లో ‘తెలుగు తీరులు’ పేరుతో ప్రచురింపబడి, బహుజనాదరణ పొందింది. పుస్తకం చిన్నదే ఐనా, అందులోని అయ్య వ్యాసం, అద్భుతం. ఆ గ్రంధం ప్రచురణ నాటికి నేను ఒక నెల పిల్లను మాత్రమే ! ఇటీవల ‘పుట్టపర్తి సాహిత్య సర్వస్వ ముద్రణ’ సమయంలో యీ గ్రంధం మళ్ళీ పఠిస్తుంటే, నాలో అనిర్వచనీయమైన ప్రకంపనలు ! అయ్య తరచూ అనే వారు, ‘తెలంగాణా ప్రాంత భావజాలమూ, రాయలసిమ ప్రజల భావనలలో సామ్యం చాలా కనిపిస్తుందని ! నైసర్గిక స్వరూప సామ్యతా, నవాబుల పాలనలో నలిగిన నిస్సహయతా- రెండిటికీ సమానం. కరువు కాటకాదులతో దొస్తీ ఉండనే ఉంది కదా ! ఈ నేపధ్యంలో, వరంగల్ లోనూ, నేనప్పుడు ఉద్యోగ ధర్మం మీద పర్యటించిన చుట్టుపక్కల ప్రాంతాలలోనూ, నాకొకే సౌమనస్యత అనుభవంలోకి వచ్చింది.

కోవెలవారితో నా ప్రత్యక్ష పరిచయం, నాకు ఆకాశవాణి వరంగల్ కేంద్రంలోనే ! వారి పేరూ, కొన్ని గ్రంధాలూ అంతకు ముందే చదివి ఉండటం వల్ల, వారి సాహితీ మూర్తిమత్వాన్ని మరింత దగ్గరగా చూసి, మరి కాస్త అర్థం చేసుకునే అదృష్టం అలా నాకు లభించింది. అయ్య గారి ‘శివతాండవం’ గురించి కాకతీయ విశ్వవిద్యాలయంలో ’80 లలోనే పరిశోధన చేసిన డా. వజ్ఝల రంగాచార్యులవారి పథ నిర్దేశకులు సుప్రసన్నగారే! అయ్యతో ప్రత్యక్షంగా మాట్లాడేందుకు రంగాచార్య గారు రెండు మూడు సార్లు కడపకు వస్తుండిన రోజులవి. అప్పటికి నాకింకా పెళ్ళికాలేదు. అక్కడే వారికి కావలసిన అయ్య పుస్తకాలో లేదా మరేదైనా సామగ్రినో అందజేయటంలో మహదానందంగా తోడ్పడేదాన్ని కూడా! అందుకే సుప్రసన్న గారి పేరూ, వారి కొన్ని రచనలతో అప్పుడే కొంత పరిచయమేర్పడినా, ఆకాశవాణి వరంగల్ కెంద్రానికి తరచూ వారు రికార్డింగ్ ల కోసం వచ్చినప్పుడంతా, పుట్టపర్తి తనయగా, వారి ఆప్యాయతనూ, ఆదరణనూ చూరగొనే అవకాశం కూడ నాకు లభించింది.

‘సహృదయ చక్రము’ అన్న వారి వ్యాస సంకలనం, ’80 లలో చాలాసార్లే చదివాను. భిన్న భిన్న వ్యాసాల చక్కటి సమాహారమది. వాటిలో సుప్రసన్న గారు వెలువరించిన అభిప్రాయాలు నన్నెంతో ఆకట్టుకున్నాయి. శ్రవ్యకావ్యేతి వృత్తము, మహాకావ్యము-ప్రబంధము, గరుడోపాఖ్యానము-మహభారతము, విశ్వనాధ హరిహర నాధ తత్వము, తెలుగుతోట, ఆధునికత, తెలుగు నవల ఇత్యాది వ్యాసాలలో, వారు ఆయా విషయాలను తమదైన రితిలో విశ్లేషించిన తీరు అమోఘం. రామరాజ భూషణుని రామాయణ తారావళి లో రామాయణాన్నంతా ఇరవై యేడు పద్యాలలో పొదిగిన వైనాన్ని విశ్లేషిస్తూ, ‘ కవి ప్రతిభలోన నుండును, కావ్యగత శతాంశముల యందు తొంబదియైదవ పాళ్ళు ‘ (ఆంధ్రప్రభ యేప్రిల్ 1965లో ప్రచురితమైన వ్యాసమిది) అని వారు అప్పుడే నిర్ధారించేశారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “సుప్రసన్న దీప వృక్షం”

Your email address will not be published. Required fields are marked *