చాక్లెట్.. పసివాడిన జీవితాల కథ
కోవెల సంతోష్ కుమార్

చాక్లెట్ పిల్లలకు తీపినిస్తుంది. చాక్లెట్ ప్రేమికులను కలుపుతుంది.. చాక్లెట్ ప్రేమను నిలబెడుతుంది.. చాక్లెట్ హ్యాపీమూడ్‌కు చిరునామా.. కానీ, అదే చాక్లెట్ కొందరికి మాత్రం విషంగా మారుతోంది.. వేలాది పసి ప్రాణాలను బలిగొంటోంది.. అందరికీ తీపినందించే చాక్లెట్ వాళ్ల పాలిట మాత్రం చేదు మాత్రగా మారింది. తాను ఓ రూపానికి రాకుండానే వాళ్లను మృత్యుముఖంలోకి తోసేస్తోంది. ప్రపంచానికి తీపినందించేందుకు వాళ్లు చావును కొని తెచ్చుకుంటున్నారు.. ఎందుకీ దురవస్థ.. ? వాళ్లేం పాపం చేశారు?

ఒక్కటి చాలు.. కోపాన్ని పోగొట్టేందుకు
ఒక్కటి చాలు..ప్రియంగా కౌగిలించుకునేందుకు
ఒక్కటి చాలు..అల్లరి ఆపేందుకు
నిజంగా ఒకే ఒక్కటి చాలు..అన్నింటినీ మరిపించేందుకు
దాన్ని చూస్తేనే..రారమ్మని పిలుస్తోంది
వద్దనుకున్నా లాక్కెళ్లిపోతోంది..నోట్లో నీళ్లూరిపోతున్నాయి
చేత్తో పట్టుకుంటేనే….పులకరింపులొచ్చేస్తాయి
నాలుకపై చేరగానే..కరిగిపోతుంది
మనసునూ కరిగించేస్తుంది…పిల్లలకు పిచ్చి నేస్తాలు
ప్రేమికులకు …ప్రియమైన బహుమతులు

చాక్లెట్లు… వీటి గురించి చెప్పేదేముంది.. ఇవాళ ఇది లేని జీవితాలే లేవు. పిల్లలకు వీటి కంటె బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరూ ఉండరు.. ప్రేమకు ఇంతకంటే పైరవీకారులు మరెవరుండరు.. ప్రపంచం పోకడలనే నియంత్రించే చిన్ని మిఠాయి చాక్లెట్.. పిల్లల నుంచి యూత్ వరకు అందరినీ పూర్తిగా తన కంట్రోల్‌లోనే ఉంచుకునే ఏకైక వస్తువు చాక్లెట్ మాత్రమే.. చాక్లెట్ లేకుండా మీ పిల్లల పుట్టిన రోజులు చేసిన సందర్భం ఉందా? చాక్లెట్ లేకుండా వాలంటైన్స్ డే జరుపుకోవటం సాధ్యమేనా? కానే కాదు.. అందుకే ప్రపంచంలో సగం జనాభాను చాక్లెట్ నియంత్రిస్తోంది.
కానీ, మీకు తెలుసా? ఇంత మందికి ఇష్టమైన చాక్లెట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎలా తయారు చేస్తారు? దీని వెనుక ఉన్న చీకటి కోణాన్ని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ఇందరికి తీపిని పంచే చాక్లెట్ వేలమంది చిన్నారుల పాలిటి మృత్యువుగా మారింది.. వాళ్లను రోగాల్లో కూర్చేస్తోంది.. బానిసలుగా మార్చి వెట్టి చేయిస్తోంది. జీవచ్ఛవాలుగా మార్చిపడేసింది. వేల మంది చిన్నారులు రోజూ చస్తూబతుకుతూ ప్రపంచాన్ని తీపినందిస్తున్నారు.. అతి దారుణమైన, దుర్భరమైన జీవితాల్ని అనుభవిస్తున్నారు? ఎందుకు వారికీ శిక్ష? వాళ్లేం పాపం చేశారు? వాళ్లు అందరిలాగానే పుట్టారు.. అందరిలాగే తల్లి పాల కోసం ఏడ్చారు.. ఊహ తెలియని వయసులో, సంతోషంగా ఉండాల్సిన బాల్యాన్ని మాత్రం పోగొట్టుకున్నారు.. వెట్టి బానిసలయ్యారు.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వేల మంది పసివాళ్లు అయిదారేళ్ల వయసు నుంచే సంపాదన మొదలు పెట్టాల్సిన దురవస్థను ఎదుర్కొంటున్నారు. చాక్లెట్ కోసం.. కేవలం చాక్లెట్ కోసం వాళ్లు జీవితాలు పణంగా పెడుతున్నారు.. వాళ్ల వళ్లంతా పుండ్లు.. వాళ్లకు స్కూల్ అంటే ఏమిటో తెలియదు..చదువు లేదు.. ఆటపాటల ప్రశ్నే లేదు.. ఉదయాన్నే లేవగానే అక్కడ ఫామ్ ప్లేస్‌కు రావాలి.. రసాయనాలు వెదజల్లాలి.. సాయంత్రం దాకా పని చేయాలి.. కూలీ ఇస్తే తీసుకోవాలి.. లేకుంటే లేదు…. వాళ్ల కళ్లను చూడండి.. కాంతి లేక పాలిపోయిన ఆ కళ్లలోంచి జారిపోతున్న కన్నీటిని చూడండి.. ఈ పిల్లలంతా ఖైదీలు.. ఇంకా చెప్పాలంటే బానిసలు.
ఐవరీకోస్ట్.. పశ్చిమ ఆఫ్రికాలో కోక్ విరివిగా లభించే ప్రాంతం.. ప్రపంచం మొత్తం మీద 43 శాతం పైగా అంటే రెండింట మూడు వంతుల కోక్ ఇక్కడే పండుతుంది. ఇదిగో ఇదే ఇక్కడి పిల్లల పాలిటి శాపంగా మారింది. ఐవరీకోస్టే కాదు.. మొత్తం ఆఫ్రికాలోనే బాల్యాన్ని ఈ కోక్ ఛిద్రం చేస్తోంది. పిల్లలను బానిసలను చేయటం.. పిల్లల అక్రమరవాణా.. అన్నింటికీ కోకాఫామ్ అంతర్జాతీయ కేంద్రంగా మారింది..
ఈ కోకా భూముల్లో పని చేసే వాళ్లంతా పిల్లలే.. ప్రతి వంద మందిలో 65 మంది చిన్న పిల్లలే… అదీ పధ్నాలుగేళ్ల లోపు పిల్లలు.. కనీసం పసితనం నవాళ్లనైనా వీళ్లు చూసి ఎరుగరు..తల్లీ తండ్రీ లేని అనాథలు.. ఒకవేళ ఉన్నా తిండికి గతిలేని పరిస్థితి.. చిన్నపెద్ద తేడా లేకుండా సంపాదించి తీరాల్సిన దయనీయమైన కుటుంబాలు… అతి తక్కువ కూలి రాళ్లతో బతుకులు వెట్టిలోకి నెట్టుకుంటున్నారు ఆఫ్రికన్‌లు.
నిజానికి పిల్లలను అక్రమంగా తరలించటం కానీ, వాళ్లను బానిసలుగా వెట్టి చేయించుకోవటం కానీ, అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధం.. ప్రపంచంలోని ప్రముఖ బ్రాండెడ్ కంపెనీలన్నీ చైల్డ్‌లేబర్‌ను వాడవద్దని.. వెట్టి చేయింవద్దని ఒక అంగీకారానికి కూడావచ్చాయి. కానీ, ఏ ఒక్కటీ కూడా దాన్ని పాటించదు.. ఈ బస్‌స్టాండ్ చూడండి.. చైల్డ్ ట్రాఫికింగ్‌కు ఇది కేంద్రం.. ఆఫ్రికాలోని మాలిలోని బస్‌స్టాండ్ ఇది. .. 12 నుంచి 14ఏళ్ల పిల్లలు రోజూ ఈ బస్‌స్టాండ్ నుంచి ఐవరీకోస్ట్‌కు తరలిపోతారు.. రోజూ వేల మంది పిల్లలను చాక్లెట్ రైతులకు అమ్మేస్తారు.. వాళ్లు తమ కంపెనీల తరపున పనిచేయించుకుంటున్నారు.
అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఒకసారి బస్సెక్కారంటే అంతే సంగతులు.. మాయమైపోవలసిందే. డబ్బులు సంపాదించటం మాట దేవుడెరుగు.. వాళ్ల జీవితాలే కుక్కలు చింపిన విస్తరి అవుతాయి.
ఆఫ్రికాలోని కోకా క్షేత్రాల్లో ఎంతమంది పిల్లలు బానిసలుగా పనిచేస్తున్నారో తెలుసా మీకు.. అక్షరాలా 8.4మిలియన్ల మంది. మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ, ఇదే నిజం.. ఇంతమంది చిన్నారులు తమ బాల్యాన్ని చిదిమేసి, రక్తం చిందిస్తే కోకా కాస్తా చాక్లెట్‌గా మారుతోంది. సుకుమార శరీరాలను రోగాలకు అప్పజెప్తే, సుమధురమైన చాక్లెట్ తయారవుతోంది. తమకు ఏం జరుగుతోందో తెలియని వయసు… యజమాని చెప్పినట్టు గొడ్డు చాకిరీ చేయటం తప్ప ఇంకేమీ తెలియనితనం.. రూకో.. రూపాయో వచ్చింది వచ్చినట్లు ఇంటికి పంపించటం తప్ప ఇంకేమీ చేయలేని, చేతకానితనం.. అసలు జీవితం అంటేనే అర్థం కాని వయసు.. ఇన్ని వేల మంది పిల్లలను ఇంత దారుణంగా, ప్రాణాంతకంగా హింసించాలని ఏ అంతర్జాతీయ న్యాయం చెప్తోంది? వేల కోట్ల డాలర్లు దండుకొంటున్న వీళ్లకు ఆ అడవుల్లో కోకా ఫామ్‌లలో పనిచేస్తున్న వాళ్లెవరో కనీసం తెలుసా?
సూటూబూటూ వేసుకుని టిప్‌టాప్‌గా తిరుగుతున్న వీళ్లను చూడండి.. ఒక్కొక్కరూ ప్రపంచంలో పేరు పొందిన ఒక్కో కంపెనీలో అత్యున్నత ఉద్యోగులు.. మార్కెటింగ్ స్ట్రాటెజీల్లో తలపండిన మేధావులు.. తమ చాక్లెట్లకు పిల్లలను, ప్రేమికులను ఎంత చక్కగా ఆకర్శించవచ్చో చాలా బాగా తెలిసిన వాళ్లు.. కానీ, వీళ్లకు చాక్లెట్‌కు ముడిసరుకు ప్రధానంగా ఎక్కడి నుంచి వస్తున్నదన్న సంగతి మా..త్రం తెలియదు. ఇంకా విచిత్రం ఏమంటే.. ఆ ముడిసరుకు సేకరణలో బాల కార్మికులు వెట్టి చేస్తున్నారన్న విషయం అసలే తెలియదు.. వేల మంది పిల్లలు అల్లాడుతూ బానిసలుగా పడి ఉన్న విషయాన్ని రూమర్‌గా కూడా ఒప్పుకోలేకపోతున్నారంటే వీళ్లు ఏ దశలో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.
ఘనా.. మాలి.. ఇలా ఆఫ్రికాలోని చాలా చాలా గ్రామాలు చాక్లెట్ కంపెనీల దాష్టీకానికి పిల్లలందరినీ కోల్పోయాయి. కొన్ని గ్రామాల్లో ప్రతి ఇల్లూ పసితనాన్ని మరిచిపోయింది. ఒక్కమాటలో చెప్పాలంటే ఆఫ్రికాలోని ఆ గ్రామాల్లో పిల్లల్ని కనటం తమకోసం కాదు.. చాక్లెట్ కంపెనీల కోసం అన్నట్లుగానే తయారైంది. రోజూ.. ప్రతిరోజూ.. చైల్డ్ స్మగ్లింగ్ నిరంతరాయంగా జరుగుతూనే ఉంటుంది. వాళ్లను అడ్డుకునే వాళ్లు లేరు. పిల్లల బాధల్ని పట్టించుకునే వాళ్లు అంతకంటే ఉండరు.. ఏ రోజు ఏ పిల్లవాడు ఎలా మాయమవుతాడో తెలియదు.. తేలేది ఎక్కడో మాత్రం అందరికీ తెలుసు.. ఐవరీ కోస్ట్.. కంపెనీకి పిల్లవాణ్ణి అమ్మేస్తే చాలు.. ఏడాదికి సరిపడా గ్రాసాన్ని సంపాదించుకున్నట్లే..
చైల్డ్ స్మగ్లింగ్ ఇంత బాహాటంగా జరుగుతున్నా కంపెనీలు మాత్రం సన్నాయి నొక్కులు నొక్కుతాయి. ఐవరీకోస్ట్‌లో వాస్తవంగా ఏం జరుగుతుందనేది ఎవరికీ తెలియకుండా వాటి జాగ్రత్తలు అవి తీసుకుంటాయి కూడా.. 2004 ఏప్రిల్ 16న ఫ్రెంచి-కెనెడియన్ జర్నలిస్ట్ గే ఆండ్రీ కీఫర్ ఐవరీకోస్ట్‌లో పిల్లల వెట్టిపై కంపెనీల బాగోతంపై స్టోరీ చేసేందుకు వెళ్లి కిడ్నాప్ అయ్యాడు.. కేసు నమోదయింది. కేసు తేలలేదు.. మూతపడలేదు.. కీఫర్ జాడ ఇప్పటికీ తెలియనే లేదు.. అంత ప్రమాదకరంగా అక్కడ కోకో సేకరణ జరుగుతుంది.
ఒక్కో కంపెనీలో ఏడాదికి సుమారు 150 మిలియన్‌ల యూరోలు లాభంగా వస్తాయి. గొడ్డు చాకిరీ చేసే పిల్లలకు మాత్రం రోగాలే మిగులుతాయి. నిండు నూరేళ్లు బతకాల్సిన పసివాళ్లు పాతికేళ్లు నిండకుండానే ఉసూరుమంటున్నారు. న్యుమోనియా, ఊపిరితిత్తుల కేన్సర్, బ్లడ్‌షుగర్, గుండె సంబంధ వ్యాధులు.. అన్నింటికంటే భయంకరమైన చర్మసంబంధ వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు.. కనీసం తమకు అంటుకుంటున్న రోగాల గురించి కూడా వారికి సరైన అవగాహన లేని పరిస్థితి.
సాధారణంగా కోక్ పంట అక్టోబర్ నుంచి మార్చి వరకు వస్తుంది. కానీ, మిగతా టైమ్‌లలో వేరే పంటలకు కూడా ఈ పిల్లలతో పని చేయించుకుంటారు. పిల్లలు వేసవి సెలవుల్లో రెండు నెలల పాటు వాళ్ల ఇష్టం ప్రకారమే వచ్చి పని చేసి కొంత సంపాదించుకుని వెళ్తారని ఎవరి ఒత్తిడీ వారిపై ఉండదనేది ఐవరీ గవర్నమెంట్ వాదన.. ఇంతకు మించి కోకా ఫామ్‌లలో పిల్లలను పని చేయనివ్వటం లేదని నేరుగానే అబద్ధం చెప్పేస్తారు.. కానీ, వీళ్లలో ఏ ఒక్కరూ కూడా స్కూలు మొఖం కూడా చూసి ఎరుగరు.. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభుత్వం పక్కాగా చైల్డ్ స్మగ్లింగ్‌ను ప్రోత్సహిస్తుంది.
ఇక వీళ్లను కాపాడేదెవరు?

ఇంతకీ చాక్లెట్ ఎలా తయారవుతుంది?

ఒక చాక్లెట్ మన నోట్లో క్షణాల్లో కరిగిపోతుంది.. కానీ, వాళ్ల వీపులపై ఎంతకీ కరగని గుదిబండగా మారింది. ఇంతకీ ఇంతమంది పసికూనల ఉసురు తీసుకుని ఊపిరిపోసుకునే చాక్లెట్ ఎలా తయారవుతుందో తెలుసా? బాల బానిసల బుల్లి చేతులతో కోకా ఫామ్‌ల నుంచి సేకరించిన కోక్‌ను ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ ప్రాసెసింగ్ మొదలవుతుంది. కోకా బీన్స్‌ను బాగా ఎండపెడతారు. ఎండపెట్టిన బీన్స్‌ను ఫ్యాక్టరీకి తరలిస్తారు. అక్కడ వాటిని ఫర్నేస్‌లో వేసి పైనున్న పొట్టులాంటి పొరల్ని తొలగిస్తారు. లోపల ఉన్న కోకా బీన్‌తో స్వచ్ఛమైన చాక్లెట్ లిక్విడ్ తయారవుతుంది.
చాక్లెట్ లిక్విడ్‌ను పాలు, షుగర్, బట్టర్ కలిపిన మిశ్రమంతో కలిపేస్తారు.. దీన్ని బాగా కలిపి చిక్కబెట్టిన తరువాత కావలసిన రూపంలో చాక్లెట్ తయారవుతుంది.
రకరకాల రంగుల్లో.. కవర్‌ల్లో అందంగా ముసుగేసుకుని చాక్లెట్ మార్కెట్ ముందుకు వచ్చేస్తుంది.
అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. మార్కెట్ స్ట్రాటెజీ.. చాక్లెట్లను అమ్ముకోవటానికి ప్రకటనల పర్వం.. పిల్లలపై ఎక్కడ లేని ప్రేమను చూపిస్తాయి. ప్రేమికులపై ఎక్కడ లేని అనురాగాన్ని చూపిస్తాయి.
ఇదే విచిత్రం…ఓ పక్క అత్యంత ఘోరంగా, మనిషి జీవించే హక్కును పసివాడని తనంలోనే అత్యంత దారుణంగా హరిస్తూ , మరో పక్కేమో అదే పిల్లలను తమ ఫస్ట్ కస్టమర్లుగా మార్కెట్ చేసుకుంటున్నారు.. వాళ్ల వ్యాపారానికి పిల్లలే కూలీలు.. పిల్లలే కస్టమర్లు.. పిల్లల రక్తంతో చాక్లెట్ తయారు చేస్తారు.. పిల్లల బలహీనతలతో వాటినమ్మి సొమ్ము చేసుకుంటారు.. కోట్లు గడించి వీళ్లు లగ్జరియస్ లైఫ్‌ను గడుపుతుంటారు.. వీళ్ల సంపన్నత కోసం పనిచేసే వారి ఆ పసివాళ్లకు మాత్రం లైఫే లేకుండా చేస్తారు.. ఇప్పుడు చెప్పండి.. మీరు ఒక చాక్లెట్ కొంటున్నారంటే మీకు తెలియకుండానే మీరు వెట్టిని ప్రోత్సహిస్తున్నారని అర్థం. ఒక చాక్లెట్ కొంటున్నారంటే ఒక పసి జీవితాన్ని కొంటున్నారని అర్థం.. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది చాక్లెట్ చరిత్ర కాదు.. దాని మాటున దాగి ఉన్న పసివాడని జీవితాల వెట్టి చరిత్ర.

Reviews

There are no reviews yet.

Be the first to review “చాక్లెట్.. పసివాడిన జీవితాల కథ
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *