పండితులకు నెలవు పాలమూరు

తొలి తెలుగు రామాయణ కర్త గోన బుద్ధారెడ్డి
తొలి మహిళా కవయిత్రి కుప్పాంబిక
తెలుగు సాహిత్య రంగంలో పాలమూరు జిల్లాది విశిష్ట స్థానం. ఎందరో సంస్థానాధీశుల ఏలుబడిలో ఎంతోమంది సాహితీవేత్తలు తమ పాండిత్య వైభవాన్ని ప్రదర్శించిన నేల ఇది. రాజులు సైతం కవులై రచనలు చేసిన భూమి ఇది. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలు ఇక్కడ పుట్టి, దిగువకు విస్తరించాయి. క్రీ.శ.1000 లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాహిత్య ప్రక్రియలు ఆవిష్కారమయ్యాయి. మంథాన భైరవుడు అనే రచయిత సంస్కృతంలో భైరవతంత్రం అనే గ్రంథాన్ని రాశాడు. ఆ తర్వాత కందూరు చోళ రాజులలో ప్రసిద్ధుడైన గోకర్ణుడు గోకర్ణ చందస్సు అనే లక్షణ గ్రంథాన్ని రచించినట్లు పరిశోధకులు నిరూపించారు. కాకతీయ సామంత రాజైన గోనబుద్ధ్దారెడ్డి వాల్మీకి రామాయణాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన మొదటి కవి. 13 శతాబ్దం చివరలో గోనబుద్ధారెడ్డి ద్విపద ఛందంలో రంగనాథ రామాయణాన్ని రాశాడు. ఆయన అసంపూర్ణంగా వదిలేసిన భాగాన్ని ఆయన వారసులు కాశయ్య, విఠలుడు పూర్తిచేశారు. తెలుగు సాహిత్యంలో వీరిద్దరు తొలి జంటకవులుగా ప్రసిద్ధులయ్యారు. గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక తొలి తెలుగు మహిళా కవయిత్రిగా కీర్తి పొందింది. ఆమె రచించిన మొత్తం కావ్యం అలభ్యమైనప్పటికీ, ఆమె రచించిన ఒక పద్యాన్ని అయ్యలరాజు తన గ్రంథ సంకలనంలో ఉదహరించాడు. ఆమె కాకతీయ సామంత రాజైన మాల్యాల గుండయ్య ధర్మపత్నిగా బుద్ధ్ద్దాపురం (నేటి భూత్పూర్) పరిపాలనలో, సాహిత్య సేవ చేసింది. అక్కడ ఆస్థాన కవిగా ఉన్న ఈశ్వర భట్టు ఈమె కవయిత్రి కావడానికి ప్రేరణ అయ్యాడు. క్రీ.శ.1290 – 1330 మధ్య కాలంలో జీవించినట్లు భావిస్తున కృష్ణమాచార్యులు సింహగిరి వచనములు రచించి తెలుగులో ప్రథమ సంకీర్తనచార్యుడిగా, తొలి తెలుగు వచన ప్రక్రియ రూపకర్తగా గుర్తింపు పొందారు. జటప్రోలు సంస్థానాధీశులలోని యలకూచి బాలసరస్వతి రాఘవయాదవపాండవీయం అన్న త్య్రర్థి కావ్యాన్ని రచించాడు. ఈయన మల్లభూపాలీయం, సుభాషిత త్రిశతి వంటి రచనలు చేశాడు. తెలుగునాట అత్యంత ప్రామాణికమైన లాక్షణిక గ్రంథం అప్పకవీయం రాసిన అప్పకవి ఇక్కడివాడే. జటప్రోలు సంస్థానాధీశుడు సురభి మాధవ రాయలు చంద్రికా పరిణయం అన్న కావ్యాన్నిరచించాడు. మహాపండితులైన తిరుపతి వేంకట కవులను ఓడించిన ఘనత గద్వాల సంస్థానానికి బాల సరస్వతి శ్రీనివాసాచార్యులకు దక్కింది. వేగూరు హనుమద్దాసు, వేంకటేశ్వరస్వామిపై రచించిన కీర్తనలు, యక్షగానాలు తెలుగురాష్ర్టాలలోని ఆలయాల్లో ఏదో ఒక సందర్భంలో ఇప్పటికీ మార్మోగుతుంటాయి. హైదరాబాద్ మొదటి ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామకృష్ణరావు, సురవరం ప్రతాప్రెడ్డి, గడియారం రామకృష్ణశర్మ, కపిలవాయి లింగమూర్తి, డాక్టర్ పీ. యశోదారెడ్డి, జొన్నవాడ రాఘవమ్మ వంటి సాహితీ వేత్తలతో పాటు నేటి తరంలోనూ వందలాది మంది సాహితీ వేత్తలు తమ రచనలతో పాలమూరు సాహితీ వైభవ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉమ్మడి పాలమూరు జిల్లాకు ఖ్యాతిని తీసుకొస్తున్నారు.
సంస్థానాల సాహిత్యసేవ
పాలమూరు జిల్లాను పాలించిన పాలకులు తమ రాజ్య విస్తరణకు, పాలనకు ఎంతటి ప్రాధాన్యమిచ్చారో.. సాహిత్యానికి, కళల పోషణకు అదే ప్రాధాన్యమిచ్చారు. క్రీ.శ.1663-1735 వరకు గద్వాల రాజధానిగా చేసుకొని కృష్ణా తుంగభద్రల మధ్య నడిగడ్డగా ఉన్న గద్వాల సంస్థానం విరాజిల్లింది. ఈ సంస్థానంలో కాణాదం పెద్దన సోమయాజి, కొటికలపూడి వీరరాఘవ, ఆదిపుడి సోమనాథరావు, పుల్లభూమి వెంకటాచార్యుల వంటి కవులు రచనలు చేశారు. ఆత్మకూరు సంస్థానాన్ని సీతారాం భూపాల్ పరిపాలిస్తున్న కాలంలో తిరుమల బుక్కపట్టణం శ్రీనివాసాచార్యులు, పోసదుర్గం కృష్ణమాచార్యులు తదితరులు కవులుగా ఉన్నారు. జటప్రోలు సంస్థానాన్ని పరిపాలించిన సురభి వెలమ రాజులు స్వయంగా కవులు..రచయితలు. సురభి మాధవరాయలు చంద్రికా పరిణయం ప్రబంధాన్ని రాయగా, ఈయన ఆస్థానంలో యలకూచి బాల సరస్వతి, వెల్లాల సదాశివశాస్త్రి, అక్షింతల సుబ్బరాయశాస్త్రి, వాజపేయి యాజుల రామసుబ్బరాయకవి తదితరులను ఆదరించారు. వనపర్తి సంస్థానంలో శతవధాని గాడేపల్లి వీరరాఘవశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణశాస్త్రి, తెల్కపల్లి వీరరాఘవశాస్త్రి, నెమలూరు వెంకటశాస్త్రి తదితరులు సాహితీ సభలను అలంకరించారు.

Reviews

There are no reviews yet.

Be the first to review “పండితులకు నెలవు పాలమూరు”

Your email address will not be published. Required fields are marked *