ఆదికవి అవతరించిన నేల.. బోధన్

తెలుగుకు ప్రాచీన హోదాకు రాచబాట.. పంపన సాహితీ సృజన 

కన్నడంలోనే కాదు.. తెలుగులోనూ ఆదికవిగా గుర్తింపు 

కన్నడంతో పాటు తెలుగులో సైతం 10వ శతాబ్దంలోనే రచన

తెలుగుకు ఆదికవి ఎవరు? అన్న ప్రశ్నకు ఇంతకాలం మనం నన్నయ్య భట్టారకుని కీర్తిస్తూ వస్తున్నాం. కానీ, నన్నయ్య కంటే వందేండ్లకు ముందే అటు కన్నడంలోనూ, ఇటు తెలుగులోనూ కావ్యరచన చేసిన వాడు పంపన. నిజామాబాద్ జిల్లా బోధన్‌లో జన్మించిన పంపన తెలుగు సాహిత్యానికి ఆదికవి. కీశ 10వ శతాబ్దంలో తెలుగు సాహితీ సృజన చేసినవాడు. ఇవాళ తెలుగు భాషకు ప్రాచీన హోదా రావడానికి ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయి.. తెలుగుకు ప్రాచీన హోదా రావడానికి కారణమైన వాడు పంపకవి. పంపకవి రచనలే మన భాషకు ప్రాచీన హోదా వచ్చేందుకు తిరుగులేని రుజువులైనాయి. ఆంధ్రా పాలకుల ఆధిపత్యధోరణులతో ఇంతకాలం చీకటి కోణాల్లో దాగిన పంప కవి చరిత్ర, జీవిత విశేషాలు ప్రస్తుతం వెలుగుచూస్తున్నాయి. పద్మకవిగా పిలువబడే పంపన బోధన్, వేములవాడలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన చాళుక్యుల కాలానికి చెందినవాడు. చాళుక్య రాజుల్లో రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నవాడు. కన్నడ సాహితీ సృజనలోనూ ఆయనే ఆదికవి. పంప కవి కీ.శ. 902 నుంచి కీ.శ.975 వరకు జీవించినట్లు తెలుస్తున్నది. కీ.శ. 931నాటికే ఆయన కన్నడ భాషలో ఆదిపురాణం రాశారు. అదే భాషలో విక్రమార్జున విజయం పేరిట మహాభారతాన్ని రచించాడు. ఆయన నూరుశాతం తెలుగువాడే అన్నది ఇటీవల పరిశోధనల్లో స్పష్టంగా తేలింది. బోధన్‌లో చాలకాలం జీవించిన పంపన జైనమతం స్వీకరించి అక్కడే నిర్యాణం చెందాడు. నాటి ఆయన సమాధి ప్రస్తుతం శిథిలమయింది. సమాధికి చెందిన శిలాశాసనాలు నిజామాబాద్‌లోని తిలక్‌గార్డెన్ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.

జినేంద్ర పురాణం… మన తొలి తెలుగు రచన…!

కన్నడంలో ఆదిపురాణం, విక్రమార్జున విజయం రచనల అనంతరం.. పంపకవి రచించిన జినేంద్ర పురాణం.. తెలుగులో వచ్చిన తొలి కావ్యమని సాహితీకారులు, చరిత్రకారులు భావిస్తున్నారు. దీంతో ఇంతకాలం నన్నయ్య మాత్రమే తెలుగు ఆదికవి అన్న భావనకు తెరపడింది. ఎందుకుంటే నన్నయ్య, పంప కవి రచనల మధ్య వందేండ్లకు పైగా కాలవ్యవధి ఉంది. పంపన రచించిన జినేంద్ర పురాణంలోని కంద పద్యాలనే ఆయన సోదరుడు జినవల్లభుడు నేటి కరీంనగర్ జిల్లా బొమ్మలగుట్టపై కురిక్యాల శాసనంపై చెక్కించాడని చరిత్రకారులు నిర్ధారించారు. 2006లో కేంద్రప్రభుత్వం తెలుగుకు ప్రాచీన హోదా ఇవ్వగానే, తెలుగుకు ఆ అర్హత లేదంటూ మద్రాస్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలయింది. ఒక భాషకు ప్రాచీన హోదా రావాలంటే ఆ భాషకు 1500 సంవత్సరాల చరిత్ర, వెయ్యి సంవత్సరాల సాహిత్యం ఉండాలి. కాగా, 900 సంవత్సరాల కిందటే రచనలు చేసిన నన్నయ్యను ఆదికవిగా నాటి ఉమ్మడి రాష్ట్ర పాలకులు చూపటం వల్ల మన భాష ప్రాచీన హోదాకు అడ్డంకి ఏర్పడింది. అయతే, పంపకవి వెయ్యి సంవత్సరాల కిందటే తెలుగులో రచన చేశాడు. పంపన తెలుగు రచనలతో పాటు జినవల్లభుడు వేయించిన కురిక్యాల శాసనంలోని కంద పద్యాలు, తెలుగు భాష శాతావాహన రాజు హాలుడి నుంచి వాడుకలో ఉన్న విషయాన్ని తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి మద్రాస్ హైకోర్టుకు రుజువులతో సహా సమర్పించింది. కోటిలింగాల, ధూళికట్టల్లో లభ్యమైన శిలాశాసనాల ఆధారంగా తెలుగుభాషకు రెండువేల సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు నిరూపించింది.ఫలితంగా తెలుగు ప్రాచీన హోదాకు అభ్యంతరం తెలుపుతూ దాఖలయిన కేసును ఆ కోర్టు కొట్టివేసింది. ఇలా.. తెలుగుకు ప్రాచీన హోదా రావటానికి పంప కవి కారణమయ్యారు. అందుకే..ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో ప్రభుత్వం పంపకవి యాదిలో పేరిట ప్రత్యేకంగా ఉత్సవాలను నిర్వహించి పంపనకు అక్షర నీరాజనాలు అర్పించింది.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఆదికవి అవతరించిన నేల.. బోధన్”

Your email address will not be published. Required fields are marked *