పిల్లలే దానికి ఆహారం
కోవెల సంతోష్ కుమార్

మీ చిన్నారి వయసు మీకు తెలుసా..? అదేంటి పిల్లల వయసు తెలియని తల్లిదండ్రులెక్కడైనా ఉంటారా..? ఇదేగా మీ ప్రశ్న. కానీ…నేనడుగుతున్నది పుట్టిన తేదీ నుంచి లెక్కేసి చెప్పే శారీరక వయసు గురించి కాదు. మా ప్రశ్న మీ చిన్నారి మానసిక వయసు గురించి. అసలు మీకు తెలుసా? మీ పిల్లలకు రెండో వయసంటూ ఉంటుందని.. అదే సైకలాజికల్ ఏజ్…మామూలు వయసు కంటే రెట్టింపు వేగంతో అది పెరిగిపోతోంది.. మీకు అర్థం కావటంలేదు..కానీ, అది మీ పిల్లల్ని నిలువునా ముంచేస్తోంది.. వాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతోంది..
ప్రాణం తీయదు..
ప్రాణాంతకం కాదు..
కానీ.. అంతపనీ చేస్తుంది
పిల్లల్ని జీవచ్ఛవాల్లా మార్చేస్తుంది
ఎలాంటి లక్షణాలు ఉండవు
పైకి కనిపించదు
అంతు పట్టదు
అర్థం కాదు
చికిత్సకు చిక్కదు
వైద్యుల అవగాహనకు అతీతమైంది
ఒక విచిత్రమైన జబ్బు
మీ పిల్లల్ని వెంటాడుతోంది
వేధిస్తోంది
వాళ్ల జీవితాలతో చెలగాటమాడుతోంది
దాన్ని మీరు గుర్తించటం లేదు
గుర్తించేసరికి అనర్థం జరుగుతుంది
పిల్లల్ని మీకు కాకుండా చేస్తుంది
ఎవరితోనూ మాట్లాడరు
నలుగురితో కలవరు
ఎవరితోనూ మాట్లాడరు
తమలో తామే ఒదిగి ఉంటారు
ఇది తడిగుడ్డతో గొంతు కోసే భూతం
పిల్లలే దానికి ఆహారం
ఆటిజం…పిల్లల పాలిటి కొరివి దెయ్యం

పిల్లలు అల్లరి చేస్తారు.. మారాం చేస్తారు.. తోటి పిల్లలతో గొడవపడతారు… అడిగినవి ఇవ్వకుంటే చేతిలో ఉన్నవి విసిరకొడతారు… అలుగుతారు… అన్నం తినడం మానేస్తారు… విలువైనవి పగలకొడతారు… చదువుకోరు, హోంవర్క్ చేయరు… బదులుగా ఆటలాడటానికి వెళతారు… ఆ ఆటల్లో దెబ్బలు తగిలించుకుంటారు. వద్దన్న పనే చేస్తామంటారు… చేయమన్న పని చేయకుండా విసిగిస్తుంటారు… అందుకే మమకారానికి మరోరూపమైన కన్న తల్లి కూడా అప్పుడప్పుడూ విసుక్కుంటుంది. మురిపాలు పంచే తండ్రి సైతం చెయ్యేత్తే పరిస్థితి కల్పిస్తారు.
మరి ఇలా కాకుండా మీబాబో… మీ పాప… బుద్ధిగా తనపనేదో తను చూసుకుంటే
ఇంట్లోనుంచి బయటికెళ్లకుండా ఒక్కరే కూర్చుని ఆడుకుంటే
స్కూలు నుంచి ఇంటికొచ్చి టీచర్లు చెప్పిన రైమ్స్‌ను పదే పదే వల్లెవేస్తూ బుద్ధిగా చదువుకుంటే
ఒక్కసారి చెప్తే చాలు గ్రహించే శక్తి ఉంటే…
ఇలా చదివి చదివి ఎప్పుడూ స్కూల్లో మొదటిర్యాంకులే సాధిస్తే…
అబ్బ మావాడు అందరిలా కాదు చాలా బుద్ధిమంతుడు అని సంతోషిస్తున్నారా..? చిన్నవయసులోనే చాలా పరిణతి చెందిన వాడు అంటూ సంతోషిస్తున్నారా..?
కానీ… అది మీరు సంతోషించాల్సిన విషయం కాదు. పైపెచ్చు అనుమానించాల్సిన విషయం. ఎందుకంటే… అది మీ పిల్లల మంచితనం కాదు… పరిణతి చెందిన లక్షణాలు అసలే కావు. అవును ఈ లక్షణాలన్నీ ఓ వ్యాధికి సంబంధించినవి. అది మామూలు వ్యాధి కూడా కాదు. అదెలా వస్తుందో ఎవరికీ తెలియదు. యు.ఎస్., యు.కె.లను గడగడలాడించిన ఈ వ్యాధి ఇప్పుడు ఇండియాపై కన్నేసింది.
ఇంతకీ వ్యాధిని ఏమని పిలుస్తారో తెలుసా… ఆటిజమ్. ఆటిజమ్… వినడానికి మనకు ఇది కొత్తగా ఉన్నా. ప్రపంచదేశాలకు మాత్రం చాలా పాతపేరే. అమెరికాలో జరిగిన ఓ సర్వే ప్రకారం అక్కడి ప్రతి 166 మంది చిన్నారుల్లో ఒకరు దీనితో బాధపడుతున్నారట.
ఇక అటు యు.కె. దేశాల్లో దీని తీవ్రత మరీ ఎక్కువ. 2008 సంవత్సరంలో యు.కె.లో జరిగిన ఓ సర్వేలో ప్రతీ 58 మందిలో ఒకరు ఆటిజమ్‌తో బాధపడుతున్నారని తేలిందంటేనే అర్ధం చేసుకోవచ్చు ఆటిజమ్ ఏ స్థాయిలో వ్యాప్తిచెందుతోందో.
అసలు ఇంతకీ ఆటిజమ్ అంటే ఏమిటి..? మిగతా జబ్బులకు ఆటిజమ్‌కు తేడా ఏమిటి..? ప్రత్యేకంగా పిల్లల్లోనే ఎందుకు వస్తోంది..? నివారణ మార్గాలేమిటి..? అల్లరి చేయని పిల్లలంతా ఆటిజమ్ వ్యాధిగ్రస్తులేనా..? వాళ్లనెలా గుర్తించాలి..? ఆటిస్టిక్ పిల్లలపట్ల ఎలా వ్యవహరించాలి…?
ఆటిజమ్ అంటే మానసిక పరిపక్వత లోపించడం. సుమారు మూడు సంవత్సరాల వయసున్న పిల్లల్లో వచ్చే ఈ వ్యాధి వారి మనస్తత్వాన్ని ప్రత్యేకంగా మార్చేస్తుంది. నలుగురితో కలవకపోవడం, ఎవరితో మాట్లాడకపోవడం, ఒంటరితనాన్ని ఇష్టపడటం, ఎవరినీ నేరుగా చూడకపోవడం, పదే పదే ఒకే పనిని చేస్తుండటం వీరి ప్రాథమిక లక్షణాలు.
నిజానికి పిల్లల్లో ఆటిస్టిక్ లక్షణాలు గుర్తించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఆటిజమ్‌లో ఎన్నో రకాలున్నాయి. మొదట కొన్ని లక్షణాలతోనే ప్రారంభమయ్యే ఆటిజమ్ ముదురుతున్న కొద్దీ విపరీత మార్పులు చోటుచేసుకుంటాయి.
అందుకే ఆటిజమ్ ప్రారంభమైన మొదట్లో అది తమ పిల్లల పరిణతితనంగా భావించి పొరపాటు పడుతుంటారు. కానీ… మాటలు సరిగ్గా రాకపోవడం, మాట్లాడితే స్పందించకపోవడం వంటివాటిని గమనించిన తరువాతే అనుమానపడి డాక్టర్ల దగ్గరికి వెళుతుంటారు. ఒక్కోసారి అది గుర్తించడం ఆలస్యమై ఆటిజమ్ ముదిరిపోతుంటుంది.
ఆటిజమ్ ఎలా వస్తుంది అన్న ప్రశ్నకు ఇంతవరకూ ఎవరిదగ్గరా సమాధానం లేదు. దీనికి మూలకారణం కనుక్కునేందుకు ఇంకా పరిశోధనలు సాగుతున్నాయి. అయితే క్రోమోజోముల్లో మార్పుల వల్ల ఆటిజమ్ వస్తుందన్న కొన్ని పరిశోధనలు చెపుతుండగా, వివిధ రకాల జబ్బులను నివారించే వ్యాక్సిన్లలో మెర్కురీ లెవెల్స్ పెరగడం కూడా ఇందుకు కారణమంటున్నారు మరికొందరు శాస్త్రవేత్తలు. ఇక ప్రసవ సమయం ఏర్పడే సమస్యలు కూడా దీనికి దారితీయవచ్చని మరో అంచనా.
ఏదేమైనా ఆటిజమ్‌కు కారణమేమిటనేది ఇప్పటివరకు అంతుపట్టని ఓ మిస్టరీ లాగానే మిగిలిపోయింది. ఇక వ్యాధికి కారణం తెలియనట్లుగానే ఆటిజమ్‌కు చికిత్స కూడా లేదు. న్యూట్రిషన్ ఫుడ్‌ను అందించడం, బిహేవియర్ థెరపీలు చేయడం తప్ప దీనికి వేరే మార్గం లేదు.
అయితే ఆటిజమ్‌ను ప్రాథమిక స్థాయిలోనే గుర్తిస్తే మాత్రం ముదరకుండా కాపాడుకోగలమంటున్నారు డాక్టర్లు. ఈ స్థాయిలోనైతే బిహేవియర్, స్పీచ్ థెరపీల ద్వారా మామూలు పిల్ల స్థాయికి తీసుకెళ్లడం కష్టం కాదంటున్నారు డాక్టర్లు.
ఆటిజం నిజంగా ప్రాణాంతకమా? అంటే కాదు. కానీ, అంతపనీ చేస్తుంది.. మానసికంగా నానా అగచాట్లు పెట్టించి పిల్లల వ్యక్తిత్వ వికాసాన్ని దారుణంగా దెబ్బ తీస్తుంది. దీన్నుంచి విరుగుడు మందులతోనో.. సర్జరీలతోనో లేదు.. ఇది తల్లిదండ్రులు బాధ్యతగా వ్యవహరించటంపై ఆధారపడి ఉంటుంది. ఆటిస్టిక్ పిల్లల రుగ్మత ఫలానా మందులు వాడితే నయమైపోతుందన్న నమ్మకం లేదు. వీళ్లలో కనిపించే ప్రధాన లక్షణం ఒంటరితనం.. నలుగురిలోకి వెళ్లలేరు.. ఒంటరితనాన్ని కోరుకుంటారు.. ఒంటరిగానే ఉంటారు.. ఎక్కడికి వెళ్లినా ఒంటరిగానే వెళ్తారు.. ఎవరు పిలిచినా బదులివ్వరు.. ఇది ఒకసారి ముదిరిపోయిందా? లైఫ్‌లాంగ్ వెంటాడుతూనే ఉంటుంది.. పైకి నవ్వుతూ కనిపించే వాళ్లే.. లోలోపల చాలా మథనపడుతుంటారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా డిప్రెషన్‌కు లోనైపోతారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ ఒత్తిడి భూతంలా వెంటాడుతుంది.. ఒక్కోసారి ఆత్మహత్యకు ప్రేరేపించినా ఆశ్చర్యపోనవసరం లేదు.
ఆటిజంను మనం చేతల్లో చూపించటమే తప్ప మందులతో నయం చేద్దామనుకుంటే అంతకంటే పొరపాటు లేదు. పిల్లల్ని ముందుగా ఒంటరితనం నుంచి దూరం చేయాలి.. వీలైనంత ఎక్కువ సార్లు నలుగురిలో తిరిగేలా చేయటం.. నలుగురితో మాట్లాడించటం.. సరదాగా కబుర్లు చెప్పటం తప్పనిసరి.. చెప్తే వినటం లేదనో… పిలవగానే పలకటం లేదనో.. వాళ్లను తిట్టినా.. కొట్టినా పిల్లలు మానసికంగా మరింత బలహీనులవుతారు.. ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్షన్ వాళ్లలో తెలియకుండానే పెరిగిపోతుంది. ముందు ఆటిజం అంటే ఏమిటో.. తల్లిదండ్రులు తెలుసుకోవాలి.. ఆ తరువాత పిల్లలతో ఎలా నడచుకోవాలో.. వాళ్లను ఎలా పెంచాలో.. అవగాహన పెంచుకోవాలి..
కూల్‌గా ఉండే పిల్లలను చులకనగా చూస్తే కష్టం.. తోబుట్టువులు.. స్నేహితులు, బంధువులు కూడా వాళ్లతో కలుపుగోలుగా ఉండేలా చేయటం తప్పనిసరి.. అంతా వాళ్లను కలుపుకుని పోయేలా చూడాలి.. ఎంత ఎక్కువగా ఇంటరాక్షన్ అవుతూ ఉంటే.. వాళ్లు అంత స్వేచ్ఛగా మారిపోతారు..
సైకలాజికల్‌గా.. పిల్లలను ట్రీట్ చేయటం ఒక్కటే ఆటిజంకు పరిష్కార మార్గం.. ఇందుకోసం కొన్ని శిక్షణా కేంద్రాలు కూడా మెట్రో నగరాల్లో వెలిశాయి. పిల్లల్లో ఆటిస్టిక్ లక్షణాలను తగ్గించి మానసిక ఒత్తిడి నుంచి దూరం చేయటం వీటి ఉద్దేశం.. కానీ.. వీటి వల్ల ఉపయోగం పరిమితంగానే ఉంటుంది.. తల్లిదండ్రులు.. తోబుట్టువుల వల్లనే ఆటిస్టిక్ పిల్లలు దాన్నుంచి దూరం కావాల్సి ఉంటుంది. ఆటిస్టిక్ పిల్లలను చులకన చేసే తోబుట్టువులు, స్నేహితులు, బంధువులకు ఆటిజమ్ గురించి వివరించాలి. వీలైనంతవరకు ఆటిస్టిక్ పిల్లల్ని అందరితో కలిసేలా చూడాలి. వారిని కలుపుకుపోయేలా అందరినీ ప్రోత్సహించాలి. వీలైనంత ఎక్కువగా ఇంటరాక్షన్ అవుతూ ఉండాలంటున్నారు డాక్టర్లు.
ఆటిజమ్ పిల్లలకు ప్రత్యేక శిక్షణ నిచ్చేందుకు దేశంలోని ప్రముఖ నగరాలన్నింటిలో ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటయ్యాయి. అయితే అవి మెట్రోనగరాలకు మాత్రమే పరిమితమయ్యాయి తప్ప జిల్లాలు, మండలస్థాయికి విస్తరించలేదు. అయితే ప్రభుత్వం ఇటువంటి ఆటిజం వ్యాధిన పడ్డ పిల్లల సంఖ్య పెరిగిన దృష్ట్యా ప్రత్యేక స్కూళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “పిల్లలే దానికి ఆహారం
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *