ధీరులకు మొగసాల రావెళ్ల

గన్ను పట్టిన చేతితోనే.. పెన్ను
నిజాం సైన్యంపై తుపాకీ ఎక్కుపెట్టిన వీరుడు
స్వతంత్ర రాష్ట్రంలో కలంపట్టిన యోధుడు
తెలంగాణలో చైతన్యస్ఫూర్తిని రగిలించిన మహాకవి
కదనాన శత్రువుల కుత్తుకల నవలీల..నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి, వీరులకు కాణాచిరా..తెలగాణ ధీరులకు మొగసాలరా.. ఈ పాట వింటుంటే రోమాలు నిక్కబొడుచుకోని తెలంగాణ బిడ్డడు ఉండడు.. అరాచక పాలక వ్యవస్థపై ఉద్యమించిన వీరుల్లో రక్తాన్ని ఉరకలెత్తించిన గేయమిది. అరవై ఏండ్ల క్రితం నిజాం సైన్యానికి వ్యతిరేకంగా గన్ను పట్టిన యోధుడు.. ఆ తర్వాత పెన్ను పట్టి పదునైన అక్షరాలతో తూణీరాలను వదిలి తెలంగాణ సమాజానికి చైతన్యపుటంచులకు వెళ్లే దారిని చూపించాడు. తెలంగాణ గేయరచయితల్లో ఇంత చైతన్య స్రవంతిని ప్రవహింపజేసిన కవులు అత్యంత అరుదనే చెప్పాలి. ఆయన రావెళ్ల వెంకటరామారావు. తెలంగాణ గేయ సాహిత్యాన్ని తనదైన రీతిలో కొత్త బాటను పట్టించినవాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామానికి చెందిన రావెళ్ల చిన్నప్పుడు వ్యవసాయ కూలీగా పనిచేసి.. రజాకార్ల ఆగడాలకు స్వయంగా ప్రభావితమైనవాడు. కలుపు మొక్కల ఏరివేతతో చేనుకు బలం.. రజాకార్ల ఏరివేతతో మనకు బలం అంటూ చిన్న వయసులో పొలంలోనే నినదించిన ధీరుడు. నాడు నిజాంకాలంలో ఉన్న తెలుగు చదువుకొనే పరిస్థితులు లేక.. ఉర్దూలోనే మాట్లాడాల్సిన దశలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ తరువాత తన బంధువులున్న ఆంధ్ర ప్రాంతంలోని సత్తెనపల్లి తాలూకాకు వెళ్లి కొంతకాలం చదువుకొని స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. ఆ తరువాత రజాకార్ల అకృత్యాలు పెచ్చుమీరిపోవడంతో రైతాంగ సాయుధపోరాటం ఉద్ధృతంగా మొదలైంది. మరోపక్క ఆంధ్రమహాసభ ఆధ్వర్యంలో నిజాం వ్యతిరేక పోరాటమూ మొదలైంది. గోకినేపల్లి కేంద్రంగా సాయుధపోరాటానికి నాంది పలికిన రావెళ్ల దాదాపు వందకుపైగా దళాలను ఏర్పాటు చేసి సాయుధ పోరాటంలో తీవ్రంగా పోరాడాడు. కమాండర్ స్థాయికి ఎదిగి నిజాం మూకలను ఒక్కడై చెండాడాడు. అటు ఆంధ్ర మహాసభలోనూ సభ్యుడిగా చేరి వారు చేస్తున్న పోరాటానికీ బాసటై నిలిచాడు. నిజాం సైనికులు పట్టుకొని జైల్లో పడేసినా.. వెరవని విప్లవకారుడు రావెళ్ల. రజాకార్ మూకలు.. నిజాం సైన్యం ఎన్ని సార్లు బంధించినా.. ఎన్ని జైళ్లలో మార్చి మార్చి బంధించినా తన లక్ష్యాన్ని ఎన్నడూ విడనాడలేదు. తాను నమ్మిన సిద్ధాంతం నుంచి పక్కకు తప్పుకోలేదు. ఒక కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టులో రావెళ్లను హాజరుపరిచినప్పుడు న్యాయవాదుల అబద్ధాలను తీవ్రస్థాయిలో రావెళ్ల వ్యతిరేకించారు. జడ్జి వెనుకనున్న గాంధీజీ చిత్రపటాన్ని వెనక్కి తిప్పి, ఆ తరువాత ఈ అబద్ధాల విచారణ కొనసాగించాలని హూంకరించడంతో యే తెలంగాణ షేర్హై అని ఆయన్ను ప్రశంసించని సుప్రీం కోర్టు న్యాయవాదులు ప్రశంసించారు. రజాకార్ల దురాగతాల సమయంలో ఆంధ్రలోని తన బంధువుల ఇండ్లకు వెళ్లిన రావెళ్ల వెంకటరామారావుకు ప్రత్యక్షంగా కలిగిన చేదు అనుభవాలు అన్నీ ఇన్నీ కావు. వారి ఫిలాసఫీ ఒక్కటే.. మా ఇంటికొస్తే ఏం తెస్తావ్..మీ ఇంటికొస్తే ఏమిస్తావ్ అనే రకం. అందుకే వారి వ్యవహార శైలి నాకు నచ్చేది కాదు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను అవహేళన చేస్తే నరనరాన పౌరుషం పొడుచుకొచ్చేది. అందుకే సాహిత్య బాట పట్టాను. పాట రాశాను. అని రావెళ్ల తన భావోద్వేగ గీత రచన గురించి అన్న మాటలివి. 1944లో రాసిన ఈ గేయం మొదట విశాలాంధ్ర పత్రికలో అచ్చయింది. ఆ తరువాత.. జీవనరాగం, పల్లెభారతి, తాండవహేళ వంటి అనేక రచనలు వచ్చాయి. అవార్డులు, పురస్కారాలు అనేకంగా ఆయన్ను అలంకరించాయి. రెండు దశల తెలంగాణ ఉద్యమాలకు ఆయన పాట ప్రాణం పోసింది. లక్షల మంది ప్రజలను పోరాట బాట పట్టించింది. రావెళ్ల వెంకటరామారావు తెలంగాణకు చిరస్మరణీయుడు.. ఆయన పాట నిత్యస్మరణీయమైంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “ధీరులకు మొగసాల రావెళ్ల”

Your email address will not be published. Required fields are marked *