అరిగోసకు అక్షరరూపం

గూడ అంజన్న ఈ పేరు వింటే పల్లె పదాలు పెదాలపై నాట్యం చేస్తాయి.. పేదల కష్టాలు కండ్లెదుట కదలాడుతాయి. తెలంగాణ ఉద్యమ పోరాట పటిమ మన ఒంటిని తడిమి గగుర్పాటుకు గురిచేస్తుంది. పల్లె, పట్నం అన్న తేడా లేదు.. తెలంగాణలోనే కాదు.. యావత్ తెలుగునాట ఆయన పాట సమస్యల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్న అభాగ్యులకు బాసటై నిలిచింది. గ్రామీణ ప్రజల జనజీవన విధానం, పట్నానికి వలస వచ్చిన వారి వెతలపై ఆయన రాసిన పాటలు ఆర్కే లక్ష్మణ్ సామాన్యుడి కార్టూన్లా శాశ్వతమైనవి. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు.. భద్రం కొడుకో.. ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా.. ఇలా మనం చెప్పుకొనే ప్రతి పాటా ప్రజల నాలుకలపై చిరస్థాయిగా కదులాడేవే. ఇక తెలంగాణ ఉద్యమానికి ఊపిరులూదిన తెలంగాణ గట్టుమీద సందమావయ్యో గురించి చెప్పడం అంటే..మనల్ని మనం అద్దంలో చూసుకొన్నట్టే. ఎందరో ప్రజాకవుల గురించి విన్నాం. వారి కవితలను గానం చేశాం. ప్రజాగాయకుల గానాల్నీ విన్నాం.. కానీ.. గూడ అంజన్న పాట.. ప్రజల ప్రాణమై నిలిచింది. ఆ పాట ఎంత తన్మయత్వాన్ని కలిగిస్తుందంటే.. పాట రాసిన రచయిత ఎవరన్నదో తెలియకపోయినా ఆ గానంలో లీనమై.. అది కలిగించే చైతన్య భావ స్రవంతిలో కలిసిపోయిన యువత అసంఖ్యాకం. ఆదిలాబాద్ జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్లో జన్మించిన అంజన్న హైదరాబాద్లో బీఫార్మసీ పూర్తి చేసి ఫార్మసిస్టుగా పనిచేశారు. పల్లెలో పుట్టి పెరిగాడు.. నిర్బంధాలను చవిచూచాడు కాబట్టే ఆయన పాటలకు పల్లెలు వస్తువులయ్యాయి. పేదల కన్నీళ్లు సిరాచుక్కలయ్యాయి. సమాజాన్ని గుండె లోతుల్లోంచి తరచి చూసి ఆ అనుభూతిని పాటగా మలిచిన గేయకవి గూడ అంజన్న . తెలంగాణ గేయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన కవి. ఆ రోజుల్లో ఊళ్లో వడ్డీ వ్యాపారుల అకృత్యాలకు బలైన ఓ పెద్దాయన ఆవేదనను పాటగా మార్చి రచనా రంగంలో తొలి అడుగేశారు అంజయ్య. జనం బాధను తన బాధగా భావించాడు కాబట్టే అంజయ్య పాట సజీవమైంది. అది ప్రజల హృదయాల అంచులను తాకుతుంది. సమాజంలో పరిస్థితులు, పాలకుల తీరుతో విసిగిన ప్రజల తరఫున ఆయన ప్రశ్నించాడు. ప్రతి పేదవాడికీ ఆయన పాటల్లో తమ కష్టాలు కనిపిస్తాయి. అందుకే అది నిత్యం వారి నోళ్లలో నానుతుంటుంది. దొరలు..భూస్వాముల పెత్తనాన్ని, అరాచకాలను ఆయన ప్రశ్నించారు.
16 భాషల్లోకి అనువాదం..
ఊరు మనదిరా.. వాడ మనదిరా.. ఈ పాటలో.. ఒక్కో అక్షరం నిప్పు కణికలా కణకణ మండుతుంది. కొండంత చైతన్యం ఈ పాట సొంతం. మాటనే మిస్సైళ్లుగా మలిచి… అన్యాయాన్ని ఎదిరించారు. అక్రమాలను నిలదీశారు. అందుకే ఈ పాట.. 16 భాషల్లోకి అనువాదమయింది. కాలేజీలో చదువుతున్న రోజుల్లోనే నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితులయ్యారు గూడ అంజయ్య. రాత్రి బడులు నడిపిస్తూ ప్రజలకు అక్షరజ్ఞానం నేర్పించారు. రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యలపై పాటను అస్త్రంగా ఎక్కుపెట్టారు. ప్రభుత్వాలు, వ్యవస్థల పనితీరును తన పాటలతో కడిగిపారేశారు. ప్రభుత్వాసుపత్రుల తీరుపై ఆయన రాసిన పాట.. నేటికీ ఎక్కడో ఓ చోట వినిపిస్తూనే ఉంటుంది.
తెలంగాణ ఉద్యమ పాట అంజన్న..
తెలంగాణ పోరాటంలోనూ గూడ అంజయ్య కీలకపాత్ర పోషించారు. తొలి దశ ఉద్యమంలో అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. 1975లో ఎమర్జెన్సీ టైంలో జైలుకెళ్లాడు. మలిదశ ఉద్యమంలో, రసమయి బాలకిషన్తో కలిసి ధూం.. ధాం.. ప్రారంభించి ఉద్యమానికి కొత్త శక్తినిచ్చారు. అయ్యోనివా.. అవ్వోనివా అంటూ వలస పాలకులను ప్రశ్నించారు. పలు సినిమాల్లో నటించారు. మహాకవి శ్రీశ్రీతో ఆయనకున్న అనుబంధం బలమైంది.
1988లో రజనీ తెలుగు సాహితీ సమితి అవార్డు, 1986లో సాహిత్య రత్న బంధు, 2000లో గండపెండేర సత్కారం సత్కారం, 2004లో నవ్య సాహిత్య పరిషత్ నుంచి డాక్టర్ మలశ్రీ సాహితీ అవార్డు అంజయ్యను వరించాయి. 2015లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సాహితీ పురస్కారంతో సత్కరించింది. 2015లో సుద్దాల హన్మంతు-జానకమ్మ సార్మరక పురస్కారాన్ని అందుకున్నారు. భద్రం కొడుకో అని జాగ్రత్త చెప్పినా… రాజిగ వొరి రాజిగా అన్ని ప్రశ్నించినా.. ఆయన ప్రతి పాట వెనక ఓ జీవిత గాథ దాగి ఉంటుంది. ఆయన పాట మన జీవితానుభవాల్లోంచి పుట్టుకొచ్చింది. అందుకే పేదోడి పాటల తోటమాలి గూడ అంజ్యకు మనమంతా ఎంతో రుణపడి ఉన్నాం.

ఆయన రచనలు…
1. పొలిమేర (నవల)
2. దళిత కథలు (కథా సంపుటి)

జన బాహుళ్యం పొందిన కొన్ని పాటలు…
– నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు
– జర భద్రం కొడుకో.. కొడుకో కొమరన్న జర
– ఊరు మనదిరా.. ఈ వాడ మనదిరా
– అయ్యోనివా.. నువ్వు అవ్వోనివా.. తెలంగాణోనికి తోటి పాలోనివా.?
– రాజిగ ఓరి రాజిగా
– ఇగ ఎగబడుదాంరో ఎములాడ రాజన్న
– లచ్చులో లచ్చన్న… ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలో బిచ్చగాళ్ల బతుకులాయే
– అసలేటి వానల్లో ముసలెడ్లు గట్టుకుని
– గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న
– తెలంగాణ గట్టు మీద సందమామయ్యో

Reviews

There are no reviews yet.

Be the first to review “అరిగోసకు అక్షరరూపం”

Your email address will not be published. Required fields are marked *