కొప్పవరం తిరునాళ్లు
కోవెల సంతోష్ కుమార్

Category:

జాతరమ్మ జాతర…. జాతర జరిగిన చోటల్లా ఒక్కో చోట ఒక్కో సందడి.. ఒక్కో ప్రత్యేకత.. ఒక్కో ఆచారం.. వినూత్న రీతిలో ఆట పాటా.. వేష ధారణలు.. నిజంగా ఓ అద్భుతం… జాతరంటేనే ఓ అపూర్వ కలయిక.. ఓ అపురూప సంరంభం.. సమాజంలోని అన్ని వర్గాల జనం ఒక్క వేదికపై కలిసి ఒక్కటిగా కలిసిపోయి సామూహికంగా నిర్వహించుకునే పండుగ… ఇదిగో తూర్పుగోదావరి జిల్లా కొప్పవరంలో ఒక అపూర్వ సంబరం జరుగుతుంది. జాతరొచ్చిందంటే చాలు.. పల్లెల్లో వెలుగుమొగ్గలు ఒక్కసారిగా పుట్టుకొస్తాయి… ఒకటే హడావుడి.. తెగ ఏర్పాట్లు.. సంబరాలు.. సంరంభాలు.. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామంలో సతెమ్మ తల్లి సంబరాలు ఆ ప్రాంతంలోనే ఒక విచిత్రమైన, విశేషమైన, అద్భుతమైన జాతర.. జాతర వచ్చిందంటే అక్కడి ప్రజలు పగటి వేషగాళ్లలా మారిపోతారు. నాటక కళాసమితి వాళ్ల ఊరేగింపుల్లా బయలుదేరుతారు. అలా అని అక్కడ సాంస్కృతిక కార్యక్రమాలూ జరగవు. వీళ్లంతా ఓ ఊరి ప్రజలు.. మూకుమ్మడిగా రకరకాల వేషాలు వేసుకుంటారు. కొందరు పౌరాణిక వేషాలు.. మరి కొందరు నాయకుల వేషాలు.. ఇంకొందరు మరీ విచిత్రమైన వేషాలు.. ఈ వేషాలన్నీ సరదా కోసమో వేసేవి కావు.. ఇదంతా కొప్పవరం జాతరలో అక్కడి ప్రజలు ఆచరించే ఆచారం… తమ ఇలవేల్పు అయిన సత్తెమ్మ తల్లికి చెల్లించే మొక్కులే ఈ వేషాలు…తమ దేవతకు మొక్కుకుని తమ కోరిక తీరిన తరువాత కొప్పవరం వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.. వేషం వేయటం తోనే సరిపోదు.. తాము వేసుకున్న వేషంలో ప్రజల దగ్గర బిచ్చం ఎత్తుకుని ఆ వచ్చిన సొమ్మును అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు.. చూడటానికి విచిత్రంగా కనిపించవచ్చు.. కానీ… ఈ వేషాల వెనుక మర్మం చాలా గొప్పది.. జాతరలో విచిత్ర వేషాలు వేయటం ద్వారా తమ వాస్తవ రూపాన్ని మరచిపోవాలి.. బిచ్చమెత్తుకోవటం ద్వారా లోపల ఉన్న అహంకారాన్ని నిర్మూలించాలన్నది ఈ ఆచారంలోని ముఖ్య ఉద్దేశ్యం… మేకప్ మెన్‌లకు, కాస్ట్యూమ్ డిజైనర్లకు ఈ జాతరలో భలే డిమాండ్ ఉంటుంది.. ప్రతి ఒక్కరూ సరి కొత్త వేషంతో కనిపించాలనే తాపత్రయాన్ని కనపరుస్తారు.. మేకప్ వేసేందుకు జాతర ప్రాంగణంలో నే ప్రత్యేకంగా మేకప్ ఏర్పాట్లు ఉంటాయి… మేకప్ వేసే వారికి క్షణం కూడా తీరికుండదంటే ఆశ్చర్యం లేదు.
ఇక్కడ ధనిక, పేద తేడా లేదు.. కులం, మతం, జాతి, వర్గ భేదాలు అసలు కనిపించవు.. ఒకసారి జాతర పరిసరాల్లోకి ప్రవేశించారంటే అంతా ఒక్కటే…అందరూ ఒకటై ఒకటిగా మొక్కులు తీర్చుకునే సంబరం కొప్పవరం తిరునాళ్లు..
సాధారణంగా గ్రామదేవతల జాతరలు రాత్రి సమయాల్లో ఎక్కువగా జరుగుతాయి.. రాత్రంతా పూజలు, మొక్కులతో, ఆటపాటలతో సాగుతుంది… కానీ కొప్పవరం ఇందుకు భిన్నం… పట్టపగలు జరిగే అరుదైన జాతరల్లో ఇది ఒకటి… ఈ జాతరలో అన్నీ విశేషాలే.. విచిత్రాలే… చూసి తీరాల్సిందే..
ఈ జాతరలో ప్రధానంగా చెప్పుకోదగింది భక్తుల విన్యాసాలు.. సత్తెమ్మతల్లికి జానపద సంప్రదాయంతో, దేశీయ వాద్య సంగీతంతో అబ్బురపరిచే విధంగా పూజలు జరుగుతాయి. సత్తెమ్మ తల్లికి పూజ సందర్భంగా భక్తులు రకరకాల విన్యాసాలు చేస్తారు.. పూనకాలతో ఊగిపోతారు.. ఆ సమయంలో వారిని నిలువరించటం అంత తేలికేమీ కాదు… విశేషమేమంటే ఇక్కడ జంతు బలులు ఉండవు.. మేకపోతులను వేలం వేసి ఆ డబ్బులను అమ్మవారికి కానుకగా సమర్పిస్తారు కానీ, బలులు మాత్రం ఇవ్వరు… కానీ, అమ్మవారి పూనికతో భక్తుల పూనకాలు చూసేవారికి ఒళ్లు గగుర్పొడుస్తాయి..
కొప్పవరం సత్తెమ్మ తల్లి జాతర రెండేళ్లకోసారి జరుగుతుంది. దాదాపు రెండు వందల సంవత్సరాల నుంచి ఈ జాతరను ఇక్కడి ప్రజలు జరుపుకుంటున్నారు.. జాతర మొదలైనప్పటి నుంచీ ముగిసే దాకా ఇక్కడ అన్నీ విశేషాలే.. వింతలే.. అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలనుకునే భక్తులు.. ముందుగా అక్కడి ప్రధాన పూజారితో వాగ్వివాదానికి దిగుతారు.. కోపం తెప్పిస్తారు.. చివరకు ఆయన చేతిలో దెబ్బలు తింటారు.. పూజారితో దెబ్బలు తింటేనే అమ్మవారు అనుగ్రహిస్తుందని వారి విశ్వాసం.. మామూలుగా ఆలయాల్లో బంగారం, వెండి, నగదు, వస్త్రాలను దేవతలకు కానుకలుగా సమర్పించటం పరిపాటి.. కానీ, జాతరల్లో ఒక్కో చోట ఒక్కో వింత ఆచారం ఉంటుంది. ఒక చోట బంగారం పేరుతో బెల్లాన్ని సమర్పిస్తారు.. మరో చోట నిప్పులపై నడుస్తారు.. ఇంకోచోట బియ్యాన్ని ఇస్తారు.. కొప్పవరంలో మాత్రం ఎంత సంపన్నుడైనా సరే.. భిక్షాటన చేసి వచ్చిన సొమ్మునే అమ్మవారికి సమర్పించాలి.. మొక్కులు చెల్లించిన తరువాత చివరి రోజున అమ్మవారిని ఆలయం వెలుపలికి తీసుకొస్తారు.. అమ్మవారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది..

Reviews

There are no reviews yet.

Be the first to review “కొప్పవరం తిరునాళ్లు
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *