ఒళ్లు వణికిపోతోంది
కోవెల సంతోష్ కుమార్

ఒక నీలి నీడ మిమ్మల్ని అనుక్షణం వెంటాడుతోంది… స్థిమితంగా ఉండనివ్వకుండా కేకలు పెడుతోంది… ఏదో చేసేస్తానంటూ అరుస్తోంది.. నిలుచున్నా, నడుస్తున్నా, కూచున్నా, లేచినా, నిద్రపోతున్నా, కళ్లు తెరిచి ఉన్నా.. వేధిస్తూనే ఉంది.. దాన్ని చూస్తేనే ఉలికిపాటు.. తలుచుకుంటే గగుర్పాటు.. ఆలోచనల్లో అదురుపాటు.. శరీరం చెమటలు కక్కుతోంది.. ఒళ్లు వణికిపోతోంది.. గుండె తన వేగాన్ని పెంచేసింది.. ఊపిరి భారంగా మారిపోయింది.. ఆర్చేవారు లేరు.. తీర్చేవారు లేరు.. ఆ నీడను తరిమేసే వారు లేరు.. అది నీడ కాదు.. దాని పేరు భయం.. భయం.
మానవాళి నెత్తిపై ఇప్పుడు మరో శత్రువు రాజ్యమేలుతోంది… ఇది మానసిక శత్రువు.. ఈ తరాన్ని అదే పనిగా వేధిస్తున్న శత్రువు.. ధైర్యం, సాహసం, నమ్మకం లాంటి పదాలకు చోటు లేని లోకంలో మనుషుల్ని ఆమాంతంగా మింగేస్తోంది.. చిన్నతనంలోనే చిదిమేస్తోంది.. అర్థం లేని కారణాలతో జీవితాల్ని అనర్థంగా నాశనం చేసేస్తోంది. ఎవరీ శత్రువు.?
* అమ్మ కడుపులో ఆటలాడుకుంటున్నప్పుడు ఎంత ఆనందం…
ఆందోళన అంటే ఏమిటో తెలియని ఒక అద్భుతమైన లోకం అమ్మ కడుపు..
* ఆ కడుపులోంచి బయట పడినప్పుడు
సడన్‌గా ఏదో శత్రులోకంలోకి వచ్చిన ఫీలింగ్
అప్పుడు శిశువు మొదలు పెట్టే ఏడుపు పేరు భయం..
* అన్నం తిననంటూ మారాం చేస్తుంటే..
అమ్మ చూపించే బూచీ పేరు భయం..
* స్కూలుకు ఎగ్గొట్టినప్పుడు
నాన్న కోపంగా చూసే చూపు పేరు భయం..
* హోం వర్క్ చేయకపోతే..
మాస్టారు చూపే బెత్తం పేరు భయం..
* ఇంటర్‌లో మార్కులు సరిగా రాకపోతే..
అంతా ఏమంటారో అన్న ఆందోళన పేరు భయం…
* పెండింగ్ వర్క్ కంప్లీట్ చేయకపోతే
ఆఫీస్‌లో బాస్ ఇచ్చే వార్నింగ్ పేరు భయం..
* అజ్ఞానం, అమాయకత్వం జతకడితే
వెంటాడే అతీంద్రియ శక్తుల పేరు భయం..
వెంటాడే జ్ఞాపకాల నీడ భయం..
చెట్టు భయం..
పుట్ట భయం..
పురుగు భయం..
నీడను చూసినా భయం..
మనిషి మనిషిని చూస్తే భయం…
భయం అన్న పదాన్ని కొంత పాలిష్డ్‌గా వాడితే దానిపేరు ఫోబియా… ప్రతి మనిషి మనసు లోపలి పొరల్లో ఈ ఫోబియా ఏదోరకంగా మనిషిని వెంటాడుతూనే ఉంది.. కారణాలు ఉండవు.. అర్థం ఉండదు.. ఏదో ఆలోచన.. ఏదో సంఘటన… ఒక ఓటమి.. ఈ ఫోబియాను సృష్టిస్తుంది.. పెను భూతంగా మార్చేస్తోంది.. ప్రపంచంలో దాదాపు వందకోట్ల మంది రకరకాల ఫోబియాలతో బాధపడుతున్నారట. ఊహ తెలియని రోజుల్లో ఏదో చిన్న ఘటన మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.. పెరిగిన కొద్దీ ఆ ఘటన మర్చిపోతాం.. ఏం జరిగిందో కూడా మనకు గుర్తుండదు.. కానీ దాని ఛాయలు మాత్రం వెంటాడుతూనే ఉంటుంది.. ఒకటి కాదు.. రెండు కాదు.. చాలా రూపాల్లో వేటాడుతుంది. కొందరికి కొన్ని రూపాలను చూస్తే భయం.. కొందరికి కొన్ని ప్రాంతాలకు వెళ్తే భయం.. కొందరికి పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చినా భయం కలుగుతుంది.. వీటన్నింటికీ కారణాలు ఏమిటి? మెదడులో జరిగే రసాయనిక ప్రక్రియలో సంతులనం తప్పితే వచ్చే అనర్థాలివి. ప్రతి వాళ్లలోనూ భయం ఛాయలు ఉంటాయి.. ఎవరూ బయటపడరు.. ఎప్పుడూ అవి కనిపించవు.. ఇవి ఉన్నట్లు కూడా వారికి తెలియదు.. చిన్న విషయం పెద్దదై… చూస్తుండగానే భయంకరమైందిగా మారిపోతుంది. పాలుగారే పిల్లవాడు పరుగులు పెట్టి డాలర్లు సంపాదించాలనే ట్రెండ్ ఉన్న సొసైటీ మనది.. ఈ ఒత్తిడి పిల్లలపై పడి.. నూటికి నూరుశాతం మార్కులు రాకపోతే ఏమవుతుందోనన్న టెన్షన్ భయంగా మారి డిప్రెషన్‌లోకి వెళ్లిన సందర్భాలు ఎన్నెన్నో.. సరదాగా చదువుకోవాల్సిన పిల్లలు భయంతో చదువుతున్నారు.. ఈ భయం వాళ్లను బలవన్మరణానికి పురికొల్పుతోంది. నిజానికి ఈ భయం అనవసరమైంది.. కానీ, దీన్ని సృష్టించింది మన సొసైటీయే.. పసివాళ్ల లేత నరాలను చదువు పేరుతో పట్టి పిండేస్తున్నదీ సొసైటీ. ఆడపిల్లల్లో ఈ ఫోబియా మరీ దారుణం.. చిన్నప్పుడు కుటుంబంలో.. పెద్దయిన కొద్దీ స్కూల్‌లో, ఉద్యోగంలో.. లైంగిక వేధింపులు వాళ్ల మానసిక పరిస్థితిని ఛిద్రం చేస్తుంది.. ఇది పెరుగుతున్న కొద్దీ డిప్రెషన్‌లోకి మారుతుంది.. అర్థంతరంగా జీవితాన్ని ముగించాలన్న భయంకరమైన నిర్ణయాన్ని తీసుకునే స్థితిని కలిపిస్తుంది. భయం చిన్నగానే మొదలవుతుంది.. అది పెద్దగా మారుతున్నప్పుడే మెదడులో టెన్షన్ పెరుగుతుంది.. ఆ ఒత్తిడి నుంచి బయటపడటం అంత తేలికైన విషయం కాదు. ఏ రకమైన భయం ఎందుకు కలుగుతుందో తెలియని పరిస్థితి… ఈ భయాలు ఎలా ఉంటాయంటే వినటానికి సిల్లీగా.. మనకే నవ్వు వచ్చేలా ఉంటాయి.. కానీ, భయపడుతున్న వ్యక్తికి మాత్రం అది ఒక పెను ముప్పుగా కనిపిస్తుంది.. ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు జనాలను వేధిస్తున్నాయో మీకు తెలుసా. పదివేల వరకూ ఉన్నాయిట. ఫోబియా అనేది విచిత్రం.. దానికి ఎలాంటి కారణాలు ఉండవు.. ఎందుకు కలుగుతుందో తెలియదు.. దానికి చిన్నాపెద్దా తేడా ఉండదు.. ఊహ తెలియని రోజుల్లో ఎప్పుడో ఏదో రకంగా పుట్టిన భయం.. జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. మాడొన్నా. ఆ వంపులు వయ్యారంగా సయ్యాటలాడుతుంటే, కళ్లల్లో కసి రేపుతుంటే, కనుగుడ్డు కదిలించకుండా చూడని వాడు ఈ తరంలో ఎవరుంటారు చెప్పండి. ఇంతటి మడొన్నాకు ఓ ఫోబియా ఉంది.. పది కిలోమీటర్ల దూరంలో పిడుగు పడిన శబ్దం వినిపించినా ఇంతే సంగతులు.. బెడ్‌పై ఎగిరి గంతేసి భయంతో దుప్పటి కప్పేసుకుంటుంది. నికొల్ కిడ్‌మాన్….. కొన్నేళ్ల క్రితం ఆస్కార్‌లో హల్‌చల్ సృష్టించిన లేడీ బాస్.. హాలీవుడ్‌ను ఒక ఊపేసిన బ్యూటీస్టార్. ఈ హాలీవుడ్ బ్యూటీకి నేచర్‌లో ఈమెతో పోటీ పడుతున్న బ్యూటీ బటర్‌ఫ్లైస్ అంటే చాలా భయం..షూటింగ్ స్పాట్‌లో ఒక బటర్‌ఫ్లై కనిపించినా ప్యాకప్పే. స్కార్లెట్ జాన్సన్… అమెరికన్ బ్యూటీ.. నటి.. సింగర్.. ఈ న్యూయార్క్ బేబీ అమెరికన్లనే కాదు.. ప్రపంచ ఇంగ్లీష్ మూవీ వ్యూయర్స్ మనసుల్ని ఇట్టే కొల్లగొట్టేసింది. ఇంతటి పుత్తడి బొమ్మ దేన్ని చూస్తే భయపడుతుందో తెలుసా.. కాక్రోచెస్.. సింపుల్‌గా బొద్దింక.. అది ఏమీ చేయదని తెలుసు.. కానీ, అదంటే మాత్రం ఏదో తెలియని భయం. బాలీవుడ్ సెక్సీగాళ్.. కంగనా రనౌత్. కళ్లతోనే కైపెక్కించే ఈ ముద్దుగుమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంత గొప్ప స్టార్‌కు కార్ లేకుండా ఎలా ఉంటుంది? కానీ, ఆమెకు కారు నడపాలంటే భయం. కనీసం ముంబైలోని తన ఫ్లాట్ ఆవరణలో నడపాలన్నా గువ్వలా వణికిపోతుంది. బిపాషా బసు.. బాలీవుడ్‌లో సెక్సీలెగ్ సుందరి.. ఈ అమ్మడితో నటించేందుకు బాలీవుడ్ హీరోలు క్యూ కట్టేస్తారు. ఈమెకు ఉన్న ఫోబియా ఏంటో తెలుసా… సెల్‌ఫోన్‌లో మాట్లాడటం.. సెల్‌ఫోన్‌ను ముట్టుకోవటం.. ఎవరైనా ఫోన్ చేస్తే.. ఎస్‌ఎంఎస్ ఇవ్వండి అంటుందిట.. ఆ ఎస్‌ఎంఎస్‌ను సెక్రటరీ చదివి చెప్తే.. అవసరమైతే, ల్యాండ్‌లైన్ నుంచి కాల్ చేసి జవాబిస్తుందిట. అసలు ఇవన్నీ భయాలేనా? బొద్దింకల్ని, సీతాకోక చిలుకల్ని చూస్తే భయపడటం ఏమిటి? అదే విచిత్రం.. వీటినే ఫోబియాలంటారు… ఎవరికి, దేన్ని చూస్తే, ఎందుకు భయమో అర్థం కాదు.. వారికే తెలియదు.. కారణాలు ఉండవు.. మనసులో ఏదో మూలన నక్కి ఉన్న గుబులు.. ఒక్కసారిగా బయటపడుతుంది.. శరీరంలోని అన్ని నరాలను కుదిపేస్తుంది. బ్రెయిన్‌ను ఇన్‌బ్యాలెన్స్ చేస్తుంది. ఇరవై ఏళ్ల పాటు ఏ అలజడీ తెలియని ఓ అమ్మాయికి ఒక్కసారిగా ఉలికిపాటు మొదలవుతుంది.. టెలివిజన్‌లో మూవీ మసాలా వస్తోంది. అంతలోనే ఆందోళన.. తన వెనుక ఎవరో ఉన్నారన్న భ్రమ.. వెన్నుపూసలో వణుకు పుట్టిస్తుంది.
ప్రియుడితో సరదాగా కబుర్లు చెప్తుంటే ఏదో దయ్యం తననే చూస్తున్నదన్న ఆలోచన ప్రియురాలికి చెమటలు పట్టిస్తుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. వేల రకాల భయాలు.. ఫోబియాలు ప్రజల్ని చిత్తడి చేస్తున్నాయి. తన భయానికి పరిష్కారమే లేదన్న ఆందోళన, జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుంది.. తమలో కలుగుతున్న ఆందోళన ఏమిటని విశ్లేషించుకోలేరు.. తాము ఊహించుకున్నదే కరెక్టని అనుకుంటారు.. ఎవరితోనూ తమ భయాన్ని పంచుకోరు.. ఒకవేళ ఎవరికైనా చెప్పినా.. వారు చెప్పే మంచి మాటలకు అంత తేలిగ్గా కన్విన్స్ కారు. ఆ క్షణం వరకు కాస్త కన్విన్స్ అయినట్లు కనిపించినా.. లోలోపల గుబులు వెంటాడుతూనే ఉంటుంది. రకరకాల ఫోబియాలతో బాధ పడుతున్న వారి సంఖ్య మన దేశంలోనే దాదాపు ఆరు కోట్ల మంది దాకా ఉందంట.. అన్నీ ఉన్న అమెరికాలాంటి అగ్రదేశంలోనే 50 లక్షల మంది ఈ ఫోబియాలతో అల్లాడిపోతుంటే ఇక మన దేశం సంగతి చెప్పేదేముంది? ఆడపిల్లల్లో చిన్ననాట లైంగిక వేధింపులకు గురైతే.. దాని భయం.. పెద్దయ్యాక పడకగదిలో కూడా వెంటాడుతుంది..వింత వింతగా ప్రవర్తిస్తారు.. కారణాలు తెలియక, సరైన కౌన్సిలింగ్ చేయలేకపోవటం మహిళల పట్ల సమస్యాత్మకంగా మారుతోంది..
ఫోబియా.. భయం.. ఇదేమీ చిన్న విషయం కాదు.. అలా అని నిజంగా భయపడి పారిపోయేంత పెద్ద విషయమూ కాదు.. మనిషి లోపలి పొరల్లో దాక్కున్న దౌర్బల్యం అతణ్ణి ఫోబియా ఊబిలోకి కూరుకుపోయేలా చేస్తోంది.. అందుకే గుండె దిటవుగా ఉంటేనే ధైర్యం.. అది జారిపోతే………………………….అదే భయం.

Reviews

There are no reviews yet.

Be the first to review “ఒళ్లు వణికిపోతోంది
కోవెల సంతోష్ కుమార్”

Your email address will not be published. Required fields are marked *